ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లాగే అక్కడి క్రికెటర్లు కూడా తాలిబన్లకు మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. తాలిబన్లను పొగుడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. వాళ్లు చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారని, మహిళలను పని చేయడానికి అనుమతిస్తున్నారని అఫ్రిది అనడం తీవ్ర దుమారం రేపింది. ఓవైపు ఆ తాలిబన్ల నుంచి తప్పించుకోవడానికి లక్షలాది మంది, ముఖ్యంగా మహిళలు, ఇల్లూవాకిలి వదిలేసి వెళ్లిపోతుంటే అఫ్రిది మాత్రం వాళ్లను పొగుడుతూ మాట్లాడటం విమర్శలకు దారి తీసింది. తాలిబన్లు ఎన్ని శాంతి వచనాలు వల్లె వేస్తున్నా.. మహిళల పట్ల వాళ్ల వైఖరి మారలేదని ఈ రెండు వారాల్లోనే తేలిపోయింది.
ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘన్‌కు చెందిన ప్రముఖ మహిళలు, జర్నలిస్టులు కూడా దేశాన్ని వీడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఫ్రిదిలాంటి ప్రముఖుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టం. వాళ్లు సహకరిస్తే ఆ గేమ్ బాగా వృద్ధి చెందుతుంది అని కూడా అఫ్రిది అన్నాడు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను పాకిస్థాన్ జర్నలిస్ట్ నైలా ఇనాయత్ పోస్ట్ చేస్తూ.. ఇతడు తాలిబన్ల తర్వాతి ప్రధానమంత్రి కావాలి అంటూ సెటైర్ వేశారు.