శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Feb 03, 2021 , 16:43:21

ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. భారత జట్టులో కీలక మార్పులుంటాయా ?

ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. భారత జట్టులో కీలక మార్పులుంటాయా ?

చెన్నై: ఆస్ట్రేలియా పర్యటనలో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ విజయం సాధించిన భారత్‌  స్వదేశంలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు రెడీ అవుతోంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ  జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు.  గాయం నుంచి కోలుకున్న సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మతో పాటు ఆసీస్‌ టూర్‌లో గాయపడి తాజాగా కోలుకున్న పలువురు ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం జట్టులో ఉన్న వారంతా ఫామ్‌లో  ఉండటంతో  తుది జట్టు ఎంపిక టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది.

ఒక్కో స్థానానికి కనీసం ఇద్దరు ఆటగాళ్ల పోటీపడుతున్నారు. ముఖ్యంగా ఆసీస్‌ పర్యటనలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న బౌలర్లు ఇంగ్లీష్‌ జట్టుతో టెస్టుల్లో ఆడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తుది జట్టు ఎలా ఉండబోతోందనే చర్చ  జరుగుతుండగా ఇంగ్లాండ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దని, స్వదేశీ పిచ్‌లకు అనుగుణంగా జట్టు ఎంపిక ఉండాలని మాజీలు సూచిస్తున్నారు.  ఐదుగురు బౌలర్లా? లేక ఆరుగురు బ్యాట్స్‌మెన్లతో బరిలో దిగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. 

రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనింగ్‌ స్థానం కోసం పోటీపడుతున్నారు. కంగారూలతో సిరీస్‌లో   రోహిత్‌, గిల్‌ రాణించడంతో ఈ జోడీ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. మూడో నంబర్‌లో టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా.. నాలుగో స్థానంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగనున్నారు. కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌గా లేకపోవడంతో తొలి టెస్టుకు అతన్ని ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తోంది. 

వైఎస్‌ కెప్టెన్‌ రహానె ఒకస్థానం కిందకి అంటే ఐదో స్థానంలో  బరిలో దిగనున్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో టాప్‌-5 వరకు ఓ క్లారిటీతో ఉన్న కెప్టెన్‌ విరాట్‌, కోచ్‌ రవిశాస్త్రి ఆరో స్థానంపై దృష్టిసారించారు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో మినహా..హనుమ విహారీ ఆరోస్థానంలో వచ్చాడు. తొడకండరాల గాయంతో విహారీ వైదొలగడంతో ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మయాంక్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.  భారత్‌ నలుగురు బౌలర్లను మాత్రమే ఆడించాలనుకుంటే అదనపు బ్యాట్స్‌మన్‌గా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను తీసుకోవడానికి కోహ్లీ మొగ్గు చూపొచ్చు. 

ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొన్న పాండ్య..2018 నుంచి టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. వెన్ను  సర్జరీ చేయించుకోవడంతో బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఐతే బ్యాటింగ్‌లో మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు.  పాండ్య బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు బ్యాటింగ్‌ చేయగల  స్పిన్నర్లను ఎంచుకునే ఛాన్స్‌ ఉంది. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌  ఎలాగూ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. ఇషాంత్‌ శర్మ, బుమ్రా పేస్‌ భారాన్ని మోయనున్నారు.  భారత్‌ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగాలనుకుంటే మూడో పేసర్‌గా మహ్మద్‌ సిరాజ్‌, రెండో స్పిన్నర్‌గా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు చోటు దక్కొచ్చు. 

VIDEOS

logo