మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 14, 2020 , 01:53:41

యూఎస్‌ ఓపెన్‌కు జొకో సిద్ధం

 యూఎస్‌ ఓపెన్‌కు జొకో సిద్ధం

బెల్‌గ్రెడ్‌(సెర్బియా): కరోనా వైరస్‌ ఆందోళన ఉన్నా.. ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తాను పాల్గొంటానని టెన్నిస్‌ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ స్పష్టం చేశాడు. అలాగే అమెరికాలో జరిగే వెస్టర్న్‌, సదరన్‌ ఓపెన్‌ పోటీల్లోనూ తలపడతానని గురువారం ట్వీట్‌ చేశాడు. జూన్‌లో అడ్రియా టోర్నీ నిర్వహించిన జొకోవిచ్‌.. కరోనా బారిన పడి కోలుకున్నాడు. అమెరికాలో వైరస్‌ తీవ్రత ఎక్కువ ఉండడంతో న్యూయార్క్‌లో జరిగే యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొనడంపై ఇటీవల సందేహాలు వ్యక్తం చేశాడు. అయితే చివరికి ఆడేందుకే సెర్బియా వీరుడు జొకో మొగ్గు చూపాడు. ‘ఈ ఏడాది వెస్టర్న్‌, సదరన్‌ ఓపెన్‌తో పాటు యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొంటానని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ఇది అంత సులువైన నిర్ణయం కాదు. చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మళ్లీ పోటీ పడే అవకాశం రావడం నన్ను ఉత్సాహపరుస్తున్నది’ అని జొకోవిచ్‌ ట్వీట్‌ చేశాడు. యూఎస్‌ ఓపెన్‌ షెడ్యూల్‌ ప్రకారం అనుకున్నట్టుగా ఈ నెల 31న ప్రారంభమైతే.. కరోనా వైరస్‌ రాక తర్వాత జరిగే తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ కానుంది. సుదీర్ఘ విరామం తర్వాత జరిగే మేజర్‌ టెన్నిస్‌ టోర్నీ కానుంది. అంతకంటే ముందే న్యూయార్క్‌లో ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు వెస్టర్న్‌, సదరన్‌ ఓపెన్‌ టోర్నీ జరుగనుంది.


logo