e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 12, 2021
Advertisement
Home స్పోర్ట్స్ పంత్‌ పవర్‌

పంత్‌ పవర్‌

భారత్‌ 294/7 l 89 పరుగుల ఆధిక్యంలో కోహ్లీసేన 

సుందర్‌ అజేయ అర్ధశతకం

శతక్కొట్టిన రిషబ్‌

ఆదుకుంటా డనుకున్న చతేశ్వర్‌ పుజారా ఆకట్టుకోలేకపోగా.. టీమ్‌ఇండియా మూలవిరాట్‌ కోహ్లీ.. సిరీస్‌లో రెండోసారి డకౌటై నిరాశ పరిచాడు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ ధాటిగానే ఆడినా.. మరో ఎండ్‌లో అజింక్యా రహానే సహకరించలేకపోయాడు. వారి బాటలోనే అశ్విన్‌ కూడా డగౌట్‌ బాటపట్టడంతో భారత జట్టు 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 

ఇంకేముంది భారత్‌ కూడా చాప చుట్టేస్తుందేమో అనుకుంటున్న తరుణంలో.. రిషబ్‌ పంత్‌ తన సహజసిద్ధ ఆటతో అదరగొట్టాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండ్రీలతో రెచ్చిపోయాడు. వన్డేనూ తలపిస్తూ చూస్తుండగానే సెంచరీ కొట్టేయడంతో టీమ్‌ఇండియా తిరిగి పుంజుకుంది. పంత్‌కు తోడు సుందర్‌ అజేయ అర్ధశతకం సాధించడంతో నాలుగో టెస్టుపై కోహ్లీసేన పట్టు బిగించింది. 

అహ్మదాబాద్‌: టాపార్డర్‌ విఫలమైన చోట లోయర్‌ ఆర్డర్‌ సత్తాచాటడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టుపై టీమ్‌ఇండియా పట్టు బిగించింది. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ (118 బంతుల్లో 101; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్‌ సెంచరీతో రెచ్చిపోగా.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (117 బంతుల్లో 60 నాటౌట్‌; 8 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోవడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (49) రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్‌ 3, బెన్‌ స్టోక్స్‌, జాక్‌ లీచ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చేతిలో మూడు వికెట్లు ఉన్న టీమ్‌ఇండియా ప్రస్తుతం 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. సుందర్‌తో పాటు అక్షర్‌ పటేల్‌ (11) క్రీజులో ఉన్నాడు. మూడోరోజు మనవాళ్లు ఎంత ఆధిక్యం సాధిస్తారనేది ఆసక్తికరం!

కోహ్లీ డకౌట్‌

ఓవర్‌నైట్‌ స్కోరు 24/1తో శుక్రవారం రెండోరోజు ఆట కొనసాగించిన టీమ్‌ఇండియాకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. పుజారా (17) క్రితం రోజు స్కోరుకు మరో రెండు పరుగులే జోడించి ఔట్‌ కాగా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (0) బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియాను రోహిత్‌, అజింక్యా రహనే (27) ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 39 పరుగులు జోడించాక అండర్సన్‌ వేసిన అద్భుత బంతికి రహానే పెవిలియన్‌ బాటపట్టాడు. దీంతో 80/4తో భారత్‌ లంచ్‌ విరామానికి వెళ్లింది. రెండో సెషన్‌లో అర్ధశతకానికి ఒక పరుగు ముందు రోహిత్‌ వెనుదిరగగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌ (13) ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. 

పంత్‌ మ్యాట్నీ షో..

153/6తో చివరి సెషన్‌ ఆరంభించిన టీమ్‌ఇండియా.. మ్యాచ్‌ ముగిసేవరకు ఎదురులేకుండా సాగింది. తన వికెట్‌ విలువను గుర్తించి ఆరంభంలో నిధానంగా ఆడిన పంత్‌.. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అర్ధశతకం చేసేందుకు 82 బంతులు తీసుకున్న పంత్‌.. ఆ తర్వాత మరో 33 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ చేరాడు. గత మ్యాచ్‌లో ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగి మూల్యం చెల్లించుకున్న ఇంగ్లండ్‌ జట్టు.. ఈ సారి ముగ్గురే స్పెషలిస్ట్‌ బౌలర్లతో బోల్తా పడింది. తొలి రెండు సెషన్‌లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ బౌలర్లు మూడో సెషన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీన్ని అదునుగా తీసుకున్న ఈ జోడీ 26 ఓవర్లలో 113 పరుగులు రాబట్టింది. ఇటీవలి కాలంలో ఐదుసార్లు శతకానికి సమీపించి సెంచరీ మార్క్‌ అందుకోలేకపోయిన రిషబ్‌ ఎట్టకేలకు స్వదేశంలో తొలి శతకం నమోదు చేసుకున్నాడు. అయితే సెంచరీ అనంతరం పంత్‌ ఔటైనా.. బాదే బాధ్యత భుజానేసుకున్న వాషింగ్టన్‌ సుందర్‌ చూడచక్కటి షాట్లతో అలరించాడు. వీరిద్దరి ధాటికి భారత్‌ చివరి సెషన్‌లో 141 పరుగులు రాబట్టడం విశేషం. 

స్కోరు బోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 205, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: గిల్‌ (ఎల్బీ) అండర్సన్‌ 0, రోహిత్‌ (ఎల్బీ) స్టోక్స్‌ 49, పుజారా (ఎల్బీ) లీచ్‌ 17, కోహ్లీ (సి) ఫోక్స్‌ (బి) స్టోక్స్‌ 0, రహానే (సి) స్టోక్స్‌ (బి) అండర్సన్‌ 27, పంత్‌ (సి) రూట్‌ (బి) అండర్సన్‌ 101, అశ్విన్‌ (సి) పోప్‌ (బి) లీచ్‌ 13, సుందర్‌ (నాటౌట్‌) 60, అక్షర్‌ (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు: 16, మొత్తం: 294/7. వికెట్ల పతనం: 1-0, 2-40, 3-41, 4-80, 5-121, 6-146, 7-259, బౌలింగ్‌: అండర్సన్‌ 20-11-40-3, స్టోక్స్‌ 22-6-73-2, లీచ్‌ 23-5-66-2, బెస్‌ 15-1-56-0, రూట్‌ 14-1-46-0. 

కోహ్లీ చెత్త రికార్డు

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు (8) డకౌటైన భారత కెప్టెన్‌గా కోహ్లీ.. మహేంద్రసింగ్‌ ధోనీ సరసన చేరాడు. 2014 ఇంగ్లండ్‌ పర్యటన అనంతరం ఒకే సిరీస్‌లో రెండు సార్లు డకౌటవడం కోహ్లీకి ఇదే తొలిసారి.

మంచి బంతులను గౌరవించాలని.. చెత్తబంతులను శిక్షించాలని ముందే అనుకున్నా. బంతిని బట్టే స్పందించా. 206 పరుగులు చేయడమే తొలి లక్ష్యంగా క్రీజులోకి అడుగుపెట్టా. ఆరంభంలో రోహిత్‌తో మంచి భాగస్వామ్యం నమోదు చేయగలిగా.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలోకి వచ్చాక భారీ షాట్లు ఆడా. జట్టును గెలిపించడమే నా లక్ష్యం. దాంతో పాటు అభిమానులను అలరిస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది. 

-రిషబ్‌ పంత్‌ 

Advertisement
పంత్‌ పవర్‌

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement