మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 21, 2020 , 00:12:27

అమ్మాయిల పసిడి పట్టు

అమ్మాయిల పసిడి పట్టు
  • మూడు స్వర్ణాలతో చరిత్ర సృష్టించిన భారత మహిళా రెజ్లర్లు ..
  • ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: భారత మహిళా రెజ్లర్లు సత్తాచాటారు. ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల పోటీల తొలిరోజే మూడు స్వర్ణాలు సాధించి విజయఢంకా మోగించారు. గురువారం ఇక్కడ జరిగిన పోటీల్లో మన రెజ్లర్లు దివ్యా కక్రాన్‌(68కేజీలు), సరితా మోర్‌(59కేజీలు), పింకీ(55కేజీలు) వారి విభాగాల్లో చెరో స్వర్ణాన్ని చేజిక్కించుకున్నారు. నిర్మలా దేవి(50కేజీలు) తుదిపోరులో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. భారత్‌ తరఫున ఐదుగురు బరిలోకి దిగగా.. కిరణ్‌(76కేజీలు) మినహా మిగిలిన వారందరూ పతకాలతో మెరువడం విశేషం. కాగా, ఇంతవరకు సీనియర్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక్క స్వర్ణమే(2018లో నవ్‌జ్యోత్‌ కౌర్‌) దక్కగా... ఈసారి మనవాళ్లు ఏకంగా ఒకే రోజు ముగ్గురు స్వర్ణాలను సాధించి చరిత్ర సృష్టించారు.  


68కేజీలు పోటీలో దివ్య అన్ని బౌట్లలోనూ గెలిచి సత్తాచాటింది. అల్బినా కైర్గెలినోవా(కజకిస్థాన్‌), డెల్గెరమ ఎంక్‌సైకన్‌(మంగోలియా)పై తొలి రెండో రౌండ్లలో గెలిచిన కక్రాన్‌.. మూడో రౌండ్‌లో అజోడా ఎస్బెర్‌జెనోవాను కేవలం 27సెకన్లలోనే మట్టికరిపించింది. ఆ తర్వాత జపాన్‌ ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌ నరుహా మత్సుయుకిపై 6-4తో నెగ్గి ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారత రెండో మహిళా రెజ్లర్‌గా నిలిచింది.  ఆ తర్వాత సరిత సైతం అన్ని బౌట్లలో దుమ్మురేపగా.. ఫైనల్లో అట్లాంట్‌సెట్సెగ్‌(మంగోలియా)పై 3-2తో గెలిచి పసిడి పట్టింది. తొలిసారి సీనియర్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టిన పింకీ ఫైనల్లో దుల్గున్‌ బోలోర్మా(మంగోలియా)పై 2-1తో గెలిచి స్వర్ణం దక్కించుకుంది. 


logo
>>>>>>