శనివారం 23 జనవరి 2021
Sports - Jan 08, 2021 , 02:31:59

ఆసీస్‌దే తొలిరోజు

ఆసీస్‌దే తొలిరోజు

  • విల్‌ పకోస్కీ, లబుషేన్‌ అర్ధశతకాలు
  • సిరాజ్‌, సైనీకి ఒక్కో వికెట్‌.. వర్షం కారణంగా తొలి రోజు 55 ఓవర్ల ఆటే 

బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌.. ఆస్ట్రేలియాకు అండగా వరుణుడు.. పకోస్కీ అదిరిపోయే అరంగేట్రం.. రిషబ్‌ పంత్‌ తప్పిదాలు.. లబుషేన్‌ నిలకడ.. టచ్‌లోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌.. వెరసి మూడో టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. బుమ్రాను జాగ్రత్తగా కాచుకున్న కంగారూలు మిగిలిన వాళ్లను లక్ష్యంగా చేసుకొని పరుగులు రాబట్టారు. ఫ్లాట్‌ వికెట్‌పై రెండో రోజు ఆసీస్‌ ఎన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి!

‘పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తున్నది. గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే వికెట్‌ ఫ్లాట్‌గా ఉంది. ఇలాంటి చోట ఓపిక ముఖ్యం. చివరి సెషన్‌లో బంతి కాస్త స్పిన్‌ అయింది. శుక్రవారం ఉదయం ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడమే మా ప్లాన్‌. టీమ్‌ఇండియా తరఫున టెస్టు క్రికెట్‌ ఆడాలనేది మా నాన్న కల. అది గుర్తొచ్చి జాతీయ గీతాలాపన సమయంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయా’

- సిరాజ్‌

సిడ్నీ: తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. సిడ్నీలో ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేయలేకపోయారు. పిచ్‌ నుంచి సహకారం లభించకపోవడంతో పాటు వర్షం కారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన వికెట్‌పై ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆకట్టుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లబుషేన్‌ (67 బ్యాటింగ్‌), పకోస్కీ (62) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో హైదరాబాదీ మహమ్మద్‌ సిరాజ్‌, నవ్‌దీప్‌ సైనీ చెరో వికెట్‌ పడగొట్టారు. వర్షం కారణంగా గురువారం నాలుగు గంటల ఆట తుడిచిపెట్టుకుపోగా.. లబుషేన్‌తో పాటు స్మిత్‌ (31) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లు రెండో రోజు ప్రత్యర్థిని ఎంత స్కోరుకు పరిమితం చేస్తారనేది కీలకంగా మారింది. 

వార్నర్‌ వికెట్‌ పడ్డా..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. భారీ అంచనాల మధ్య క్రీజులోకి వచ్చిన డేవిడ్‌ వార్నర్‌ (5) నాలుగో ఓవర్‌లో ఔటయ్యాడు. కాసేపటికే వరుణుడి కారణంగా మ్యాచ్‌ ఆగిపోయింది. లంచ్‌ తర్వాత తిరిగి ఆట ఆరంభం కాగా.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పకోస్కీ, లబుషేన్‌ చెలరేగిపోయారు. బుమ్రాను జాగ్రత్తగా ఆడిన ఈ జోడీ.. సిరాజ్‌, సైనీలను లక్ష్యంగా చేసుకొని పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో పకోస్కీ ఇచ్చిన రెండు క్యాచ్‌లను పంత్‌ చేజార్చాడు. రెండో వికెట్‌కు 100 పరుగులు జోడించాక సైనీ ఈ జంటను విడదీశాడు. 

ఆకట్టకున్న స్మిత్‌..

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్మిత్‌.. సిడ్నీలో ఆకట్టుకున్నాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావద్దనే లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన అతడు ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. చకచకా బౌండ్రీలు బాదుతూ ఒత్తిడిని జయించే యత్నం చేశాడు. వన్డే సిరీస్‌లో ఇదే మైదానంలో వరుస మ్యాచ్‌ల్లో 62 బంతుల్లోనే శతకాలు బాదిన స్మిత్‌.. అదే స్ఫూర్తితో ముందుకు సాగాడు. 

సిరాజ్‌ భావోద్వేగం.. 


ఆట ఆరంభానికి ముందు జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ భావోద్వేగంతో  కంటతడి పెట్టుకున్నాడు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన అతడు  మెల్‌బోర్న్‌లో టెస్టులో అరంగేట్రం చేసి ఆకట్టుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇది అతడికి రెండో మ్యాచ్‌ కాగా.. ఆరంభంలోనే విధ్వంసకర ఓపెనర్‌ వార్నర్‌ను ఔట్‌ చేసి జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చాడు. సిరాజ్‌ కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. మహమ్మద్‌ కైఫ్‌, వసీం జాఫర్‌ వంటి మాజీ క్రికెటర్లు అతడి అంకితభావాన్ని కొనియాడారు.

ఒకటికి రెండు సార్లు.. 


రిషబ్‌ పంత్‌ తన పేలవ వికెట్‌ కీపింగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మన బౌలర్లు ఎంతో కష్టపడి సాధించిన అవకాశాలను అతడు చేజార్చాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న పకోస్కీకి ఒకటికి రెండు సార్లు లైఫ్‌ ఇచ్చాడు. 22వ ఓవర్లో అశ్విన్‌ వేసిన బంతి పకోస్కీ బ్యాట్‌ అంచును తాకి నేరుగా పంత్‌ చేతుల్లోకి వెళ్లగా.. క్యాచ్‌ పూర్తికాక ముందే గ్లౌజ్‌లు మూసిన పంత్‌.. లడ్డూ లాంటి క్యాచ్‌ను చేజార్చాడు. కాసేపటికే సిరాజ్‌ విసిరిన బౌన్సర్‌ పకోస్కీ చేతిని తాకి గాల్లోకి లేవగా.. దాన్ని అందుకోవడంలోనూ పంత్‌ విఫలమయ్యాడు. క్యాచ్‌ పూర్తైనట్లు భావించిన అంపైర్‌ తొలుత ఔట్‌ ఇవ్వగా.. రిప్లేలో బంతి నేలను తాకినట్లు స్పష్టమవడంతో పకోస్కీ మరోసారి బతికిపోయాడు. 

అరగంట ముందుగానే.. 

తొలిరోజు వర్షం కారణంగా నాలుగు గంటల ఆట తుడిచిపెట్టుకుపోవడంతో మిగిలిన నాలుగు రోజులు అరగంట ముందుగానే మ్యాచ్‌ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఆట తెల్లవారుజామున 4.30 గంటలకే మొదలు కానుంది. 

గులాబీమయం..


బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నివారణకు సంబంధించిన ప్రచారంలో భాగంగా ప్రతీ ఏడాదిలాగే సిడ్నీ టెస్టును పింక్‌ టెస్టుగా నిర్వహించారు. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు పింక్‌ క్యాప్‌లు ధరించగా.. వికెట్లు, హోర్డింగ్‌లు అన్నీ గులాబీ రంగు పులుముకున్నాయి. బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో మృతిచెందిన ఆసీస్‌ దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ భార్య జేన్‌ స్మారకార్థం సిడ్నీ టెస్టును పింక్‌ టెస్టుగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ ద్వారా సేకరించిన నిధుల్లో కొంత మొత్తాన్ని జేన్‌  మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌కు అందజేస్తారు.

తొలి మహిళ..


సుదీర్ఘ టెస్టు క్రికెట్‌ చరిత్రలో పురుషుల మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళగా క్లెయిర్‌ పొలొసాక్‌ (ఆస్ట్రేలియా) రికార్డుల్లోకెక్కింది. తాజా మ్యాచ్‌లో 32 ఏండ్ల క్లెయిర్‌ ఫోర్త్‌ అంపైర్‌గా వ్యవహరించింది. గతంలో డివిజన్‌-2 వన్డే లీగ్‌లో ఆన్‌ఫీల్డ్‌ అంపైరింగ్‌ చేసిన అనుభవం ఆమె సొంతం. 

సన్నీ.. ముంబై బ్రాడ్‌మన్‌ 

టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి గురువారం సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా రవి శాస్త్రి మాట్లాడుతూ.. ‘అప్పట్లో గవాస్కర్‌ను ముంబై బ్రాడ్‌మన్‌ అని పిలిచేవాళ్లం. టెస్టుల్లో అతడి పరుగుల దాహం అలా ఉండేది. సుదీర్ఘ ఫార్మాట్‌లో సన్నీ 34 శతకాలు చేయగా.. అరవీర భయంకరులైన విండీస్‌ పేసర్లను ఎదుర్కొంటూ చేసినవి అందులో 13 ఉన్నాయి’అని అన్నాడు.

సైనీ@ 299

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫర్వాలేదనిపిస్తూ.. గత కొంతకాలంగా జట్టుతోనే ఉంటున్న నవ్‌దీప్‌ సైనీ టెస్టు ఫార్మాట్‌లో భారత్‌ తరఫున బరిలో దిగిన 299వ ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఏస్‌ పేసర్‌ బుమ్రా.. సైనీకి క్యాప్‌ అందించి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు.

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: పకోస్కీ (ఎల్బీ) సైనీ 62, వార్నర్‌ (సి) పుజారా (బి) సిరాజ్‌ 5, లబుషేన్‌ (నాటౌట్‌) 67, స్మిత్‌ (నాటౌట్‌) 31, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 55 ఓవర్లలో 166/2. వికెట్ల పతనం: 1-6, 2-106, బౌలింగ్‌: బుమ్రా 14-3-30-0, సిరాజ్‌ 14-3-46-1అశ్విన్‌ 17-1-56-0, సైనీ 7-0-32-1, జడేజా 3-2-2-0. 


logo