సత్తాచాటిన రాజస్థాన్ యువ పేసర్ చేతన్ సకారియా
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: చేతన్ సకారియా.. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఔరా అనిపించాడు. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ దూకుడుకు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లందరూ చేష్టలుడిగిన వేళ ఈ 23 ఏండ్ల పేసర్ స్లో బాల్స్, స్వింగ్‌తో పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో ఐదు పరుగులే ఇచ్చి కేఎల్ రాహుల్, రిచర్డ్సన్ను ఔట్ చేశాడు. అయితే ఐపీఎల్‌కు చేతన్ సకారియా ప్రయాణం సులువుగా సాగలేదు. ఎన్నో కష్టాలు, బాధ లను అధిగమించాడు. పేదరికం, తండ్రి అనారోగ్యం, తమ్ముడి ఆత్మహత్య లాంటి విషాదాలను దాటుకొనివచ్చాడు.
గుజరాత్ రాజ్‌కోట్‌లోని వార్టెజ్ గ్రామం సకారియా సొంతఊరు. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి కుట్టు, అల్లికలు పని చేసేవారు. 16 ఏండ్ల వరకు అతడు టెన్నిస్ బాల్‌తో ఆడుతూ ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు. 17 ఏండ్ల వయసులో గాయం కారణంగా చేతన్ 8 నెల లు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ సమయం లో సకారియా తన బంధువు స్టేషనరీలో పనిచేశాడు. ఆ తర్వాత సౌరాష్ట్ర తరఫున అండర్-19 టీమ్‌లో చోటు దక్కించుకున్న చేతన్ సత్తాచాటడంతో దశ తిరిగింది. అతడికి ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణకు చోటు దక్కగా అప్పటికి అతడి సరైన షూస్ కూడా లేవు. 2018-19 సీజన్‌కు రంజీల్లో ఎంపికైన సకారియా 15 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు తీసి అదరగొట్టాడు.
ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చేతన్ ఆడుతున్న సమయంలో అతడికి ఎంతో ఇష్టమైన తమ్ముడు రాహుల్ సకారియా మానసిక కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే టోర్నీ నుంచి వచ్చేస్తే అతడి క్రికెట్ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని అంతులేని బాధను దిగమింగుకొని చేతన్‌కు తల్లి విషయం చెప్పలేదు. టోర్నీలో సత్తాచాటి ఇంటికొచ్చిన సకారియాకు విష యం తెలిసి తీవ్ర వేదన చెందాడు. ఆ తర్వాత జరిగిన వేలంలో రాజస్థాన్ అతడిని రూ.1.2కోట్లకు కొనుగోలు చేసింది.