సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 10, 2020 , 02:18:37

క్రీడాకారులు జాగ్రత్తలు పాటించాలి

క్రీడాకారులు జాగ్రత్తలు పాటించాలి

  • కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించాలి
  • రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజర్‌ భేటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రీడాకారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ మార్గదర్శకాలన్నీ పాటించాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. ఈ మేరకు క్రికెటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంత్రితో ఆయన నివాసంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ) అధ్యక్షుడు, టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ ఆదివారం సమావేశమయ్యారు. లాక్‌డౌన్‌ తర్వాత శిక్షణ సమయంలో క్రికెటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ ‘ప్రాక్టీస్‌ చేసేటప్పుడు క్రీడాకారులు గుంపులుగా ఉండకుండా భౌతికదూరం పాటించాలి. షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకోకూడదు. తరచూ శానిటైజర్‌ వినియోగించాలి. బౌలర్లు బంతికి ఉమ్మి రాయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రీడాకారుల ఆరోగ్యం ప్రభుత్వానికి ప్రాధాన్యం’ అని అన్నారు. అలాగే ప్రభుత్వం సూచించిన కొవిడ్‌-19 మార్గదర్శకాలను క్రికెటర్లందరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని అజారుద్దీన్‌కి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సూచించారు. 


logo