బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 23, 2020 , 00:29:50

కివీస్‌దే పైచేయి

కివీస్‌దే పైచేయి

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఎదురులేకుండా దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా.. అసలు సిసలు పోరులో తేలిపోయింది. పేస్‌కుసహకరిస్తున్న పచ్చిక పిచ్‌పై న్యూజిలాండ్‌ బౌలర్లను ఎదుర్కోలేక బ్యాట్స్‌మెన్‌ మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కివీస్‌ బౌలర్లు నిప్పులు చెరిగిన చోట.. మన పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడం మరింత ఆందోళనకు గురిచేసింది. కోహ్లీ, పుజారా లాంటి అత్యుత్తమ ఆటగాళ్లు క్రీజులో నిలువలేకపోయిన చోట విలియమ్సన్‌ చక్కటి ఇన్నింగ్స్‌తో విలువ చాటుకున్నాడు. వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ తన అనుభవాన్నంతా రంగరించి మూడు వికెట్లు పడగొట్టడంతో.. టీమ్‌ఇండియా పోటీలో నిలిచింది.

  • తొలి ఇన్నింగ్స్‌లో 216/5 రాణించిన విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌
  • ఇషాంత్‌కు మూడు వికెట్లు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 165 ఆలౌట్‌

వెల్లింగ్టన్‌: భారత బ్యాట్స్‌మెన్‌ తడబడ్డ చోట న్యూజిలాండ్‌ ఆటగాళ్లు అదరగొట్టారు. హేమాహేమీలైన మనవాళ్లు పరుగులు చేసేందుకు ప్రయాసపడ్డ పిచ్‌పై.. ఆతిథ్య జట్టు ప్లేయర్లు అదుర్స్‌ అనిపించారు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (153 బంతుల్లో 89; 11 ఫోర్లు) క్లాస్‌ ఇన్నింగ్స్‌కు.. వందో టెస్టు ఆడుతున్న రాస్‌ టేలర్‌ (44; 6 ఫోర్లు, ఒక సిక్స్‌) సంయమనం తోడవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 216/5తో నిలిచింది. న్యూజిలాండ్‌ పేసర్లు విజృంభించిన చోట భారత ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (0/62) కనీస ప్రభావం చూపలేకపోయాడు. ఇషాంత్‌ శర్మ (3/31) ఆకట్టుకున్నాడు. అంతకుముందు పేలవ ప్రదర్శన కొనసాగించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటైంది. అజింక్యా రహానే (138 బంతుల్లో 46) కాస్త పోరాడాడు. కివీస్‌ బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు జెమీసన్‌ (4/39), వెటరన్‌ పేసర్‌ సౌథీ (4/49) నిప్పులు చెరిగారు. ప్రస్తుతం చేతిలో 5 వికెట్లు ఉన్న న్యూజిలాండ్‌ 51 పరుగుల ఆధిక్యంలో ఉంది. వాట్లింగ్‌ (14), గ్రాండ్‌హోమ్‌ (4) క్రీజులో ఉన్నారు. ఆదివారం ఈ జోడీని విడదీయడంపైనే భారత్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.


ఆరంభంలో ప్రభావం చూపినా..

నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ను ఆరంభంలో భారత బౌలర్లు ఇబ్బంది పెట్టారు. బుమ్రా, ఇషాంత్‌, షమీ చక్కటి బంతులతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. క్రీజులో అసౌకర్యంగా కనిపించిన లాథమ్‌ (11)ను ఔట్‌ చేసిన ఇషాంత్‌ భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు. ఈ దశలో క్రీజులోకొచ్చిన కెప్టెన్‌ విలియమ్సన్‌ తన శైలికి భిన్నంగా ధాటిగా ఆడాడు. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ స్కోరుబోర్డును ఉరకలెత్తించాడు. రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించాక బ్లండెల్‌ (30)ను కూడా ఇషాంత్‌ పెవిలియన్‌ దారి చూపెట్టాడు. ఇక న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ కూడా తడబడటం ఖాయం అనుకుంటే.. విలియమ్సన్‌ చక్కటి ఇన్నింగ్స్‌తో కివీస్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.


కేన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌

వందో టెస్టు ఆడుతున్న రాస్‌ టేలర్‌తో కలిసి విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఏమాత్రం తొందరపాటుకు పోకుండా.. నింపాదిగా ఆడిన ఈ జోడీ మంచి బంతులను గౌరవిస్తూ చెత్తబంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. ఈ క్రమంలో విలియమ్సన్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. టీ తర్వాత మరింత దూకుడు పెంచిన ఈ ఇద్దరు వేగంగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా బుమ్రాను లక్ష్యంగా చేసుకున్న విలియమ్సన్‌ చూడచక్కటి షాట్లతో అలరించాడు. ఓవర్‌కో బౌండ్రీ చొప్పున బాదుతున్న ఈ జోడీని ఇషాంత్‌ విడదీశాడు. మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించాక టేలర్‌ ఔటయ్యాడు. ఈ దశలో మనవాళ్లు కాస్త ఒత్తిడి పెంచడంతో పరుగుల రాక మందగించింది. ఒత్తిడికి గురైన విలియమ్సన్‌.. షమీ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటయ్యాడు. జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన నికోల్స్‌ (62 బంతుల్లో 17)ను అశ్విన్‌ పెవిలియన్‌ పంపడంతో భారత్‌ కాస్త పోటీలోకొచ్చింది.


43 పరుగులకే ఐదు వికెట్లు

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోర్‌ 122/5తో శనివారం తొలి ఇన్నిం గ్స్‌ కొనసాగించిన భారత్‌ క్రితం రోజు స్కోరుకు మరో 43 పరుగులు జోడించి ఆలౌటైంది. ఆట మొదలయ్యాక తొలి ఓవర్‌లోనే సిక్సర్‌తో అలరించిన పంత్‌ అనూహ్యంగా రనౌటై పె విలియన్‌ బాట పట్టాడు. సౌథీ బంతిని పాయింట్‌ దిశగా ఆడిన రహానే పరుగు కోసం క్రీజు వదిలి బయటకు వచ్చాడు. మొదట ఇది గుర్తించని పంత్‌ బంతి ఎక్కడుందో చూసేలోపే అజింక్యా సగం పిచ్‌ వరకు చేరుకున్నాడు. ఇక తప్పని పరిస్థితిలో పరుగు మొదలెట్టిన రిషభ్‌.. క్రీజులోకి చేరుకునేలోపే ఎజాజ్‌ పటేల్‌ వేసిన త్రో నేరుగా వికెట్లను తాకింది. దీంతో జింక్స్‌ కోసం తన వికెట్‌ వదులుకున్న పంత్‌ భారంగా డగౌట్‌ చేరాడు. మరుసటి బంతికే అశ్విన్‌ (0) కూడా ఔటయ్యాడు. ప్రధాన బ్యాట్స్‌మన్‌ అంతా పెవిలియన్‌ చేరిపోవడంతో బ్యాట్‌కు పనిచెప్పాలనుకున్న రహానే ఓ ఫోర్‌ కొట్టి.. సౌథీ బౌలింగ్‌లోనే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి బౌటయ్యాడు. చివర్లో ధాటిగా ఆడిన షమీ (21) కొన్ని విలువైన పరుగులు జోడించాడు.


ఒక్క ఇన్నింగ్స్‌లో రాణించకపోవడంతోనే విమర్శలు గుప్పించడం సరికాదు. గత రెండెండ్లుగా మా బౌలింగ్‌ దళం నిలకడగా 20 వికెట్లు పడగొడుతూ వస్తున్నది. బుమ్రా సామర్థ్యంపై సందేహం అక్కర్లేదు. అతడు ప్రపంచ స్థాయి బౌలర్‌. తొలి ఇన్నింగ్స్‌తో పోల్చుకుంటే వికెట్‌ స్లోగా మారింది. ఆరంభంలో టెన్నిస్‌ బాల్‌ పిచ్‌లా కనిపించినా.. మేము బౌలింగ్‌ చేసే సమయానికి వికెట్‌ నుంచి మూమెంట్‌ కరువైంది. బంతి సరిగ్గా బ్యాట్‌పైకి వస్తుండటంతో పరుగులు చేయడం తేలికైంది.

- ఇషాంత్‌ శర్మ


పంత్‌ రనౌట్‌ కావడమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. రహానేను ఔట్‌ చేసేందుకు మేం ఎలాంటి ప్రత్యేక వ్యూహాలు అనుసరించలేదు. పంత్‌ ఉంటే జింక్స్‌ (రహానే ముద్దుపేరు)తో కలిసి వేగంగా పరుగులు చేసేవాడు. ప్రస్తుతం మ్యాచ్‌లో మేం మంచి స్థితిలో ఉన్నాం. ఆదివారం ఇదే జోరు కొనసాగిస్తే తిరుగుండదు. 

- సౌథీ, న్యూజిలాండ్‌ పేసర్‌


స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బ) సౌథీ 16, మయాంక్‌ (సి) జెమీసన్‌ (బి) బౌల్ట్‌ 34, పుజారా (సి) వాట్లింగ్‌ (బి) జెమీసన్‌ 11, కోహ్లీ (సి) టేలర్‌ (బి) జెమీసన్‌ 2, రహానే (సి) వాట్లింగ్‌ (బి) సౌథీ 46, విహారి (సి) వాట్లింగ్‌ (బి) జెమీసన్‌ 7, పంత్‌ (రనౌట్‌/ఎజాజ్‌ పటేల్‌) 19, అశ్విన్‌ (బి) సౌథీ 0, ఇషాంత్‌ (సి) వాట్లింగ్‌ (బి) జెమీసన్‌ 5, షమీ (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 21, బుమ్రా (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 68.1 ఓవర్లలో 165 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-16, 2-35, 3-40, 4-88, 5-101, 6-132, 7-132, 8-143, 9-165, 10-165, బౌలింగ్‌: సౌథీ 20.1-5-49-4, బౌల్ట్‌ 18-2-57-1, గ్రాండ్‌హోమ్‌ 11-5-12-0, జెమీసన్‌ 16-3-39-4, ఎజాజ్‌ పటేల్‌ 3-2-7-0.


న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 11, బ్లండెల్‌ (బి) ఇషాంత్‌ 30, విలియమ్సన్‌ (సి) (సబ్‌) జడేజా (బి) షమీ 89, టేలర్‌ (సి) పుజారా (బి) ఇషాంత్‌ 44, నికోల్స్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 17, వాట్లింగ్‌ (నాటౌట్‌) 14, గ్రాండ్‌హోమ్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 71.1 ఓవర్లలో 216/5. వికెట్ల పతనం: 1-26, 2-73, 3-166, 4-185, 5-207, బౌలింగ్‌: బుమ్రా 18.1-4-62-0, ఇషాంత్‌ 15-6-31-3, షమీ 17-2-61-1, అశ్విన్‌ 21-1-60-1.


logo