మంగళవారం 07 జూలై 2020
Sports - Apr 28, 2020 , 20:02:48

కరోనా అంతం కాకుంటే ఒలింపిక్స్ రద్దే: మోరీ

కరోనా అంతం కాకుంటే ఒలింపిక్స్ రద్దే: మోరీ

టోక్యో: కరోనా వైరస్ పూర్తిగా అంతం కాకుంటే వచ్చే ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్​ను రద్దు చేస్తామని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో మోరీ చెప్పారు. విశ్వక్రీడలను మరోసారి వాయిదా వేసే ప్రసక్తే లేదని మంగళవారం ఓ జపాన్ క్రీడా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు. “ఒలింపిక్స్​ను మళ్లీ వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తే.. రద్దు చేసేస్తాం. ఇంతకు ముందు ప్రపంచ యుద్ధాల సమయంలోనే విశ్వక్రీడలు రద్దయ్యాయి. ప్రస్తుతం కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్​తో పోరాడుతున్నాం. మానవజాతి మొత్తం యుద్ధం చేస్తున్నది. వైరస్ అంతమైతే తప్పకుండా విశ్వక్రీడలను విజయవంతంగా నిర్వహిస్తాం” అని యషిరో మోరీ తెలిపారు. ఈ ఏడాది జూలైలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా వైరస్ కారణంగా వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు విశ్వక్రీడలు జరగాల్సి ఉంది. 


logo