e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home స్పోర్ట్స్ బుల్లెట్‌ దిగింది

బుల్లెట్‌ దిగింది

బుల్లెట్‌ దిగింది
  • అదరగొట్టిన ఆరడుగుల పేసర్‌ జెమీసన్‌
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 217 ఆలౌట్‌.. న్యూజిలాండ్‌ 101/2

పరీక్ష పెడుతున్న పచ్చిక పిచ్‌పై మనవాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన చోట.. కివీస్‌ ఆటగాళ్లు సవాళ్లకు ఎదురొడ్డి నిలిచారు. ఓవర్లకు ఓవర్లు కరిగిస్తూ స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు కదిలించారు. ఆరడుగుల ఎనిమిదంగుళాల పేసర్‌ కైల్‌ జెమీసన్‌ నిప్పులు చెరిగిన చోట.. భారత పేస్‌ త్రయం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ మెరుగైన స్థితికి చేరితే.. టీమ్‌ఇండియా కష్టాల అంచులో నిలిచింది. వరుణుడి దోబూచులాట కొనసాగుతున్న పోరులో.. సోమవారం కివీస్‌ను ఎన్ని పరుగులలోపు కట్టడి చేస్తారో అనేదానిపైనే ఈ మ్యాచ్‌ భవితవ్యం ఆధారపడి ఉంది!

సౌతాంప్టన్‌: బౌలర్ల అద్భుత ప్రదర్శనకు బ్యాట్స్‌మెన్‌ పట్టుదల తోడవడంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్‌ పైచేయి దిశగా సాగుతున్నది. చల్లటి వాతావరణంలో చక్కటి బౌలింగ్‌తో టీమ్‌ఇండియాను కట్టిపడేసిన కివీస్‌.. ఆ తర్వాత టాపార్డర్‌ రాణించడంతో మంచి స్కోరు చేసింది. ఆరడుగుల ఎనిమిదంగుళాల పేసర్‌ కైల్‌ జెమీసన్‌ (5/31) ధాటికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. నాయకద్వయం విరాట్‌ కోహ్లీ (44), అజింక్యా రహానే (49) ఫర్వాలేదనిపించగా.. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌, వాగ్నర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌ వెలుతురులేమి కారణంగా ఆదివారం ఆట నిలిచిపోయే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఓపెనర్లు కాన్వే (54), లాథమ్‌ (30) రాణించారు. చేతిలో 8 వికెట్లు ఉన్న కివీస్‌.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 116 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం విలియమ్సన్‌ (12), టేలర్‌ (0) క్రీజులో ఉన్నారు.

పెవిలియన్‌కు క్యూ..

- Advertisement -

ఓవర్‌నైట్‌ స్కోరు 146/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియాకు ఏదీ కలిసిరాలేదు. క్రీజులో పాతుకుపోతాడనుకున్న పుజారా శనివారమే పెవిలియన్‌ చేరిపోగా.. ఆశలు పెట్టుకున్న కోహ్లీ క్రితం రోజు స్కోరుకు ఒక్క పరుగూ జత చేయకుండానే ఔటయ్యాడు. జెమీసన్‌ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయిన విరాట్‌.. రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. కివీస్‌ పేసర్లు స్వింగ్‌తో చెలరేగుతుంటే.. రహానే, పంత్‌ (4) వరుసగా ఆరు ఓవర్లు మెయిడెన్‌ చేశారు. తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడేందుకు ప్రయత్నించిన పంత్‌.. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతికి వికెట్‌ చేజార్చుకోగా.. క్రీజులో పాతుకుపోయిన రహానే అర్ధశతకానికి పరుగు దూరంలో వాగ్నర్‌కు చిక్కాడు. ఈ దశలో అశ్విన్‌ (22), జడేజా (15) కాసేపు పట్టుదల కనబర్చడంతో చివరకు భారత్‌ 217 పరుగులకు ఆలౌటైంది.

సూపర్‌ ఓపెనింగ్‌

కివీస్‌ బౌలర్లు పేస్‌, స్వింగ్‌ రాబట్టిన చోట భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కట్టుదిట్టమైన బంతులు వేసినా.. వికెట్లు మాత్రం పడగొట్టలేకపోయారు. ప్రమాదకర పిచ్‌పై ఓపెనర్లు లాథమ్‌, కాన్వే ఆచితూచి ఆడారు. ఆఫ్‌స్టంప్‌ అవతలపడ్డ బంతులను వదిలేస్తూ.. అడపాదడపా బౌండ్రీలు బాదడంతో కివీస్‌ స్కోరు నత్తనడకన సాగింది. తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించిన అనంతరం లాథమ్‌ను ఔట్‌ చేసి అశ్విన్‌ భారత్‌కు బ్రేక్‌నిచ్చాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌ కూడా జాగ్రత్తగా ఆడగా.. అర్ధశతకం పూర్తి చేసుకున్న అనంతరం కాన్వే ఔటయ్యాడు. వెలుతురు మందగించడంతో అంపైర్లు నిర్ణీత సమయం కంటే ముందే ఆటను నిలిపివేశారు. ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా ఉండటంతో ఆదివారం ఉదయం కూడా ఆట అరగంట ఆలస్యంగా ఆరంభమైంది.

స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) సౌథీ (బి) జెమీసన్‌ 34, గిల్‌ (సి) వాట్లింగ్‌ (బి) వాగ్నర్‌ 28, పుజారా (ఎల్బీ) బౌల్ట్‌ 8, కోహ్లీ (ఎల్బీ) జెమీసన్‌ 44, రహానే (సి) లాథమ్‌ (బి) వాగ్నర్‌ 49, పంత్‌ (సి) లాథమ్‌ (బి) జెమీసన్‌ 4, జడేజా (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 15, అశ్విన్‌ (సి) లాథమ్‌ (బి) సౌథీ 22, ఇషాంత్‌ (సి) టేలర్‌ (బి) జెమీసన్‌ 4, బుమ్రా (ఎల్బీ) జెమీసన్‌ 0, షమీ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 217. వికెట్ల పతనం: 1-62, 2-63, 3-88, 4-149, 5-156, 6-182, 7-205, 8-213, 9-213, 10-217, బౌలింగ్‌: సౌథీ 22-6-64-1, బౌల్ట్‌ 21.1-4-47-2, జెమీసన్‌ 22-12-31-5, గ్రాండ్‌హోమ్‌ 12-6-32-0, వాగ్నర్‌ 15-5-40-2.
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 30, కాన్వే (సి) షమీ (బి) ఇషాంత్‌ 54, విలియమ్సన్‌ (నాటౌట్‌) 12, టేలర్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 101/2. వికెట్ల పతనం: 1-70, 2-101, బౌలింగ్‌: ఇషాంత్‌ 12-4-19-1, బుమ్రా 11-3-34-0, షమీ 11-4-19-0, అశ్విన్‌ 12-5-20-1, జడేజా 3-1-6-0.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బుల్లెట్‌ దిగింది
బుల్లెట్‌ దిగింది
బుల్లెట్‌ దిగింది

ట్రెండింగ్‌

Advertisement