మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 10, 2020 , 02:43:03

బెంగళూరుదే టైటిల్‌

బెంగళూరుదే టైటిల్‌
  • పీబీఎల్‌ ఫైనల్లో నార్త్‌ఈస్టర్న్‌పై గెలుపు.. రెండోసారి విజేతగా నిలిచిన రాప్టర్స్‌

హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో బెంగళూరు రాప్టర్స్‌ మరోసారి విజేతగా నిలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో ఐదో సీజన్‌లో అడుగుపెట్టిన రాప్టర్స్‌ ఎదురులేని ఆటతో టైటిల్‌ నిలబెట్టుకుంది. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తుదిపోరులో బెంగళూరు 4-2తో నార్త్‌ ఈస్టెర్న్‌ వారియర్స్‌పై విజయఢంకా మోగించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్‌, మహిళల సింగిల్స్‌ ప్రపంచ రెండో ర్యాంకర్‌ తై జూ యింగ్‌ రాప్టర్స్‌ను విజయ తీరాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు.


ఫైనల్లో తొలుత పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ జరుగగా.. రాప్టర్స్‌ ఆటగాడు సాయి ప్రణీత్‌ 14-15, 15-9, 15-3తో లీ చెక్‌ యూపై విజయం సాధించి, శుభారంభం చేశాడు. ఆ తర్వాత ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న పురుషుల డబుల్స్‌లో షాక్‌ తగలడంతో బెంగళూరు వెనుకబడింది. అనంతరం మహిళల సింగిల్స్‌లో రాప్టర్స్‌ స్టార్‌ ప్లేయర్‌ తై జూ యింగ్‌ 15-9, 15-12తో నార్త్‌ఈస్ట్‌ క్రీడాకారిణి మిచెల్‌ లీపై సునాయాస విజయం సాధించింది. ఆ తర్వాత ప్రత్యర్థి జట్టు ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బెంగళూరు జోడీ చాంగ్‌ పెంగ్‌ సూన్‌-ఈవోమ్‌ హేవోన్‌ ఉత్కంఠ పోరులో విజయం సాధించడంతో రాప్టర్స్‌ గెలుపు ఖాయమైంది. 


logo
>>>>>>