శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Sep 10, 2020 , 01:40:47

ఒసాక దూకుడు

ఒసాక దూకుడు

  • క్వార్టర్స్‌లో అలవోకగా గెలుపు.. సెమీస్‌ చేరిన జ్వెరెవ్‌, బుస్టా 

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో జపాన్‌ స్టార్‌ ప్లేయర్‌ నవోమీ ఒసాక హవా కొనసాగిస్తున్నది. క్వార్టర్స్‌లో వరుస సెట్లలో గెలిచిన ఆమె సెమీస్‌ పోరులో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో నాలుగో సీడ్‌ ఒసాక 6-3, 6-4 తేడాతో షెల్బీ రోజర్స్‌(అమెరికా)ను 79 నిమిషాల్లోనే మట్టికరిపించి, తన కెరీర్‌లో రెండోసారి యూఎస్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరుకుంది. మ్యాచ్‌ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించిన ఒసాక మొత్తం ఏడు ఏస్‌లు, 24 విన్నర్లు బాదగా.. ఫస్ట్‌ సర్వ్‌లోనే 83శాతం పాయింట్లను సాధించింది. సెమీస్‌లో 28వ సీడ్‌ జెన్నిఫర్‌ బ్రాడ్లీతో ఒసాక తలపడనుంది. క్వార్టర్స్‌లో బ్రాడ్లీ 6-3, 6-2తేడాతో 23వ  సీడ్‌ యులియా పుతిన్‌సేవ(కజకిస్థాన్‌)పై గెలిచింది.

జ్వెరెవ్‌ జోరు

పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌(జర్మనీ) ముందడుగేశాడు. క్వార్టర్స్‌లో జ్వెరెవ్‌ 1-6, 7-6(7/5), 7-6(7/1), 6-3 తేడాతో 27వ సీడ్‌ బోర్నా కొరిచ్‌ (క్రియేషియా)పై చెమటోడ్చి గెలిచాడు. 3గంటల 25 నిమిషాల పాటు మ్యాచ్‌ సాగగా.. తొలి సెట్‌లో జ్వెరెవ్‌కు కొరిచ్‌ షాకిచ్చాడు. అయితే ఆ తర్వాత తేరుకున్న అలెగ్జాండర్‌ తర్వాతి రెండు సెట్లను టై బ్రేకర్లలో చేజిక్కించుకున్నాడు. నాలుగో సెట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌ వేటలో ఉన్న జ్వెరెవ్‌ సెమీస్‌లో 20వ సీడ్‌ పాబ్లె కరెనో బుస్టా(స్పెయిన్‌)తో తలపడనున్నాడు.  క్వార్టర్స్‌లో బుస్టా 3-6, 7-6(7/5), 7-6(7/4), 0-6, 6-3తేడాతో 12వ సీడ్‌ డెనిస్‌ షపోవలోవ్‌(కెనడా)పై గెలిచాడు. కాగా పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ డొమెనిక్‌ థీమ్‌, పదో సీడ్‌ ఆండ్రీ రుబ్లేవ్‌, మద్వెదెవ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు.  

ఒసాక మాస్కుల కథ ఇదే..

  యూఎస్‌ ఓపెన్‌లో జపాన్‌ మహిళా స్టార్‌ నవోమీ ఒసాక.. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూనే ఉన్నది. ఇందుకు గాను టోర్నీలోని ప్రతి మ్యాచ్‌లో మాక్కులతో బరిలోకి దిగుతున్నది. గతంలో వర్ణ వివక్షకు బలైన వారి పేర్లు ఉన్న మాస్కులను ఒసాక ధరిస్తున్నది. తొలి రౌండ్‌లో బ్రెయోనా టేలర్‌, రెండో రౌండ్‌లో ఎలిడా మెక్‌క్లెయిన్‌, మూడో రౌండ్‌లో అహ్మౌద్‌ ఆర్బెరీ, ప్రిక్వార్టర్స్‌లో ట్రైవోన్‌ మార్టిన్‌, క్వార్టర్స్‌లో జార్జ్‌ ఫ్లాయిడ్‌ పేర్లతో ఉన్న మాస్కులను ఒసాక ధరించింది. 


logo