శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 01:25:28

సూపర్‌కింగ్స్‌కు ఊరట

సూపర్‌కింగ్స్‌కు ఊరట

దుబాయ్‌:  కరోనా కేసులతో ఆందోళన చెందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు(సీఎస్‌కే)కు కాస్త ఊరట లభించింది. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో కొత్తగా కేసులేమీ నమోదు కాకపోవడంతో ఆ జట్టు ప్రాక్టీస్‌కు సిద్ధమైంది. ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం యూఏఈ వెళ్లాక పేసర్‌ దీపక్‌ చాహర్‌, బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో పాటు 11 మంది సహాయక సిబ్బందికి గత వారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో జట్టులో అలజడి రేగింది. అయితే పాజిటివ్‌ వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్‌ వ్యవధి తర్వాతే మరోసారి పరీక్షలు జరుగుతాయని, మిగిలిన వారందరికి నెగిటివ్‌ వచ్చిందని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ మంగళవారం వెల్లడించాడు. ‘ఆ 13మంది మినహా మిగిలినవారందరికీ కొవిడ్‌-19 నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.  వారికి గురువారం మరోసారి పరీక్షలు నిర్వహిస్తాం. ఆటగాళ్లు 4వ తేదీన ప్రాక్టీస్‌ ఆరంభించే అవకాశం ఉంది. 14రోజుల క్వారంటైన్‌ తర్వాత రెండు పరీక్షల్లో నెగిటివ్‌ వస్తే చాహర్‌, రుతురాజ్‌ జట్టుతో చేరతారు’ అని అతడు చెప్పాడు. మరోవైపు  సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఇంకా భారత్‌ నుంచి యూఏఈ వెళ్లలేదు. కాగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫాప్‌ డుప్లెసిస్‌, లుంగీ ఎంగ్డీ, రబాడ.. దుబాయ్‌కు చేరుకొని, నేరుగా క్వారంటైన్‌లోకి వెళ్లారు. 


logo