బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 03, 2020 , 00:26:55

స్వయంకృతమే..

స్వయంకృతమే..

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: భారత అత్యుత్తమ పర్యాటక జట్టు ఇదే అని పదే పదే జబ్బలు చరుచుకునే విరాట్‌ కోహ్లీ, రవిశాస్త్రి ద్వయానికి న్యూజిలాండ్‌ పర్యటనలో ఒకటికి రెండుసార్లు వైట్‌వాష్‌ ఎదురైంది. టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్‌ చేసి కొత్త చరిత్ర సృష్టించిన టీమ్‌ఇండియాకు.. ఆ తర్వాత వన్డే, టెస్టు సిరీస్‌ల్లో ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. తొలి టెస్టు ఓటమి అనంతరం శాస్త్రి మాట్లాడుతూ.. ‘అప్పుడప్పుడు ఇలాంటి అపజయాలు ఎదురైతేనే ఆటగాళ్లు అప్రమత్తంగా ఉంటారు’ అని అన్నాడు. కానీ మనవాళ్లు ఏమాత్రం అప్రమత్తత కనబర్చకుండా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయారు. క్రైస్ట్‌చర్చ్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించిన విహారి మాట్లాడుతూ.. ‘పిచ్‌ పెద్దగా ప్రమాదకరంగా లేదు. భయపెట్టే వికెట్‌ మాత్రం కాదు. బ్యాట్స్‌మెన్‌ షాట్‌ సెలెక్షన్‌ వల్లే వికెట్లు కోల్పోయాం’ అన్నాడు. మరి ప్రత్యర్థి టెయిలెండర్లు కూడా ధాటిగా పరుగులు చేస్తున్న చోట మన స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ప్రభావం చూపలేకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. తొలి టెస్టులో అతి జాగ్రత్తకు పోయి వికెట్‌ సమర్పించుకోవడంతో విమర్శల పాలైన టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ రెండో టెస్టులో ఫర్వాలేదనిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 194/4తో నిలిచి మ్యాచ్‌పై ఆశలు రేపారు. 


ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా మరో 48 పరుగులే చేసి ఆలౌటైంది. కివీస్‌ గడ్డపై పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దుమ్మురేపిన కేఎల్‌ రాహుల్‌ను టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై అనేక విమర్శలు రాగా.. తుది జట్టు ఎంపికలోనూ విరాట్‌ తప్పిదాలు చేశాడు. వికెట్‌ కీపర్‌గా సాహాను కాదని పంత్‌కు తుదిజట్టులో చోటు కల్పించాడు. కీలక సమయాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌.. తన వికెట్‌ విలువ తెలుసుకోకుండా నిర్లక్ష్యపు షాట్‌లతో పూర్తిగా నిరాశపరిచాడు.

స్వదేశంలోని ఫ్లాట్‌పిచ్‌లపై సెంచరీలపై సెంచరీలు బాదే మనవాళ్లు ఈ సిరీస్‌లో కేవలం నాలుగంటే నాలుగే అర్ధశతకాలు కొట్టగలిగారు. అత్యధిక స్కోరు 58 మాత్రమే. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి  కోహ్లీ 9.50 సగటుతో కేవలం 38 పరుగులే చేయడం టీమ్‌ఇండియాను దెబ్బకొట్టింది. అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా పర్యటనకు దూరం కాగా.. అతడి స్థానంలో చోటు దక్కించుకున్న పృథ్వీ షా పరిణతి చూపలేకపోయాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌  కూడా పెద్దగా ఆకట్టుకోలేపోయాడు. డిపెండబుల్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా.. క్రీజులో కుదురుకున్నాక వికెట్‌ సమర్పించుకొని నిరాశ పరిస్తే..  రహానే కూడా అదే తీరు కొనసాగించాడు. ఉన్నంతలో బౌలర్లు నయం అనిపించారు.


logo