బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 31, 2020 , 02:40:19

జొకో ఎనిమిదోసారి

జొకో ఎనిమిదోసారి

ఆస్ట్రేలియా గడ్డపై జొకోవిచ్‌ మరోసారి విజృంభించాడు. స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ను సెమీస్‌లో వరుససెట్లలో ఓడించి ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. గాయంతో ఇబ్బందిపడ్డ రోజర్‌ ఏదశలోనూ జొకోకు పోటీనివ్వలేకపోయాడు. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో సంచలనాల మోత మోగింది. టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీకి అమెరికన్‌ సోఫియా షాకిస్తే.. నాలుగో ర్యాంకర్‌ హలెప్‌ అన్‌సీడెడ్‌ ముగురుజ చేతిలో ఓటమి పాలైంది. మిక్స్‌డ్‌డబుల్స్‌లో ప్లేయర్‌ బోపన్న పోరాటం ముగిసింది.

మెల్‌బోర్న్‌: భీకరఫామ్‌లో ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సత్తాచాటాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వీరుడు, స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ను అలవోకగా ఓడించి తుదిపోరుకు దూసుకెళ్లాడు. గురువారమిక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌, సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌  7-6(7/1), 6-4, 6-3తేడాతో ఫెదరర్‌ను వరుస సెట్లలో ఓడించాడు. మ్యాచ్‌ 2గంటల 18నిమిషాల పాటు సాగగా.. ప్రారంభంలో ఫెదరర్‌ దూకుడు ప్రదర్శించాడు. తొలి గేమ్‌లోనే మూడు ఏస్‌లు బాదడంతో పాటు ఆ తర్వాత జొకో సర్వీస్‌ను సైతం బ్రేక్‌ చేసి 2-0తో ఆధిక్యం ప్రదర్శించాడు. ఓ దశలో 4-1 ముందంజ వేశాడు. ఆ తరుణంలో ఒక్కసారిగా విజృంభించిన నొవాక్‌.. వరుసగా గేమ్‌లు సాధించాడు. దీంతో చివరికి 6-6తో సమమై టై బ్రేకర్‌కు దారితీసింది. అక్కడి నుంచి జొకోవిచ్‌ విజృంభణతో పాటు ఫెదరర్‌ గాయం కష్టాలు మొదలయ్యాయి. 0-3తో వెనుకబడిన సమయంలో ఫెదరర్‌ ఓ పాయింట్‌ చేశాడు. ఆ తర్వాత అదే జోరు కనబరిచిన జొకోవిచ్‌ సునాయాసంగా 7-1తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. 

జొకో జోరు 

రెండో సెట్‌ ప్రారంభంలో పోరు హోరాహోరీ సాగడంతో మరోసారి టైబ్రేకర్‌ తప్పదేమో అనిపించింది. అయితే, 5-4తో ఉన్న సమయంలో జొకోవిచ్‌... ఫెదరర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. మూడో సెట్‌లో సెర్బియన్‌ జోరుకు అడ్డులేకుండా పోయింది.  గాయం తీవ్రత  ఎక్కువవడం... జొకో భీకరషాట్లతో విరుచుకుపడడంతో స్విస్‌ దిగ్గజం సరైన పోటీనివ్వలేకపోయాడు.  చివరికి సెట్‌ను 6-3తో కైవసం చేసుకున్న జొకోవిచ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.  మ్యాచ్‌ మొత్తం ఫెదరర్‌ 15ఏస్‌లు, 46విన్నర్లు సాధిస్తే.. జొకోవిచ్‌ 11ఏస్‌లు, 31విన్నర్లు చేశాడు. అయితే ప్రత్యర్థి కన్నా దాదాపు రెట్టింపు తప్పిదాలు (35) చేయడమే ఫెడ్‌ కొంపముంచింది. 

గెలిస్తే మళ్లీ అగ్రర్యాంకు 

ఇప్పటి వరకు ఏడుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌.. అన్నిసార్లు టైటిల్‌  దక్కించుకున్నాడు. ఈసారి ఐదో సీడ్‌ థీమ్‌ లేదా ఏడో సీడ్‌ జ్వెరెవ్‌తో టైటిల్‌ కోసం పోటీ పడనున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో గెలిస్తే రఫెల్‌ నాదల్‌ను వెనక్కి నెట్టి జొకోవిచ్‌ మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకుకు చేరుకుంటాడు. గతేడాది చివర్లో జొకోను అధిగమించి టాప్‌ ప్లేస్‌కు చేరిన నాదల్‌.. ఈ టోర్నీ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. 

ఫెదరర్‌తో ఆడడం ఎప్పుడైనా కష్టమే. ఈ మ్యాచ్‌లో అతడు గాయం వల్ల ఎంతో ఇబ్బంది పడ్డాడు. కదలికల్లోనే అది తెలిసిపోయింది. తొలిసెట్‌ తర్వాత గాయం తీవ్రమైనా రోజర్‌ చికిత్స చేయించుకొని ఆట కొనసాగించాడు. శక్తివంచన లేకుండా ఆడాడు. అందుకే అతడంటే అపారమైన గౌరవం - జొకోవిచ్‌ 

అయ్యో ఫెదరర్‌ 


క్వార్టర్‌ ఫైనల్లోనే  గాయాలతో ఇబ్బందులు పడిన ఫెదరర్‌కు సెమీస్‌లోనూ కష్టాలు తప్పలేదు. తొలి సెట్‌లో బాగానే కనిపించిన ఫెడ్‌ టై బ్రేకర్‌ తర్వాత తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. విరామంలో చికిత్స చేయించుకొని బరిలోకి దిగినా.. రెండో సెట్‌ నుంచి ఎక్కువ చురుగ్గా కదలేకపోయాడు. మ్యాచ్‌ ప్రారంభానికి కొద్దిసేపటి ముందే కాలికి కట్టుతో కాసేపు కోర్టులో తిరగ్గా.. ఫెదరర్‌ పోటీ నుంచి తప్పుకుంటాడేమో అనిపించింది. అయితే, పోరాట స్ఫూర్తితో బరిలోకి దిగిన స్విస్‌ దిగ్గజం ఏస్‌లతో అభిమానులను అలరించాడు. 


నేను మరిన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలువగలనన్న నమ్మకముంది. ఇ ప్పట్లో రిటైర్‌ అవ్వాలన్న ఆలోచనే లేదు. నా గాయం పెద్దదేం కాదు. త్వరలోనే కోలుకొని తిరిగి వస్తా’  - ఫెదరర్‌ 


బార్టీ, హలెప్‌కు షాక్‌ 


సొంతగడ్డపై తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ముద్దాడాలనుకున్న ప్ర పంచ నంబర్‌వన్‌ ర్యాం కర్‌, లోకల్‌ స్టార్‌ ఆష్లే బార్టీకి షాక్‌ ఎదురైంది. మహిళల సింగి ల్స్‌ సెమీస్‌లో బార్టీ(ఆస్ట్రేలియా) 6-7(6/8), 5-7తేడాతో 14వ సీడ్‌ సోఫియా కెనిన్‌(అమెరికా) చేతిలో పరాజయం పాలైంది.  గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌కు చేరడం 21ఏండ్ల సోఫియాకు ఇదే తొలిసారి. మరో సెమీస్‌లో మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌, ప్రస్తుతం అన్‌ సీడెడ్‌గా బరిలోకి దిగిన గాబ్రిన్‌ ముగురుజ(స్పెయిన్‌)  7-6(10/8),7-5తేడాతో నాలుగో సీడ్‌ సిమోనా హలెప్‌ను ఓడించింది.  2017లో వింబుల్డన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌ చేరడం ముగురుజకు ఇదే తొలిసారి. సోఫియా - ముగురుజ మధ్య టైటిల్‌ పోరు శనివారం జరుగనుంది. 


బోపన్న ఔట్‌ 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డబుల్స్‌ క్వార్టర్‌  ఫైనల్లో భారత సీనియర్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న- నాడియా కిచనోక్‌(ఉక్రెయిన్‌) జోడీ 0-6, 2-6తో  ఐదో సీడ్‌ జోడీ క్రెజ్సికోవా(చెక్‌రిపబ్లిక్‌) - మెట్రిక్‌ (క్రొయేషియా)చేతిలో పరాజయం పాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది. నేడు పురుషుల సింగిల్స్‌ సెమీస్‌ 
డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 

అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)
 మధ్యాహ్నం 2గంటల నుంచి సోనీ సిక్స్‌లో..logo