శనివారం 28 మార్చి 2020
Sports - Feb 23, 2020 , 00:25:31

క్రీడా విప్లవానికి ఇది నాంది

క్రీడా విప్లవానికి ఇది నాంది
  • ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలను ప్రారంభించిన ప్రధాని మోదీ

కటక్‌: ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు దేశంలో క్రీడా విప్లవానికి నాంది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం కటక్‌ వేదికగా తొలి ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ మాట్లాడారు. ‘ఒడిశాలో ఈరోజు కొత్త చరిత్ర మొదలైంది. భారత దేశ క్రీడా చరిత్రలో ఇది చరిత్రాత్మక సందర్భం మాత్రమే కాదు..ఒక గొప్ప ముందడుగు. యువ అథ్లెట్లకు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ మంచి వేదిక. సామర్థ్యానికి తగ్గట్లు రాణించేందుకు యువతకు అవకాశం. 


దేశవ్యాప్తంగా అద్భుత ప్రతిభ కల్గిన క్రీడాకారులను వెలికితీయడంలో ఖేలోఇండియా ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. ఈ గేమ్స్‌ ద్వారా దేశంలో క్రీడా వసతి, సౌకర్యాలు మరింత మెరుగయ్యాయి. టైర్‌-2, 3 సిటీల నుంచి మెరికల్లాంటి క్రీడాకారులు దూసుకొస్తున్నారు. వీరంతా దేశానికి కొత్త ఆశలు చిగురింపచేస్తున్నారు. అథ్లెట్ల ఎంపిక విషయంలో మేము పూర్తి పారదర్శకత పాటిస్తున్నాం, దీనివల్లే అంతర్జాతీయస్థాయిలో మెరుగ్గా రాణిస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు’అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో పాటు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, స్పోర్ట్స్‌ సెక్రటరీ రాధే శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 1 వరకు జరిగే గేమ్స్‌లో  మొత్తం 159 విశ్వవిద్యాలయాల నుంచి  3400 మంది అథ్లెట్లు 17 విభాగాల్లో పోటీపడుతున్నారు.


ఓయూ జట్టు ఇదే..

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బరిలోకి దిగుతున్నారు. ఇందులో టేబుల్‌ టెన్నిస్‌: ఫిడెల్‌ ఆర్‌ స్నేహిత్‌, అలీ, వ్రిశిన్‌, రఘురామ్‌, శశి కిరణ్‌, వరుణి జైస్వాల్‌, రచన, నివేదిత, హనీఫా ఖాతూన్‌, వించిత్ర యాదవ్‌, ఆర్చరీ: క్రాంతి కుమార్‌, షేక్‌ భాయ్‌జాన్‌, అథ్లెటిక్స్‌: నిత్య, సుచిత్ర, కీర్తి,  గంగోత్రి, అనురాగ, వెయిట్‌లిఫ్టింగ్‌: బీకే కాల, సుకన్య, బాక్సింగ్‌: నాగనిక్‌, తారా కురేస్తి, మోహిసిన్‌, లాన్‌టెన్నిస్‌: శ్రావ్య శివానీ, శ్రేయ, రాజ్‌మోహన్‌, అనూష, అధికారులు: లక్ష్మికాంత్‌ రాథోడ్‌, రాజేశ్‌ కుమార్‌, సునిల్‌ కుమార్‌, దీప్లా, శ్రీధర్‌ రెడ్డి, దీపిక, సయ్యద్‌ ఫారుఖ్‌


logo