e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home స్పోర్ట్స్ టోక్యో ఒలింపిక్స్‌ పతక గర్జన

టోక్యో ఒలింపిక్స్‌ పతక గర్జన

  • బాక్సింగ్‌లో సెమీస్‌కు చేరిన లవ్లీనా
  • ఓడినా కాంస్యం ఖాయం.. బ్యాడ్మింటన్‌ సెమీస్‌లో పీవీ సింధు
  • సెమీస్‌ పోరుసింధు X తైజూ మ. 3.20 నుంచిసోనీలో

విశ్వక్రీడలు ప్రారంభమై వారం రోజులైనా ఇప్పటి వరకు ఒక్క పతకమే చేజిక్కించుకున్న భారత్‌కు శుక్రవారం కలిసొచ్చింది. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన బాక్సర్‌ లవ్లీనా బొర్గోహై సెమీస్‌ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంటే.. భారీ అంచనాల మధ్య టోక్యోలో అడుగుపెట్టిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు యమగూచిని చిత్తుచేసి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇప్పటికే క్వార్టర్స్‌ చేరిన పురుషుల హాకీ జట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌లో విజయాన్నందుకోగా.. మహిళల హాకీ జట్టు అద్వితీయ ఆటతో క్వార్టర్స్‌ ఆశలు నిలుపుకుంది. షూటింగ్‌, ఆర్చరీలో చేదు ఫలితాలు కొనసాగగా.. అథ్లెటిక్స్‌లో మనవాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. నేడు సింధు సెమీస్‌ బరిలో దిగనుండగా.. స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ పంగల్‌ తొలి పంచ్‌ విసిరేందుకు సిద్ధమవుతున్నాడు!

టోక్యో: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శుక్రవారం భారత అథ్లెట్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గోహై సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టి పతకం ఖరారు చేసుకోగా.. తెలుగు తేజం పీవీ సింధు క్వార్టర్స్‌లో యమగూచిని మట్టికరిపించి సెమీస్‌కు దూసుకెళ్లింది. హాకీలో పురుషుల, మహిళల జట్లు చక్కటి విజయాలు నమోదు చేయగా.. ఎన్నో అంచనాలు పెట్టుకున్న షూటింగ్‌, ఆర్చరీలో భారత్‌కు నిరాశ తప్పలేదు. స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ వంద మీటర్ల రేసులో ప్రభావం చూపలేకపోగా.. తొలిసారి ఒలింపిక్‌ బరిలో దిగిన ఈక్వెస్ట్రియన్‌ ఫవాద్‌ మీర్జా ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.

సెమీస్‌లో సింధు..

- Advertisement -

భారీ అంచనాలతో టోక్యోలో అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు.. తన చిరకాల స్వప్నమైన ఒలింపిక్‌ స్వర్ణానికి రెండడుగుల దూరంలో నిలిచింది. శుక్రవారం మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో ప్రపంచ చాంపియన్‌ సింధు 21-13, 22-20తో ఐదో ర్యాంకర్‌ అకానె యమగూచి (జపాన్‌)పై నెగ్గి సెమీస్‌లో అడుగుపెట్టింది. 56 నిమిషాల్లో ముగిసిన పోరులో తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి పెద్దగా పోటీ ఎదురుకాకపోవడంతో అలవోకగా ముందడుగు వేసిన తెలుగమ్మాయి.. రెండో గేమ్‌లో చెమటోడ్చి నెగ్గింది. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో ఆధిక్యం చేతులు మారుతూ సాగగా.. ఒక్కో పాయింట్‌ కోసం ఇద్దరు షట్లర్లు కొదమసింహాల్లా పోరాడారు. ఈ క్రమంలో ఒక పాయింట్‌ కోసం సుదీర్ఘంగా 54 షాట్‌ల ర్యాలీ ఆడటం గమనార్హం. సింధు జోరుకు బ్రేకులు వేసేందుకు కోర్టు మొత్తం కలియతిరిగిన యమగూచి రెండుసార్లు కిందపడి సైతం తన రాకెట్‌కు పనిచెప్పింది. శనివారం సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ తైజూ యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సింధు తలపడనుంది. ఈ ఇద్దరు ఇప్పటి వరకు 20 సార్లు తలపడగా.. అందులో తైజూ 13 సార్లు విజయం సాధించడం భారతీయులను కలవరపాటుకు గురిచేస్తున్నది.

తొలి గేమ్‌ మొత్తం నా ఆధిపత్యం సాగింది. మంచి లీడ్‌ సాధించినా.. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయలేదు. ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా యమగూచి తిరిగి పుంజుకోగలదని నాకు తెలుసు అందుకే జోరు కొనసాగిస్తూ.. గేమ్‌ చేజిక్కించుకున్నా. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా.. నేను ఆశలు వదులుకోలేదు. అనవసర తప్పిదాల జోలికి పోకుండా మ్యాచ్‌ను ముగించా.

సింధు

ఆహా.. ఏమి పంచ్‌

విశ్వక్రీడల తొలిరోజు లిఫ్టర్‌ మీరాబాయి చాను రజతం సాధించిన తర్వాత ఆరు రోజులుగా పతకం కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భారతీయులకు లవ్లీనా బొర్గోహై చల్లటి కబురు చెప్పింది. శుక్రవారం మహిళల 69 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌లో లవ్లీనా 4-1తో చిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)ను చిత్తుచేసి సెమీఫైనల్‌లో అడుగుపెట్టడం ద్వారా కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. బౌట్‌ ఆరంభం నుంచే దూకుడుగా కనిపించిన లవ్లీనా.. మూడో రౌండ్‌లో తన అద్వితీయ డిఫెన్స్‌తో కట్టిపడేసింది. చిన్‌ చెన్‌ చేతిలో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఓడిన లవ్లీనా.. కీలక పోరులో తన ఎత్తును వినియోగించుకుంటూ వరుస పంచ్‌లతో విరుచుకుపడింది. గతేడాది కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న ఈ అస్సాం బాక్సర్‌.. చాన్నాళ్ల పాటు ప్రాక్టీస్‌కు కూడా దూరమైంది. అయితే కష్టకాలంలోనూ సంకల్పాన్ని వీడకుండా మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన లవ్లీనా.. బరిలోకి దిగిన తొలి విశ్వక్రీడల్లోనే పతకం ఖాయం చేసుకుంది. బుధవారం జరుగనున్న సెమీస్‌లో ప్రపంచ చాంపియన్‌ బుసెనాజ్‌ సుర్‌మనెలీ (టర్కీ)తో 23 ఏండ్ల లవ్లీనా అమీతుమీ తేల్చుకోనుంది. లండన్‌ (2012) ఒలింపిక్స్‌లో దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ కాంస్యం నెగ్గాక.. బాక్సింగ్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం కావడం ఇదే తొలిసారి. ఈ ఆనందకర సందర్భంలో బాక్సింగ్‌లో ఒలింపిక్‌ పతకధారులు విజేందర్‌ సింగ్‌, మేరీకోమ్‌.. లవ్లీనాకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల 60 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో మరో భారత బాక్సర్‌ సిమ్రన్‌జీత్‌ కౌర్‌ ఓటమి పాలైంది.

హాకీలో అదరహో..

ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్న భారత పురుషుల హాకీ జట్టు.. చివరి లీగ్‌ మ్యాచ్‌లో చక్కటి విజయాన్నందుకుంది. గుర్జాంత్‌ (17వ, 56వ నిమిషాల్లో) డబుల్‌ ధమాకాకు హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (13వ ని), శంషేర్‌ సింగ్‌ (34వ ని), నీలకంఠ శర్మ (51వ ని) గోల్స్‌ తోడవడంతో పూల్‌-ఏలో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో భారత్‌ 5-3తో జపాన్‌ను చిత్తుచేసింది. ఈ విజయంతో భారత జట్టు ఓవరాల్‌గా 12 పాయింట్లతో రెండో స్థానంతో గ్రూప్‌ దశను ముగించింది. ఆదివారం జరుగనున్న క్వార్టర్‌ ఫైనల్‌లో గ్రేట్‌ బ్రిటన్‌తో మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన తలపడనుంది.

ఆశలు సజీవం

భారీ అంచనాల మధ్య టోక్యో బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. హ్యాట్రిక్‌ పరాజయాల అనంతరం శుక్రవారం తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో రాణి రాంపాల్‌ బృందం 1-0తో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా.. నవ్‌నీత్‌ కౌర్‌ (57వ నిమిషంలో) గోల్‌ కొట్టి భారత క్వార్టర్స్‌ ఆశలు నిలబెట్టింది. ఈ మ్యాచ్‌లో మన అమ్మాయిలకు 14 పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు రావడం విశేషం. శనివారం దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఫలితం అనంతరం నాకౌట్‌ బెర్త్‌లు ఖరారు కానున్నాయి.

దీపిక ఔట్‌

టీమ్‌ ఈవెంట్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్చర్‌ దీపిక కుమారి.. వ్యక్తిగత విభాగంలోనూ నిరాశ పరిచింది. దీపిక శుక్రవారం క్వార్టర్స్‌లో 0-6తో టాప్‌ సీడ్‌ అన్‌ సన్‌ (కొరియా) చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు వరుసగా రెండో ఒలింపిక్స్‌లో భారత పిస్టల్‌ షూటర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో పోటీపడ్డ మనూబాకర్‌ (582 పాయింట్లు) 15వ, రాహిసర్ణోబత్‌ (573 పాయింట్లు) 32వ స్థానాలతో సరిపెట్టుకున్నారు.

20వ స్థానంలో..

గోల్ఫ్‌ పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ ప్లే తొలి రౌండ్‌లో అనిర్బన్‌ లాహిరి 20వ ఉదయన్‌ 57వ స్థానాల్లో నిలిచారు. ఈక్వెస్ట్రియన్‌లో ఫవాద్‌ మీర్జా తొలి రోజు పోటీలు ముగిసే సమయానికి 7వ ప్లేస్‌లో నిలిచాడు. సెయిలింగ్‌లో విష్ణు శరవణన్‌ 20వ.. గణపతి-వరుణ్‌ జోడీ 17వ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో నేత్ర 35వ పేస్ల్‌తో ముగించింది.

అథ్లెటిక్స్‌లో నిరాశ

మహిళల 100 మీటర్ల రేసులో స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ 11.54 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 54 మంది పోటీదారుల్లో 45వ స్థానంలో నిలిచింది. 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్‌.. 400 మీటర్ల హర్డిల్స్‌లో జాబీర్‌ నిరాశ పరచగా.. 4×400 మిక్స్‌డ్‌ రిలే టీమ్‌లో భారత జట్టు హీట్స్‌లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. స్టీపుల్‌ చేజ్‌లో అవినాశ్‌ (8 నిమిషాల 18.12 సెకన్లు) కొత్త జాతీయ రికార్డు నెలకొల్పగా.. హార్డిల్స్‌లో జాబీర్‌ (50.77 సెకన్ల) 33వ ప్లేస్‌లో నిలిచాడు.

జపాన్‌ పతకాల వేట

ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్‌.. సంచలన విజయాలతో స్వర్ణ పతకాలను కొల్లగొడుతున్నది. ఈ క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా ఒలింపిక్స్‌లో 17 పసిడి పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక ఒలింపిక్స్‌లో జపాన్‌కు ఇవే అత్యధిక స్వర్ణ పతకాలు. అంతకుముందు 1964 (టోక్యో), 2004 (ఏథెన్స్‌)లలో ఆ దేశం 16 స్వర్ణాలు నెగ్గింది. తాజా ఒలింపిక్స్‌లో పురుషుల ఫెన్సింగ్‌ టీమ్‌ ఈవెంట్‌లో పసిడి నెగ్గడంతో ఆ దేశానికి ఇప్పటివరకు వచ్చిన స్వర్ణ పతకాల సంఖ్య 17కు చేరింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana