మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 27, 2021 , 02:28:42

ఆసీస్‌పై కుర్రాళ్లు అదరగొట్టారు

ఆసీస్‌పై కుర్రాళ్లు అదరగొట్టారు

  • 1950 క్రికెట్‌కు ఇప్పటికి చాలా తేడా 
  • భవిష్యత్‌లో వరంగల్‌కు ప్రాధాన్యం 
  • 2022లో రంజీ మ్యాచ్‌లు నిర్వహిస్తాం 
  • ‘నమస్తే తెలంగాణ’తో వెటరన్‌ క్రికెటర్‌ జయచందర్‌ 

 ‘భారత్‌లో క్రికెట్‌కు ఫుల్‌ క్రేజ్‌. ఈ ఆటంటే ఇష్టపడని వారుండరు. పిల్లల నుంచి పెద్దల వరకు ఆటను ఆస్వాదించేవారే. క్రికెట్‌ను ఒక మతంలా భావించే దేశంలో అభిమానులు కోకొల్లలు. ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో మన యువ క్రికెటర్లు అదరగొట్టారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా అనుభవం లేకపోయినా.. ప్రతికూల పరిస్థితుల మధ్య పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ టీమ్‌ఇండియాకు చరిత్రాత్మక విజయాన్ని అందించడంలో కీలకమైన వీరు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రానున్న రోజుల్లో క్రికెటర్లకు వరంగల్‌ చిరునామాగా మారనుంది. ఇప్పటికే అండర్‌-14లో జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచింది. 2022లో ఇక్కడ రంజీ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని అంటున్నారు రంజీ వెటరన్‌ క్రికెటర్‌, కోచ్‌, ఆర్ట్స్‌ కాలేజీ రిటైర్డ్‌ పీడీ ఎన్‌ఏ జయచందర్‌. క్రికెట్‌లో తన సుదీర్ఘ అనుభవాలను  ‘నమస్తే తెలంగాణ’తో 82 ఏండ్ల జయచందర్‌ పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

హన్మకొండ చౌరస్తా: క్రికెట్‌ ఒక అందమైన ఆట. మనసు పెట్టి ఆడితే అద్భుతాలు సాధించవచ్చు. తొలినాళ్ల (1950)లో బ్యాట్‌ ఎలా పట్టుకోవాలో కూడా తెలియక పోయేది. అప్పటి క్రికెట్‌కు ఇప్పటి ఆటతీరుకు చాలా తేడా ఉంది. నేను ఎక్కువగా హాకీ, బాస్కెట్‌బాల్‌, టీటీ ఆడేవాడిని. సౌత్‌జోన్‌ అండర్‌-11లో రాష్ట్ర స్థాయి టీటీలో విజేతగా నిలువడంతో కాజీపేట నుంచి వరంగల్‌ వరకు లారీలో ఊరేగింపు నిర్వహించారు. ఆటలో మాకు ఎవరు మెళకువలు నేర్పించలేదు. ఆటపై ఇష్టంతోనే సత్తాచాటాం. 11 ఏండ్ల వయసప్పుడు తెనాలిలో రషీద్దులా టోర్నమెంట్‌, జూనియర్స్‌ టోర్నీలో బరిలోకి దిగాను. భారత మాజీ క్రికెటర్లు జయసింహ, శివలాల్‌ యాదవ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌, మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీతో కలిసి ఆడాను. ఆ తర్వాత వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఎంవీ శ్రీధర్‌, వెంకటపతిరాజు, అర్షద్‌ అయూబ్‌, అర్జున్‌ యాదవ్‌కు కోచ్‌గా పనిచేశాను. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా, నాలుగేండ్లు హైదరాబాద్‌ రంజీ టీమ్‌ మేనేజర్‌గా వ్యవహరించాను. రాష్ట్ర స్థాయి, రంజీ మ్యాచ్‌లు సొంత ఖర్చులతో ఆడాను. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో కేరళతో రంజీ మ్యాచ్‌ ఆడి గెలిచాం. అప్పుడు మ్యాట్‌పై క్రికెట్‌ ఆడేవాళ్లం. ప్రస్తుతం క్రికెట్‌ మ్యాచ్‌లన్నీ పిచ్‌లపై నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియా చరిత్ర తిరుగరాసింది. అడిలైడ్‌ టెస్టులో ఘోర ఓటమి తర్వాత పుంజుకుని కంగారూలను వారి సొంతగడ్డపైనే చిత్తుచేసింది. ముఖ్యంగా ఆఖరి టెస్టులో అంతగా అనుభవం లేని బౌలర్లతో బరిలోకి దిగి గబ్బాలో 32 ఏండ్ల రికార్డును తిరుగరాసింది. సీనియర్ల గైర్హాజరీలో హైదరాబాదీ స్పీడ్‌స్టర్‌ మహమ్మద్‌ సిరాజ్‌, రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌, శార్దుల్‌ ఠాకూ ర్‌ సత్తాచాటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భారత్‌కు అద్భుత విజయాన్ని అందించారు. సుదీర్ఘ దేశ క్రికెట్‌ చరిత్రలో ఆసీస్‌పై సాధిం చిన ఈ విజయం కలకాలం గుర్తుండిపోతుంది. 

2022లో వరంగల్‌లో రంజీ మ్యాచ్‌లు 

భవిష్యత్‌లో వరంగల్‌కు అధిక ప్రాధాన్యం దక్కనుంది. ఎంతో మంది యువ క్రికెటర్లు ఇక్కడి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడే అవకాశాలున్నా యి. ఇప్పటికే  వరంగల్‌ నుంచి ఇద్దరు రంజీల్లో ఆడారు. వరంగల్‌లో ప్రత్యేకంగా క్రికెట్‌ మైదానానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వడ్డేపల్లి చర్చి రింగ్‌రోడ్‌ మధ్య ఉనికిచర్ల వద్ద 15 ఎకరాల స్థలాన్ని పరిశీలించాం. ప్రభు త్వం కూడా సానుకూలంగా స్పందించింది. మూడు, నాలుగు నెలల్లో మైదానం అందుబాటులోకి రానుం ది. 2022లో రంజీ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. 

VIDEOS

logo