శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 09, 2020 , 00:47:38

కివీస్‌దే సిరీస్‌

కివీస్‌దే సిరీస్‌

న్యూజిలాండ్‌ గడ్డపై టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన ఆనందం టీమ్‌ఇండియాకు ఎక్కువకాలం నిలువలేదు. వన్డేల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేక కోహ్లీసేన చతికిలబడింది. తొలి వన్డేలో బౌలర్లు గతి తప్పితే.. ఈసారి బ్యాట్స్‌మెన్‌ చెత్తషాట్లు ఆడి చేతులెత్తేశారు. ఆఖర్లో జడేజా, సైనీ పోరాడి పరాభవం తీవ్రతను తగ్గించినా ఓ మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ చేజారింది. న్యూజిలాండ్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ మరోసారి విజృంభించి జట్టును నిలబెడితే... అరంగేట్ర మ్యాచ్‌లోనే 6 అడుగుల 8 అంగులాల పేసర్‌ జెమీసన్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరిచి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక మూడో వన్డేలో పరువు దక్కించుకునేందుకు కోహ్లీసేన పోరాడనుంది.

  • రెండో వన్డేలోనూ న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన భారత్‌..
  • జడేజా, సైనీ పోరాటం వృథా..
  • గప్టిల్‌, టేలర్‌ విజృంభణ

ఆక్లాండ్‌: సిరీస్‌ నిలుపుకోవాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆకట్టుకోలేకపోయింది. తొలి వన్డేలో బౌలింగ్‌లో విఫలమైతే.. ఈసారి బ్యాటింగ్‌లో చేతులెత్తేసి ఓ మ్యాచ్‌ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌కు సమర్పించేసుకుంది. శుక్రవారం ఈడెన్‌ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 22 పరుగుల తేడాతో కివీస్‌ చేతిలో పరాజయం పాలై, 0-2తో సిరీస్‌ కోల్పోయింది. ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ (79; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకోగా, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ (73; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది.  మన బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌ 3, శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం మోస్తరు లక్ష్యఛేదనలో భారత్‌ 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్‌ అయ్యర్‌ (52 బంతుల్లో 55; 7 ఫోర్లు, ఓ సిక్సర్‌), జడేజా (73 బంతుల్లో 55; 2 ఫోర్లు, ఓ సిక్సర్‌), సైనీ(49 బంతుల్లో 45, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. జెమీసన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే మంగళవారం జరుగనుంది. 


అయ్యర్‌ ఒక్కడే.. 

లక్ష్యఛేదన ఆరంభంలోనే టీమ్‌ఇండియా తడబడింది. యువ ఓపెనర్‌ పృథ్వీ షా (24; 6 ఫోర్లు) తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో జోరుకనబరచగా.. మయాంక్‌ అగర్వాల్‌ (3) మూడో ఓవర్లోనే ఔటయ్యాడు. కాసేపటికే పృథ్వీ అతడిని అనుసరించాడు. క్రీజులో ఇబ్బందిగా కనిపించిన కెప్టెన్‌ కోహ్లీ (15)ని సౌథీ బౌల్డ్‌ చేయడంతో 57 పరుగులకే భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ ఎండ్‌లో అయ్యర్‌ చక్కగా ఆడుతున్నా.. మంచి ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ (4) త్వరగా పెవిలియన్‌ చేరాడు. జాదవ్‌ (9) విఫలమయ్యాడు. నిలకడగా ఆడుతున్న శ్రేయాస్‌కు జడేజా జతకలువడంతో భారత ఇన్నింగ్స్‌ గాడినపడ్డట్లు కనిపించింది. అర్ధశతకం పూర్తి చేసుకున్న అయ్యర్‌ ఔటవడంతో టీమ్‌ఇండియా పరాజయం దాదాపు ఖాయమైంది. 


జడేజా, సైనీ అద్భుత పోరాటం 

28 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా 131/6తో నిలిచింది. అప్పటికే ప్రధాన బ్యాట్స్‌మన్‌ అంతా పెవిలియన్‌ చేరిపోయారు. ఆ సమయంలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుత పోరాటం చేశాడు. తొలుత శార్దూల్‌ ఠాకూర్‌ (18) సహకారంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించగా.. ఆ తర్వాత సైనీ అతడికి జతకలిశాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై చక్కటి ఇన్నింగ్స్‌తో అందరి మన్ననలు పొందిన జడేజా.. ఈ సారి కూడా తుదివరకు పోరాడాడు. జడ్డూతో పాటు సైనీ కూడా చక్కటి షాట్లు కొట్టడంతో.. భారత విజయ సమీకరణం 6 ఓవర్లలో 52కు చేరింది. వీరద్దరూ వీరలెవల్లో విజృంభిస్తుండటంతో.. భారత్‌ గెలుపు ఆశలు తిరిగి చిగురించాయి. ఈ దశలో జెమీసన్‌ ఈ జోడీని విడగొట్టడంతో టీమ్‌ఇండియా 22 పరుగుల దూరంలో  నిలిచిపోయింది. జడేజా చివరి వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు.


మళ్లీ నిలిచిన టేలర్‌ 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు గప్టిల్‌, నికోల్స్‌ (41) శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించాక చాహల్‌ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత బ్లండెల్‌ (22)ను ఠాకూర్‌ వెనక్కిపంపగా.. గప్టిల్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్‌ లాథమ్‌ (7)ను ఔట్‌ చేసిన జడేజా.. కాసేపటికే అద్భుత త్రోతో నీషమ్‌ను పెవిలియన్‌కు పంపాడు. గ్రాండ్‌హోమ్‌ (5), చాప్‌మన్‌ (1), సౌథీ (3) కూడా వెనువెంటనే పెలియన్‌ చేరడంతో కివీస్‌ 197 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 142/1తో నిలిచిన న్యూజిలాండ్‌.. మిడిలార్డర్‌ వైఫల్యంతో 55 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఎండ్‌లో  టేలర్‌ మరోసారి వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. జెమీసన్‌తో కలిసి అభేద్యమైన తొమ్మి దో వికెట్‌కు 76 పరుగులు జోడించడంతో కివీస్‌ మంచి స్కోరు చేయగలిగింది. 


 1వరుసగా మూడు వన్డేల్లో భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వికెట్‌ తీయలేకపోవడం ఇదే తొలిసారి.


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌: గప్టిల్‌ (రనౌట్‌) 79; నికోల్స్‌ (ఎల్బీ) చాహల్‌ 41; బ్లండెల్‌ (సి) సైనీ (బి) శార్దూల్‌ 22; టేలర్‌ (నాటౌట్‌) 73; లాథమ్‌ (ఎల్బీ) జడేజా 7; నీషమ్‌ (రనౌట్‌/జడేజా) 3; గ్రాండ్‌హోమ్‌ (సి) శ్రేయస్‌ (బి) ఠాకూర్‌ 5; చాప్‌మన్‌ (సి అండ్‌ బి) చాహల్‌ 1; సౌథీ (సి) సైనీ (బి) చాహల్‌ 3; జెమీసన్‌ (నాటౌట్‌) 25, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 50 ఓవర్లలో 273/8. వికెట్ల పతనం: 1-93, 2-142, 3-157, 4-171, 5-175, 6-185, 7-187, 8-197. బౌలింగ్‌: శార్దూల్‌ 10-1-60-2, బుమ్రా 10-0-64-0, సైనీ 10-0-48-0, చాహల్‌ 10-0-58-3, జడేజా 10-0-35-1. 


భారత్‌: పృథ్వీ షా (బి) జెమీసన్‌ 24; మయాంక్‌ (సి) టేలర్‌ (బి) బెనెట్‌ 3; కోహ్లీ (బి) సౌథీ 15; శ్రేయస్‌ (సి) లాథమ్‌ (బి) బెనెట్‌ 52; రాహుల్‌ (బి) గ్రాండ్‌హోమ్‌ 4; జాదవ్‌ (సి) నికోల్స్‌ (బి) సౌథీ 9; జడేజా (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) నీషమ్‌ 55; ఠాకూర్‌ (బి) గ్రాండ్‌హోమ్‌ 18; సైనీ (బి) జెమీసన్‌ 45; చాహల్‌ (రనౌట్‌) 10; బుమ్రా (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 16, మొత్తం: 48.3 ఓవర్లలో 251ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-21, 2-34, 3-57, 4-71, 5-96, 6-129, 7-153, 8-229, 9-251, 10-251, బౌలింగ్‌: బెనెట్‌ 9-0-58-2, సౌథీ 10-1-41-2, జెమీసన్‌ 10-1-42-2, గ్రాండ్‌హోమ్‌ 10-1-54-2, నీషమ్‌ 9.3-0-52-1. 


logo