గురువారం 04 జూన్ 2020
Sports - Apr 03, 2020 , 16:52:15

నాలుగేండ్ల క్రితం.. నాలుగు సిక్స‌ర్ల‌తో..

నాలుగేండ్ల క్రితం.. నాలుగు సిక్స‌ర్ల‌తో..

న్యూఢిల్లీ:  నాలుగేండ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజు.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌. స్వ‌దేశంలో జ‌రుగుతున్న టోర్నీలో టీమ్ఇండియా విజేత‌గా నిలుస్తుంద‌ని భావించిన కోట్లాది మంది అభిమానుల ఆశ‌ల‌పై సెమీఫైన‌ల్లో నీళ్లు చ‌ల్లిన వెస్టిండీస్ తుదిపోరుకు అర్హ‌త సాధించింది. మ‌రోవైపు బ‌ల‌మైన బ్యాటింగ్ లైన‌ప్ క‌లిగిన ఇంగ్లండ్ ఫైన‌ల్ చేరింది. 


ఈడెన్ గార్డ‌న్స్ వేదిక‌గా జ‌రిగిన తుదిపోరులో టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ప్ర‌త్య‌ర్థి ముందు ఓ మాదిరి ల‌క్ష్యాన్ని ఉంచినా.. విండీస్ వీరులు ఆరంభంలో త‌డ‌బ‌డ్డారు. శామ్యూల్స్ (66 బంతుల్లో 85 నాటౌట్‌; 9 ఫోర్లు 2 సిక్స‌ర్లు) మిన‌హా మిగిలిన‌వారంతా చేతులెత్తేశారు. క‌రీబియ‌న్ జ‌ట్టు రెండోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడాలంటే చివ‌రి ఓవ‌ర్‌లో 19 ప‌రుగులు చేయాల్సిన ప‌రిస్థితి. ప్ర‌ధాన పేస‌ర్లు విల్లే, ప్లంకెట్‌, జోర్డ‌న్ ఓవ‌ర్లు ముగియ‌డంతో.. ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్‌ బంతిని ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ అందించాడు. అప్ప‌టి వ‌ర‌కు ఆరు బంతులెదుర్కొని 10 ప‌రుగులు చేసిన కార్లోస్ బ్రాత్‌వైట్ (10 బంతుల్లో 34 నాటౌట్‌; ఒక ఫోర్‌, 4 సిక్స‌ర్లు) స్ట్ర‌యికింగ్‌లో ఉన్నాడు. ఒత్తిడిలో అన్ని ప‌రుగులు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి.. ఇంగ్లండ్ విజ‌యం సాధించ‌డం ప‌క్కా అని అంతా ఒక అంచ‌నాకు వ‌చ్చేశారు. అయితే ఈ విండీస్ అర‌వీర భ‌యంక‌రుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపెట్టాడు. లెగ్‌స్టంప్‌పై ప‌డ్డ తొలి బంతిని స్క్వేర్ లెగ్ దిశ‌గా సిక్సర్ కొట్టిన బ్రాత్‌వైట్‌.. రెండో బంతిని లాంగాన్‌మీదుగా ప్రేక్ష‌కుల్లో ప‌డేశాడు. విజ‌య స‌మీక‌ర‌ణం నాలుగు బంతుల్లో ఏడు ప‌రుగుల‌కు వ‌చ్చేసింది. అయినా శాంతించ‌ని కార్లోస్‌.. ఆ త‌ర్వాతి రెండు బంతుల‌ను కూడా సిక్స‌ర్లుగా మ‌లిచి వెస్టిండీస్ మ‌ర‌పురాని విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టి ఇంగ్లండ్‌కు అంతులేని వేద‌న మిగిల్చాడు. ఆ రోజు పిచ్ మ‌ధ్య‌లో ఏడుస్తూ కూర్చున్న స్టోక్స్ ఆ త‌ర్వాత మూడేండ్ల‌కు ఇంగ్లండ్‌కు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ అందించ‌డం కొస‌మెరుపు.


logo