సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 02, 2020 , 00:01:56

మహేశ్వరికి రజతం

మహేశ్వరికి రజతం
  • స్టిపుల్‌ చేజ్‌లో సత్తాచాటిన పాలమూరు విద్యార్థి
  • ముగిసిన తొలి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌
  • ఓయూ టీటీ జట్టుకు రజతం

భువనేశ్వర్‌: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో పాలమూరు విశ్వవిద్యాలయ అథ్లెట్‌ జి.మహేశ్వరి సత్తాచాటింది. పోటీల చివరి రోజైన ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల 3 వేల మీటర్ల స్టిపుల్‌ చేజ్‌లో 10 నిమిషాల 40.90 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని రజత పతకాన్ని కైవసం చేసుకుంది. సావిత్రిబాయ్‌ పూలే యూనివర్సిటీకి చెందిన కోమల్‌ (10:26.63) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. షాలినీ (పంజాబ్‌ యూనివర్సిటీ) కాంస్యం గెలుచుకుంది. విజేతలను సాట్స్‌ చైర్మన్‌ ఏ.వెంకటేశ్వర్‌ రెడ్డి అభినందించారు. ఈ క్రీడల్లో ఉస్మానియా యూనివర్సిటీకి ఓ స్వర్ణం, ఓ రజతం దక్కగా.. పాలమూరు విశ్వవిద్యాయం రజతంతో టోర్నీని ముగించింది. 17 స్వర్ణాలు సహా మొత్తం 46 పతకాలు సాధించిన పంజాబ్‌ విశ్వవిద్యాలయం తొలి ఖేలో ఇండియా ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది.


స్నేహిత్‌ సేనకు సిల్వర్‌

ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) జట్టు రజత పతకం సొంతం చేసుకుంది. టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్లో ఓయూ జట్టు 1-3తో చిత్కర యూనివర్సిటీ టీమ్‌ చేతిలో ఓడింది. ఓయూ ఆటగాడు ఫిడేల్‌ రఫీక్‌ స్నేహిత్‌ 11-7, 11-6, 11-7తో అర్జున్‌ ఘోశ్‌పై గెలిచి శుభారంభం చేశాడు. అయితే, ఆ తర్వాత మరో సింగిల్స్‌లో మహ్మద్‌ అలీ 11-5, 11-5, 7-11, 8-11, 13-15తో పరాజయం చెందాడు. అనంతరం ఎం.రఘురామ్‌ సహా ఆ తర్వాతి మ్యాచ్‌లో స్నేహిత్‌ సైతం పరాజయం చెందడంతో ఓయూ జట్టు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


ద్యుతీకి రెండో స్వర్ణం 

భారత అగ్రశ్రేణి స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రెండో స్వర్ణంతో మెరిసింది. కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ విశ్వవిద్యాలయం తరఫున బరిలోకి దిగిన ద్యుతీ.. 200 మీటర్ల పరుగులో 23.66 సెకన్లలోనే గమ్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. కీర్తి విజయ్‌ భోటి, దీపాలి మహాపాత్ర వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. logo