గురువారం 02 జూలై 2020
Sports - Apr 23, 2020 , 11:32:11

క్రిస్​ గేల్ విధ్వంసానికి ఏడేండ్లు

క్రిస్​ గేల్ విధ్వంసానికి ఏడేండ్లు

న్యూఢిల్లీ: ఏప్రిల్​ 23, 2013న వెస్టిండీస్ బ్యాట్స్​మన్ క్రిస్ గేల్​ ఐపీఎల్​లో విశ్వరూపాన్ని చూపాడు. ధనాధన్ ఆటతో క్రికెట్ చరిత్రలో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసి కదం తొక్కాడు. ఏకంగా 17 సిక్సర్ల సాయంతో 175పరుగులు చేసి ఐపీఎల్​లో అత్యధిక స్కోరు రికార్డును నమోదు చేశాడు. గేల్ సృష్టించిన ఆ పరుగుల ఆ విధ్వంసానికి నేటితో ఏడేండ్లు నిండాయి.

పుణె వారియర్స్​తో జరిగిన ఆ మ్యాచ్​లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్​ ఎడాపెడా సిక్సర్లు బాదాడు. పుణె బౌలర్లపై విరుచుకుపడి బంతిని బౌండరీలు దాటించాడు. 30 బంతుల్లోనే 8ఫోర్లు, 10సిక్సర్లు, కేవలం నాలుగు సింగిల్స్​ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన శతకం. 2004లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమన్స్​ 34బంతులకే సెంచరీ చేయగా ఆ రికార్డును గేల్ బద్దలు కొట్టాడు. శతకం తర్వాత కూడా రెచ్చిపోయిన క్రిస్ గేల్.. మొత్తంగా 66బంతుల్లో 17సిక్సర్లు 13ఫోర్లతో 175 పరుగులు చేయడంతో బెంగళూరు మూడు వికెట్లకు 263పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత బౌలింగ్​లోనూ మెరిగిన గేల్ ఐదు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా పుణె 20ఓవర్లలో 9వికెట్లకు 133 పరుగులే చేయగలిగింది. దీంతో బెంగళూరు ఏకంగా 130పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.


logo