శనివారం 08 ఆగస్టు 2020
Sports - Jul 04, 2020 , 02:59:34

ఆధారాల్లేవ్‌

ఆధారాల్లేవ్‌

  • ‘2011 ప్రపంచకప్‌ ఫిక్సింగ్‌'పై  విచారణను నిలిపివేసిన శ్రీ లంక పోలీసులు 
  • ఫైనల్‌పై ఆరోపణలు నిరాధారం  
  •  అనుమానాలు అనవసరమన్న ఐసీసీ

2011 వన్డే విశ్వటోర్నీ ఫైనల్‌పై  జరిగిన రచ్చ ముగిసింది. భారత్‌, శ్రీలంక మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌ జరిగిందన్న ఆరోపణలు నిరాధారమని శ్రీలంక క్రీడాశాఖ నియమించిన ప్రత్యేక దర్యాప్తు  తేల్చేసింది. ఫైనల్‌ను భారత్‌కు లంక అమ్మేసిందన్న క్రీడాశాఖ మాజీ మంత్రి మహిందానంద చేసిన ఆరోపణలను బలపరిచే ఆధారాలు లభించలేదని విచారణను ముగించింది. భారత్‌  చిరస్మరణీయ విజయం సాధించిన  ఆ ఫైనల్‌పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఐసీసీ సైతం స్పష్టంగా చెప్పింది.        

కొలంబో: 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌పై రేగిన అనుమానాలు పంటాపంచలయ్యాయి. భారత్‌ చేతిలో శ్రీలంక కావాలనే ఓడిందన్న వాదనలు నిరాధారమని తేలిపోయాయి. విశ్వటోర్నీ ఫైనల్‌లో ఫిక్సింగ్‌ జరిగిందన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని శ్రీలంక క్రీడాశాఖ నియమించిన పోలీసులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు విభాగం శుక్రవారం తేల్చిచెప్పింది. ఇంతకాలం జరిగిన రచ్చకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఇద్దరు మాజీ కెప్టెన్లను సుదీర్ఘంగా ప్రశ్నించాక ఇక విచారణ అనవసరమని, ఫైనల్‌పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చేసింది. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ను భారత్‌కు శ్రీలంక అమ్మేసుకుందని లంక మాజీ క్రీడాశాఖ మంత్రి మహిందానంద ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే తన అనుమానాలను 14అంశాలుగా ఆయన వెల్లడించారు. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌పై విచారణ జరిపేందుకు శ్రీలంక క్రీడాశాఖ.. పోలీసు అధికారులతో ఓ ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసి.. క్రిమినల్‌ విచారణకు ఆదేశించింది. 2011 శ్రీలంక జట్టు కెప్టెన్‌, ప్రస్తుత ఎంసీసీ అధ్యక్షుడు కుమార సంగక్కరను 10గంటలు, ఫైనల్‌లో శతకం చేసిన మహేలా జయవర్దనెను అధికారులు ఆరు గంటల పాటు ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ సహా అప్పటి సెలెక్టర్‌ అరవింద డిసిల్వాను కూడా విచారించారు. ఇంత మందిని ప్రశ్నించినా ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో విచారణను నిలిపివేసేందుకు మొగ్గుచూపారు. 

ఇక అనవసరం

ఫైనల్‌లో ఫిక్సింగ్‌ జరిగినట్టు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు విభాగం అధికారి, ఎస్పీ జగత్‌ ఫొనెస్కా స్పష్టం చేశారు. మరింత మంది ఆటగాళ్లను విచారించాల్సిన అవసరం తమకు కనిపించడం లేదని అన్నారు. ‘క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి మేం నివేదిక సమర్పిస్తాం. విచారణను ముగించాలని ఈ రోజు నిర్వహించిన అంతర్గత సమావేశం తర్వాత నిర్ణయించాం’ అని ఫొనెస్కా చెప్పారు. ఫైనల్‌కు ఎంపిక చేసిన జట్టులో హఠాత్తుగా మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో ముగ్గురు క్రికెటర్లు తమకు పూర్తిగా వివరించారని తెలిపారు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌లో శ్రీలంకపై భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి 28ఏండ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 

అనుమానాలకు అర్థం లేదు: ఐసీసీ  

2011 ప్రపంచకప్‌ ఫైనల్‌పై అనుమానాలను లేవనెత్తేందుకు కారణాలు లేవని ఐసీసీ వెల్లడించింది. ఆ మ్యాచ్‌పై విచారణ జరిపేలా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. విచారణను ముగిస్తున్నట్టు శ్రీలంక దర్యాప్తు విభాగం చెప్పిన అనంతరం ఐసీసీ అవినీతి నిరోధక విభాగం స్ప ందించింది. తుదిపోరుపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వెల్లడించింది.  


logo