బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 27, 2020 , 21:08:38

వార్నర్‌, సాహా విధ్వంసం..ఢిల్లీ లక్ష్యం 220

వార్నర్‌, సాహా విధ్వంసం..ఢిల్లీ లక్ష్యం 220

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ సంచలన ప్రదర్శన చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(66: 34 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు), వృద్ధిమాన్‌  సాహా(87: 45 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అలరించారు. ఓపెనర్లు వీరవిహారం చేయడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో  2 వికెట్లకు  219 పరుగులు చేసింది. 

ఆఖర్లో మనీశ్‌ పాండే(44నాటౌట్:‌ 31 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్‌  పటిష్ఠ స్కోరు  సాధించింది.  దుబాయ్‌ మైదానంలో సీజన్‌లో  ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.  ఢిల్లీ స్పీడ్‌స్టర్‌ రబాడ 4 ఓవర్లు వేసి వికెట్‌ తీయకుండా 54 పరుగులు సమర్పించుకున్నాడు. నోర్ట్జే, అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు. ఆఖర్లో  విలియమ్సన్‌(11 నాటౌట్‌: 10 బంతుల్లో 1ఫోర్) భారీ షాట్లు ఆడలేకపోయాడు. వార్నర్‌ మంగళవారం తన 34వ పుట్టినరోజును జరుపుకున్నాడు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు వార్నర్‌, సాహా ధనాధన్‌ ఆరంభాన్నిచ్చారు. తాను ఫామ్‌లో ఉంటే ఎంత ప్రమాదమో వార్నర్‌ మరోసారి నిరూపించాడు.  ఈ ఏడాది  ఐపీఎల్‌ సీజన్‌లో పవర్‌ప్లేలో  అత్యధిక పరుగులు 52 చేసిన ఆటగాడిగా  వార్నర్‌ నిలిచాడు.  ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన వార్నర్‌..25 బంతుల్లోనే 6ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా రబాడ వేసిన ఆరో ఓవర్లో వార్నర్‌ నాలుగు ఫోర్లు, సిక్సర్‌ బాది 22 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా వేగంగా ఆడడటంతో పవర్‌ప్లే ఆఖరికి   77 పరుగులు చేసింది.   వార్నర్‌ తన సహజమైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను  ఉతికారేశాడు.

వార్నర్‌, సాహా బ్యాట్‌ ఝుళిపించడంతో   9 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోరు 100 దాటింది.   వీరిద్దరూ తొలి వికెట్‌కు 107 పరుగులు జోడించారు.    క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లపై విరుచుకుపడ్డ వార్నర్‌   దూకుడుగా ఆడే క్రమంలో అశ్విన్‌ బౌలింగ్‌ వెనుదిరిగాడు. అశ్విన్‌ వేసి పదో ఓవర్‌ మూడో బంతిని ఫోర్‌ బాదిన వార్నర్‌..తర్వాతి బంతిని కూడా భారీ షాట్‌ క్రమంలో అక్షర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.  తుషార్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో సాహా 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

వార్నర్‌ ఔటైన తర్వాత కూడా అతడు జోరు తగ్గించలేదు. పేసర్‌, స్పిన్నర్‌ అని తేడాలేకుండా అందరి బౌలింగ్‌లోనూ బౌండరీలు బాదేశాడు. 27 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న సాహా..తర్వాత  గేర్‌ మార్చి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  15 ఓవర్లకు    175 పరుగులు చేసింది.  సెంచరీ దిశగా సాగుతున్న సాహా  పేసర్‌ నోర్ట్జే  బౌలింగ్‌లో వెనుదిరిగాడు.  చివర్లో పాండే చెలరేగి ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాడు.