శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 29, 2020 , 21:10:18

రాణించిన రాణా

రాణించిన రాణా

దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌  మెరుగైన స్కోరు సాధించింది.  ఓపెనర్‌ నితీశ్‌ రాణా(87: 61 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5  వికెట్లకు 172 పరుగులు చేసింది. ఆరంభంలో మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(26: 17 బంతుల్లో 4ఫోర్లు), ఆఖర్లో దినేశ్‌  కార్తీక్‌(21 నాటౌట్:‌ 10 బంతుల్లో 3ఫోర్లు)  విజృంభించడంతో కోల్‌కతా పటిష్ఠస్థితిలో నిలిచింది.   చివర్లో ఇయాన్‌ మోర్గాన్‌(15) దూకుడుగా ఆడలేకపోయాడు.   చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా సాంట్నర్‌, జడేజా, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ పడగొట్టారు.  

కోల్‌కతా ఇన్నింగ్స్‌లో రాణా బ్యాటింగే హైలైట్‌. ఆరంభం నుంచే  రాణా  చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ  జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు.  తొలి ఓవర్లో శుభ్‌మన్‌ గిల్‌ రెండు ఫోర్లు బాదగా నితీశ్ రాణా ఒక ఫోర్‌ కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి.  ఆ తర్వాతి నాలుగు ఓవర్లలో చెన్నై కట్టుదిట్టంగా బంతులేయడంతో పెద్దగా పరుగులేమీ రాలేదు. సాంట్నర్‌ వేసిన ఆరో ఓవర్లో రాణా రెండు ఫోర్లు, సిక్సర్‌ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లే ఆఖరికి కోల్‌కతా 48/0తో నిలిచింది.  కర్ణ్‌ బౌలింగ్‌లో గిల్‌ ఔట్‌ కాగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన    సునీల్‌ నరైన్‌(7) అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు.   

తన జోరు  కొనసాగించిన  రాణా    44 బంతుల్లో 7ఫోర్లు, సిక్సర్‌ సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌ సహకారం అందించకపోయినా స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగించాడు. కర్ణ్‌ శర్మ వేసిన 16వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్ల కొట్టి 19 పరుగులు రాబట్టాడు. చాహర్‌ వేసిన తర్వాతి ఓవర్‌లోనూ రెండు ఫోర్లు కొట్టి 11 రన్స్‌ సాధించాడు.   వరుస బౌండరీలతో సెంచరీ వైపు దూసుకెళ్తున్న  రాణాను  ఎంగిడి ఔట్‌ చేశాడు.   చివర్లో కార్తీక్‌ మెరుపులతో స్కోరు 170 దాటింది.