గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 21, 2020 , 17:13:08

T20 World Cup: ఉత్కంఠ పోరులో భారత్‌ ఘన విజయం

T20 World Cup: ఉత్కంఠ పోరులో భారత్‌ ఘన విజయం

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత మహిళల జట్టు మెగా టోర్నీలో బోణీ కొట్టింది.

సిడ్నీ:  మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆరంభ పోరులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత మహిళల జట్టు మెగా టోర్నీలో   బోణీ కొట్టింది. మహిళల టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌(గ్రూప్‌-ఏ)లో   ఆస్ట్రేలియాపై భారత్‌ 17 పరుగుల తేడాతో గెలుపొందింది.  పూనమ్‌ యాదవ్‌(4/19), శిఖా పాండే(3/14) సంచలన ప్రదర్శన చేసి భారత్‌కు విజయాన్నందించారు.  బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ఆసీస్‌ను టీమ్‌ఇండియా బౌలర్లు బోల్తా కొట్టించారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విజయం సాధించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆతిథ్య జట్టును కుప్పకూల్చారు.  ఛేదనలో ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 115 పరుగులకే చేతులెత్తేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును పూనమ్‌ అందుకుంది. 

భారత్‌ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్‌  అలీసా హీలీ(51: 35బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ధశతకంతో విజృంభించడంతో కంగారూలు అలవోకగా గెలుస్తారని అంతా అనుకున్నారు. ఐతే పూనమ్‌, శిఖా అనూహ్యంగా చెలరేగిపోవడంతో మిగతా బ్యాట్స్‌వుమెన్‌ వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. ఒకానొక దశలో  55 2తో పటిష్టంగా ఉన్న ఆసీస్‌ను పూనమ్‌ యాదవ్‌ భారీ దెబ్బకొట్టింది. టాప్‌ బ్యాట్స్‌మెన్‌ను  ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చేసింది. ఆఖరివరకు ఉత్కంఠగా సాగినప్పటికీ భారత బౌలర్లు పట్టువదలకుండా పోరాడటంతో  ఆసీస్‌ మరో బంతి మిగిలుండగానే ఆలౌటైంది.  వికెట్ల వెనకాల భారత వికెట్‌ కీపర్‌ తానియా భాటియా కళ్లుచెదిరే స్టంపింగ్స్‌ అలరించింది. రెండు క్యాచ్‌లు.. రెండు స్టంపింగ్స్‌ చేసి భారత్‌ విజయంలో కీలక పాత్రపోషించింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులే చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ(49: 46 బంతుల్లో 3ఫోర్లు), షఫాలీ వర్మ(29), జెమీమా రోడ్రిగ్స్‌(26) మాత్రమే రాణించారు. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కేవలం రెండు పరుగులకే వెనుదిరగడంతో భారత్‌ భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆసీస్‌ బౌలర్లలో జెస్‌ జొనాసెన్‌ రెండు వికెట్లు పడగొట్టగా..ఎలిస్‌ పెర్రీ, కిమ్మిన్స్‌ చెరో వికెట్‌ తీశారు.  
logo
>>>>>>