e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home స్పోర్ట్స్ అదరహో..టోక్యో ఒలింపిక్స్‌ షురూ

అదరహో..టోక్యో ఒలింపిక్స్‌ షురూ

  • అంబరాన్నంటిన టోక్యో ఒలింపిక్స్‌ సంబురాలు
  • వెలుగు, జిలుగుల్లో ప్రారంభ వేడుకలు
  • జ్యోతి వెలిగించిన ఒసాకా
  • విశ్వక్రీడలను ప్రారంభించిన జపాన్‌ చక్రవర్తి
  • మువ్వన్నెల పతాకంతో మన్‌ప్రీత్‌, మేరీకోమ్‌
  • బెస్టాఫ్‌ లక్‌ చెప్పిన ప్రధాని మోదీ
  • పతకాలతో తిరిగి రావాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష

పదిహేడు రోజుల పాటు ప్రపంచ క్రీడాభిమానులను ఒక్కటి చేసే పండుగ రానే వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం కండ్ల ముందు సాక్షాత్కారమైంది. కరోనా మహమ్మారి వేళ.. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య టోక్యో ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ జపాన్‌ తమ దేశ చరిత్రను ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పింది. సుదీర్ఘ ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారిగా ప్రేక్షకులు లేకుండా పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య క్రీడా పండుగ అట్టహాసంగా జరిగింది. వైవిధ్యమైన సంగీత, నృత్య ప్రదర్శనలతో నేషనల్‌ స్టేడియం హోరెత్తిపోయింది. మ్యూనిచ్‌(1972) ఒలింపిక్స్‌ మృతులకు సంతాపం ప్రకటిస్తూ.. జపాన్‌ చక్రవర్తి నరుహిటో ఆటలను అధికారికంగా ప్రారంభించారు. పటాకుల వెలుగు, జిలుగుల్లో టోక్యో నగరం కొత్త సొబగులు అద్దుకున్నది. మన్‌ప్రీత్‌సింగ్‌, మేరీకోమ్‌.. మువ్వన్నెల పతాకాన్ని చేబూనగా భారత జట్టు సగర్వంగా ముందుకు నడిచింది. శతకోటి భారతావని ఆశలను మోసుకుంటూ టోక్యో గడ్డపై అడుగుపెట్టిన మనోళ్లు సత్తాచాటే సమయం ఆసన్నమైంది. విశ్వక్రీడా వేదికపై కీర్తి పతాకాన్ని రెపరెపలాడించేందుకు భారత్‌ సర్వశక్తులతో సిద్ధమైంది.

కరోనా మహమ్మారి విజృంభణతో స్తంభించి పోయిన క్రీడాలోకానికి జవసత్వాలు నింపుతూ.. యావత్‌ ప్రపంచాన్ని ఒకే వేదిక మీదకు చేర్చుతూ.. అంగరంగ వైభవంగా టోక్యో విశ్వక్రీడలకు అంకురార్పణ జరిగింది. జపాన్‌ సంప్రదాయాలు ఉట్టిపడేలా నాలుగున్నర గంటల పాటు సాగిన ప్రదర్శనలు చూపరులను కట్టిపడేయగా.. 1824 డ్రోన్‌కెమెరాల సాయంతో ఆకాశంలో ఆవిష్కృతమైన లోగో.. ప్రపంచ సౌభ్రాతృత్వాన్ని ఎలుగెత్తి చాటింది.

- Advertisement -

ప్రాచీన, ఆధునిక ఒలింపిక్స్‌కు పుట్టినిైల్లెన గ్రీస్‌ జట్టు క్రీడావేదికపై తొలి అడుగు మోపగా.. మన్‌ప్రీత్‌, మేరీకోమ్‌ సారథులుగా భారత బృందం ముందడుగు వేసింది. కళాకారుల ప్రదర్శనలు భిన్నత్వంలో ఏకత్వమనే తత్వాన్ని బోధిస్తే.. భవిష్యత్తుకు భరోసానిచ్చే క్షణాలివే అని ఐవోసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ సంకల్పం పలికారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ హిషిమొటో ధన్యవాదాలు తెలిపితే.. జపాన్‌ చక్రవర్తి నరుహిటో అధికారికంగా క్రీడలను ఆరంభించారు.

జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నవోమీ ఒసాక ఒలింపిక్‌ టార్చ్‌ చేబూని.. వేదికపై ఉన్న జ్యోతిని వెలిగించగా.. ఒక్కసారిగా స్టేడియమంతా బాణాసంచా వెలుగులో మోత మోగిపోయింది. ఇక్కడితో ఆరంభ లాంఛనం ముగియగా.. నేటి నుంచి మనవాళ్లు పతకాల వేట ప్రారంభించనున్నారు. బాక్సింగ్‌, షూటింగ్‌, బ్యాడ్మింటన్‌, హాకీ, ఆర్చరీ.. ఇలా తెల్లవారుజాము నుంచే మనవాళ్లు..ప్రత్యర్థులతో కుస్తీ పట్టనున్నారు. మరింకెందుకు ఆలస్యం టీవీలను ట్యూన్‌ చేసేయండి..

టోక్యో: ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశ్వక్రీడా పండుగ ఆరంభమైంది. గతాన్ని గుర్తు చేసుకుంటూ.. భవిష్యత్తుకు బాటలు వేస్తూ శుక్రవారం టోక్యో జాతీయ స్టేడియం వెలుగు జిలుగులతో మెరిసిపోయింది. ‘వేగంగా, బలంగా, ఎత్తుగా, కలిసికట్టుగా’ అనే స్ఫూర్తితో ఆరంభమైన ఈ వేడుకలకు అమెరికా ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ అతిథులుగా విచ్చేయగా.. పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు వర్చువల్‌గా వేడుకలను వీక్షించారు. 1964 ఒలింపిక్స్‌ నాటి గుర్తులను నెమరువేసుకుంటూ సాగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులతో అదుర్స్‌ అనిపించుకోగా.. కరోనా వైరస్‌తో మృతిచెందిన వారికి మౌనం పాటించిన నిర్వాహకులు భావోద్వేగాలతో గుండెలను పిండేశారు. జపాన్‌ చక్రవర్తి నరుహిటో క్రీడలు ప్రారంభమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించగా.. టెన్నిస్‌ స్టార్‌ నవోమీ ఒసాక ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించింది. దీంతో మోడ్రన్‌ ఎరాలో 32వ ఒలింపిక్స్‌కు తెరలేచినైట్లెంది. పరిమిత అతిథుల సమక్షంలో సాగిన ఈ మెగా ఈవెంట్‌కు ప్రత్యక్షంగా చూసే వీలు లేకపోవడంతో కోట్లాది మంది అభిమానులు ప్రసార మాధ్యమాల ద్వారా అంబరాన్ని అంటిన సంబురాలను ఆస్వాదించారు.

మువ్వన్నెలతో మన్‌ప్రీత్‌, మేరీ

ఒలింపిక్‌ క్రీడలకు పుట్టినిైల్లెన గ్రీస్‌ జట్టు మొదట మంచ్‌పైకి రాగా.. ఆ తర్వాత జపాన్‌ అక్షరమాల క్రమంలో ఆయా జట్లు వేదికపైకి చేరుకున్నాయి. పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌ పతాకదారులుగా.. భారత బృందం 21వ స్థానంలో స్టేజిపై అడుగుపెట్టింది. 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులతో కూడిన భారత జట్టు మార్చ్‌ఫాస్ట్‌ చేస్తున్న సమయంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వర్చువల్‌గా అథ్లెట్లకు చీర్స్‌ చెప్పారు. మనవాళ్లు సంప్రదాయ చీరలకు బదులు.. సల్వార్‌ సూట్‌లో దర్శనమివ్వగా.. మన్‌ప్రీత్‌ సింగ్‌ సంప్రదాయ తలపాగాతో ఆకట్టుకున్నాడు. చివరగా జపాన్‌ అథ్లెట్ల బృందం వేదికపైకి రాగా.. ఆ సమయంలో ప్రధాన స్టేడియం దద్దరిల్లిపోయింది. వీక్షకులు పరిమితంగానే ఉన్నా కృత్రిమ ధ్వనులతో మైదానం మారుమోగింది. అనంతరం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ మాట్లాడుతూ..‘ఈ క్షణాన్ని మనం ఆదరిద్దాం. ఇది భవిష్యత్తుపై భరోసానిచ్చే క్షణం. విశ్వవ్యాప్తంగా 206 జట్లు ఒకే కప్పుకింద నిల్చొన్న అరుదైన సందర్భం. ఇది క్రీడల ఏకీకృత శక్తికి నిదర్శనం’ అని అన్నారు.

అప్పుడు తాత.. ఇప్పుడు మనుమడు

1964 ఒలింపిక్స్‌ను అప్పటి జపాన్‌ చక్రవర్తి హిరోహిటో ప్రారంభిస్తే.. తాజా క్రీడలను ఆయన మనమడు నరుహిటో ఆరంభించారు.

కొనసాగిన నిరసనలు

టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని కొంతకాలంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులు శుక్రవారం కూడా వాటిని కొనసాగించారు. ఆరంభ వేడుకలు జరుగుతున్న సమయంలో స్టేడియం బయట పెద్ద ఎత్తున నిరసనకారులు జపాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

12 ఏండ్ల ఒలింపియన్‌

ఈ ఒలింపిక్స్‌లో అత్యంత పిన్న వయస్కురాలు హెండ్‌ జాజ. సిరియా తరఫున టేబుల్‌ టెన్నిస్‌ పోటీలలో పాల్గొంటున్న ఈ బాలిక వయస్సు 12 ఏండ్లు.

ఆనాటి చెట్లతో..

తాజా వేడుకల్లో చూపరులను ఆకట్టుకున్న ఐదు రింగులను.. 1964 ఒలింపిక్స్‌లో పాల్గొన్న జపాన్‌ అథ్లెట్లు నాటిన చెట్ల నుంచి సేకరించడం విశేషం.

‘డ్రోన్ల’తో భూగోళం

సాంకేతికతకు పెట్టింది పేరైన జపాన్‌.. ఒలింపిక్స్‌ వేడుకల్లోనూ దానిని ఘనంగా చాటింది. ఆరంభ కార్యక్రమం సందర్భంగా ‘ఇమాజిన్‌’ పాట ప్లే అవుతుండగా ఏకంగా 1824 డ్రోన్లు స్టేడియం పైకి ఎగిరాయి. అవి ఒక్కటిగా దగ్గరవుతూ గ్లోబులా మారిపోయాయి. డ్రోన్లకు అమర్చిన లైట్లు గ్లోబు రూపాన్ని సంతరించుకుని ఆకట్టుకున్నాయి. చుట్టూ చీకటిలో ఆకాశాన తారలన్నీ కలిసి భూగోళాన్ని రూపొందించాయా అన్న చందంగా అనిపించింది.

కరోనా కేసులు వందకు

ఒలింపిక్‌ విలేజ్‌లో కరోనా కేసులు 100 దాటాయి. శుక్రవారం కొత్తగా 19 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 106కు చేరింది. చెక్‌ రిపబ్లిక్‌ బృందానికి చెందిన ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. రోడ్‌ సైకిలిస్ట్‌ మైకెల్‌ షెలిజల్‌కు కరోనా నిర్ధారణ అయింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana