గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 24, 2020 , 06:21:46

10 వికెట్లతో న్యూజిలాండ్‌ ఘనవిజయం..

10 వికెట్లతో న్యూజిలాండ్‌ ఘనవిజయం..

వెల్లింగ్టన్‌: భారత్‌తో జరిగిన తొలి టెస్టుమ్యాచ్‌లో ఆతిథ్య కివీస్‌ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. కివీస్‌.. మరో రోజు మిగిలుండగా, నాలుగో రోజు తొలి సెషన్‌లోనే ఆట ముగించడం గమనార్హం. 9 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. 1.4 ఓవర్లలోనే లాంఛనాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ 7 పరుగులు, టామ్‌ బ్లండెల్‌ 2 పరుగులు  సాధించి కివీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. 

అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 144/4తో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్‌ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 25 పరుగులతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా వైస్‌ కెప్టెన్‌ మరో 4 పరుగులు మాత్రమే జోడించి 29 పరుగులకే పెవిలియన్‌ బాటపట్టాడు. మరో ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ హనుమ విహారి(15) నిన్నటి స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండా డ్రెస్సింగ్‌ రూంకు పయనమయ్యాడు. రెండు ఓవర్ల వ్యవధిలోనే వీరిద్దరినీ కివీస్‌ బౌలర్లు తమ పేస్‌తో బొల్తా కొట్టించారు. కాసేపు రిషభ్‌పంత్‌(25) పోరాడినప్పటికీ.. భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. అతడికి మిగితా బ్యాట్స్‌మెన్‌ నుంచి కనీస సహకారం కూడా అందలేదు. దీంతో సౌథీ బౌలింగ్‌లో షాట్‌ ప్రయత్నించిన పంత్‌.. బౌల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. అనంతరం, మిగితా బ్యాట్స్‌మెన్‌ అలా వచ్చి, ఇలా వెళ్లారు. 

మూడో రోజు 65 ఓవర్లు ఆడిన ఇండియా.. నాలుగో రోజు కేవలం 12 ఓవర్లే ఆడడం శోచనీయం. కివీస్‌ బౌలర్లు.. టిమ్‌ సౌథి 5 వికెట్లతో చెలరేగగా.. ట్రెంట్‌ బౌల్ట్‌ 4 వికెట్లు తీసి, భారత పతనాన్ని శాసించాడు. గ్రాండ్‌ 1 వికెట్‌ పడగొట్టాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్‌.. 1-0తో ఆధిక్యంలో నిలించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తన బౌలింగ్‌తో భారత్‌ను గడగడలాడించిన పేసర్‌ టిమ్‌ సౌథి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కాగా, ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఇండియా.. ఈ మ్యాచ్ తో పరాజయం బాటపట్టింది.


logo