నీ సహనానికి..సలాం

- పుజారాపై ప్రశంసల వెల్లువ
నిన్న మొన్న అరంగేట్రం చేసిన ఆటగాళ్లు కూడా.. పొట్టి క్రికెట్లో దుమ్మురేపుతూ కోట్లు కొల్లగొడుతుంటే.. అతడు మాత్రం సుదీర్ఘ ఫార్మాట్‌కే పరిమితమై తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. కాసుల పంట పండించే ఐపీఎల్ కంటే.. టెక్నిక్‌ను మెరుగుపరిచే రంజీలవైపే మొగ్గుచూపాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన అతడు.. ఈ సారి తన సహనంతో కంగారూలకు పరీక్ష పెట్టాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 928 బంతులు ఎదుర్కొన్న ఆ ఆటగాడు మరెవరో కాదు.. నయావాల్ చతేశ్వర్ పుజారా.
బ్రిస్బేన్ టెస్టు చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన చర్చంతా పుజారా వికెట్ చుట్టే తిరిగింది. కోహ్లీ లేని భారత బ్యాటింగ్ లైనప్‌లో పుజ్జీని పడగొడితే మ్యాచ్ చేజిక్కినట్లే అని కంగారూలు ప్లాన్లు వేసినా.. వాటిని పుజారా తనదైన శైలిలో తిప్పికొట్టాడు. ఒక దశలో అతడి వికెట్ తీయలేమని భావించిన ఆసీస్ పేసర్లు బాడీ లైన్ బౌలింగ్‌తో బెంబేలెత్తించినా.. ఏమాత్రం వెనుకంజ వేయలేదు. వందల సంఖ్యలో బంతులనెదుర్కొన్న పుజ్జీ.. పదుల సంఖ్యలో గాయాలైనా తట్టుకొని మొండిగా నిలబడి.. జట్టును నిలబెట్టాడు. ఆసీస్ గడ్డపై అతడు కనబర్చిన సహనాన్ని ఓసారి గుర్తుచేసుకుంటే..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: ‘పుజారా ఆసీస్ పేసర్ల సత్తువను పిండేయడంతోనే.. చివర్లో వాళ్లు బౌలింగ్ చేసేందుకు ఓపిక లేనంతగా అలసిపోయారు’ సిరీస్ ఫలితం అనంతరం సామాజిక మాధ్యమాల్లో కనిపించిన వ్యాఖ్య ఇది. బ్రిస్బేన్ టెస్టులో శుభ్‌మన్ గిల్ ఆరంభం.. రిషబ్ పంత్ ఫినిషింగ్ టచ్‌కు ఎంత ప్రాధాన్యత ఉందో.. పుజారా పోరాటానికి అంతకుమించి విలువ ఉందనేది వాస్తవం. ఆ మాటకొస్తే.. సిరీస్ ఆరంభం నుంచి పుజారా ఒకే గేమ్‌ప్లాన్ కొనసాగించినట్లు కనిపించింది. కంగారూ పేసర్లను అలవగొట్టడమే తన కర్తవ్యం అన్నట్లు పుజ్జీ పోరాటం సాగింది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓపెనర్లు తక్కువ పరుగులకే వెనుదిరిగిన సమయంలో.. పుజారా క్రీజులో పాతుకుపోయాడు. 160 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో జట్టు మొత్తం మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో టీమ్ఇండియా ఘోర పరాభవం ఎదుర్కోవాల్సి వచ్చింది. కోహ్లీ గైర్హాజరీలో మిగిలిన మూడు టెస్టుల్లోనూ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలువాల్సిన పుజారా.. మెల్బోర్న్ టెస్టులో చేసింది 17 పరుగులే అయినా.. అందుకోసం అతడు 70 బంతుల పాటు క్రీజులో నిలిచాడు. రహానే సెంచరీకి బౌలర్ల శ్రమ తోడవడంతో భారత్ ఆ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది.
దాదాపు పది గంటలు..
సిడ్నీ టెస్టుకు వచ్చేసరికి పుజారాలోని అసలు సిసలు టెస్టు బ్యాట్స్‌మన్ బయటకు వచ్చాడు. కమిన్స్, స్టార్క్, హజిల్‌వుడ్ నిప్పులు చెరుగుతుంటే.. వికెట్ల ముందు గోడ కట్టేసిన పుజ్జీ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం చేసేందుకు 176 బంతులు తీసుకున్నాడు. అప్పటి వరకు అతడి కెరీర్లో ఇదే నెమ్మదైన హాఫ్‌సెంచరీ కావడం గమనార్హం. ఇక రెండో ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులో అడుగుపెట్టిన పుజారా ఆసీస్ బౌలర్లకు తన దుర్భేద్యమైన డిఫెన్స్‌తో చుక్కలు చూపాడు. 205 బంతులు ఎదుర్కొని 77 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రహానే విఫలమైనా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా పుజారా పని పూర్తిచేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 381 బంతులు ఎదుర్కొన్న పుజ్జీ.. దాదాపు పది గంటల పాటు క్రీజులో నిలిచాడంటే అతడి సహనానికి సలాం అనక తప్పదు.
ఓపికకు ప్రతిరూపం..
సిరీస్ ముందుకు సాగుతున్న కొద్ది పుజారా ఓపిక రెట్టింపు అవుతూ పోయింది. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 94 బంతులెదుర్కొన్న అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 211 బంతులు కాచుకున్నాడు. 18 పరుగులకే రోహిత్ శర్మ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన పుజారా తన అనుభవాన్నంతా రంగరిస్తూ.. శుభ్‌మన్ గిల్‌ను ముందుకు నడిపించాడు. ఖాతా తెరిచేందుకు 21 బంతులు తీసుకున్న పుజ్జీ.. 94 బంతుల్లో 8 పరుగులు చేసి ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు. పుజారాను ఎలా ఔట్ చేయాలా అని కంగారూలు ఆలోచిస్తున్న తరుణంలో మరో ఎండ్ నుంచి గిల్ ఎదురుదాడికి దిగి లక్ష్యాన్ని కరిగించాడు. క్రీజులో ఉన్నంతసేపు వేగంగా ఆడిన రహానే ఔటైనా.. పుజారా మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఓవర్లకు ఓవర్లు తినేస్తూ.. ఆసీస్ బౌలర్ల ఒంట్లో శక్తిని జర్రుకున్నాడు. ఫలితంగా ఆట మూడో సెషన్‌కు వెళ్లింది. మ్యాచ్ ముగియడానికి కాసేపు ముందు ఆసీస్ కెప్టెన్ పైన్.. కమిన్స్‌కు బంతినిచ్చేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
కొత్త బంతి తీసుకున్నాక పుజారా ఔటైనా.. అప్పటికే కంగారూ పేసర్లు అలిసిపోవడంతో పాటు లక్ష్యం చేరువవడంతో రిషబ్ పంత్ చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొమ్మిదో ఓవర్లో మైదానంలో అడుగుపెట్టిన పుజ్జీ.. 81 వ ఓవర్లో పెవిలియన్ చేరాడంటే అతడు ఎంత ఓపికగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు.
దెబ్బ తగిలిన చోటల్లా.. ముద్దుపెడతా
గబ్బాలో ప్రత్యర్థి బంతులు బుల్లెట్లలో శరీరాన్ని గాయపరుస్తున్న సమయంలో పుజారా మనసులో తన కూతురు అన్న మాటలే గుర్తుకు తెచ్చుకున్నట్లు సిరీస్ అనంతరం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. బ్యాటింగ్ చేసేందుకు వెళ్లడానికి ముందు ‘నాన్నా నీకు ఎక్కడెక్కడ గాయాలవుతాయో.. అక్కడక్కడ నేను ముద్దు పెడతా’ అని రెండేండ్ల చిన్నారి అదితి పుజారా చెప్పడం తనలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నాడు.
గబ్బాలో మొత్తం 11 సార్లు పుజారా శరీరాన్ని బంతి గాయపరిచింది. అతడు 211 బంతులు ఎదుర్కొంటే.. అందులో ప్రతి 19 బంతుల తర్వాత ఒకసారి అతడిని బంతి ఢీకొట్టింది.
తాజావార్తలు
- 50 కోట్ల క్లబ్బులో ఉప్పెన
- ఆయనను ప్రజలు తిరస్కరించారు : మంత్రి హరీశ్‌రావు
- సీఎం అల్లుడు, మరో ఇద్దరికి జ్యుడీషియల్ రిమాండ్
- భారీ ఆఫర్‌కు నో చెప్పిన వరంగల్ హీరోయిన్..!
- బెంగాల్ పోరు : కాషాయ పార్టీలోకి దాదా ఎంట్రీపై దిలీప్ ఘోష్ క్లారిటీ!
- పట్టభద్రులూ ఆలోచించి ఓటు వేయండి : మంత్రి నిరంజన్‌రెడ్డి
- బెంగాల్ పోరు : తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి
- 13 అడుగుల భారీ కొండచిలువ..!
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా