e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home స్పోర్ట్స్ సింధు జోరు..

సింధు జోరు..

  • ప్రిక్వార్టర్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌
  • బాక్సింగ్‌ క్వార్టర్స్‌లో పూజ
  • ఆర్చరీలో దీపిక ముందంజ
  • టోక్యో ఒలింపిక్స్‌

టోక్యో: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతున్నది. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో పూజారాణి, ఆర్చరీలో దీపికా కుమారి విజయాల బాటలో నడువగా.. సాయి ప్రణీత్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ పరాజయాలవైపు
నిలిచారు. సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరిన భారత రోయర్లు అర్జున్‌ లాల్‌- అర్వింద్‌ సింగ్‌ అదే జోరు కొనసాగించలేకపోగా.. సెయిలింగ్‌లో గణపతి, వరుణ్‌ జోడీ ప్రభావం చూపలేదు. హాకీలో యూరప్‌ జట్లకు దీటుగా బదులిస్తారనుకున్న భారత మహిళలు వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమి పాలయ్యారు.

వరుస గేమ్‌లలో..

- Advertisement -

అంచనాలకు అనుగుణంగా సాగుతున్న బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు.. టోక్యో ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన తెలుగమ్మాయి వరుస గేమ్‌లలో నెగ్గి సత్తా చాటితే.. తొలిసారి విశ్వక్రీడల్లో బరిలోకి దిగిన బాక్సర్‌ పూజారాణి క్వార్టర్స్‌కు చేరి శెభాష్‌ అనిపించుకుంది. టీమ్‌ ఈవెంట్‌లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్చర్‌ దీపిక కుమారి.. వ్యక్తిగత విభాగంలో మెరుగైన ప్రదర్శన చేయగా.. మహిళల హాకీ జట్టు వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తంగా వరుసగా నాలుగో రోజూ భారత్‌ పతకం లేకుండానే ముగించింది!

ఆశలు నిలిపిన దీపిక

టీమ్‌ ఈవెంట్‌లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి వ్యక్తిగత విభాగంలో మెరుగైన ప్రదర్శనతో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ చాంపియన్‌ దీపిక 6-4తో అమెరికా టీనేజర్‌ జెన్నిఫర్‌ ముసినో ఫెర్నాండెజ్‌పై గెలుపొందింది. అంతకుముందు రౌండ్‌లో దీపిక 6-0తో కర్మ (భూటాన్‌)ను చిత్తు చేసింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ ఓటమి పాలై ఇంటిబాట పట్టగా.. దీపిక భర్త అతాను దాస్‌ గురువారం బరిలోకి దిగనున్నాడు.

సూపర్‌ రోవర్స్‌..

పెద్దగా అంచనాలు లేకుండా టోక్యోలో అడుగుపెట్టిన రోవర్స్‌ అర్జున్‌ లాల్‌-అర్వింద్‌ సింగ్‌ ద్వయం సంచలన ప్రదర్శనతో సెమీస్‌కు చేరినా.. కీలక పోరులో ఆకట్టుకోలేకపోయింది. బుధవారం జరిగిన పురుషుల లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ రెండో సెమీస్‌లో భారత జంట 6 నిమిషాల 24.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా.. ఒలింపిక్స్‌లో భారత రోవర్స్‌ సెమీఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

పూజ పంచ్‌ అదుర్స్‌

అంచనాలు లేకుండా తొలిసారి విశ్వక్రీడల బరిలోకి దిగిన భారత బాక్సర్‌ పూజారాణి సంచలన ప్రదర్శనతో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మహిళల 75 కేజీల విభాగంలో బుధవారం పూజ 5-0తో ఇచ్రాక్‌ చైబ్‌ (అల్జీరియా)పై విజయం సాధించింది. హర్యానాకు చెందిన 30 ఏండ్ల పూజ.. మూడు రౌండ్‌లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. క్వార్టర్స్‌లో చైనా బాక్సర్‌ లి కియాన్‌పై విజయం సాధిస్తే.. పూజారాణికి విశ్వక్రీడల్లో పతకం ఖాయం కానుంది. ఇక గురువారం ఇన్‌గ్రిట్‌ వెలన్సియా (కొలంబియా)తో స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ (51 కేజీలు) తలపడనుంది. పురుషుల విభాగంలో సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు) తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు.

హ్యాట్రిక్‌ పరాజయం

హాకీలో భారత మహిళల పరాజయాల పరంపర కొనసాగుతున్నది. గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన రాణి రాంపాల్‌ బృందం బుధవారం 1-4తో బ్రిటన్‌ చేతిలో ఓటమి పాలైంది. అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్న భారత జట్టు ఏమాత్రం ఆకట్టుకోలేకపోగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన బ్రిటన్‌ వరుస గోల్స్‌తో బెంబేలెత్తించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఎనిమిది పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు రాగా.. అందులో ఒకదాన్ని మాత్రమే షర్మిలా దేవి (23వ నిమిషంలో) గోల్‌గా మలచగలిగింది.

సెయిలింగ్‌లో నిరాశ..పురుషుల స్కిఫ్‌ ఈవెంట్‌లో భారత జోడీ కేసీ గణపతి-వరుణ్‌ ఠక్కర్‌ 18వ స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లలో భారత జంట వరుసగా 19, 18, 17, 19వ స్థానల్లో నిలిచింది. భారత్‌కు చెందిన మరో ఇద్దరు సెయిలర్లు విష్ణు శరవణన్‌, నేత్ర కుమానన్‌ మంగళవారమే ఓటమి పాలైన విషయం తెలిసిందే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana