సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 00:47:49

ఐసీసీ చైర్మన్‌ ఎన్నికపై ప్రతిష్టంభన

ఐసీసీ చైర్మన్‌ ఎన్నికపై ప్రతిష్టంభన

  •  బోర్డు సభ్యుల మధ్య కుదరని ఏకాభిప్రాయం 

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తదుపరి చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియపై సందిగ్ధం వీడలేదు. నామినేషన్‌ ప్రక్రియపై నిర్ణయం తీసుకోవడమే ఏకైక అజెండాగా ఐసీసీ సోమవారం వర్చువల్‌గా బోర్డు సమావేశం నిర్వహించగా.. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ‘కొన్ని అంశాలపై సభ్యులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. మెజార్టీ తేల్చేందుకు ఎన్నిక నిర్వహించాలా లేదా 17 మంది సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతుతో చైర్మన్‌ను ఎన్నుకునే విధానాన్నే కొనసాగించాలా అన్న అంశంపై బోర్డు చీలిపోయింది. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి ఉండడమే దీనికి ఉత్తమమైన పరిష్కారం’ అని ఐసీసీ సభ్యుడొకరు సమావేశం అనంతరం అన్నారు. అలాగే ఏకగ్రీవంగా ఎన్నుకోదగిన అభ్యర్థి కూడా ప్రస్తుతం లేరని కొందరు బోర్డు సభ్యులు అభిప్రాయపడినట్టు సమాచారం. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. ఐసీసీ పదవికి పోటీపడే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. చైర్మన్‌ పదవి రేసులో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ చీఫ్‌ కోలిన్‌ గ్రేవ్స్‌ తొలుత నుంచి ముందున్నా.. అతడికి కొన్ని దేశాల బోర్డులు మద్దతు తెలుపడం లేదు. కాగా ఐసీసీ చైర్మన్‌ స్థానం నుంచి శశాంక్‌ మనోహర్‌ జూన్‌లో వైదొలిగిన సంగతి తెలిసిందే. 


logo