శుక్రవారం 10 జూలై 2020
Sports - May 11, 2020 , 00:36:30

కోహ్లీ సేన కొత్త చరిత్ర

కోహ్లీ సేన కొత్త చరిత్ర

  • ఏడు దశాబ్దాల తర్వాత ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ విజయం

భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో మునుపెన్నడూ సాధ్యం కాని ఘనత.. ఎందరో గొప్ప కెప్టెన్‌లు.. మరెందరో దిగ్గజ ఆటగాళ్ల జీవిత కాల స్వప్నం. ఏడు దశాబ్దాలుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న మధురక్షణం. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ విజయం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ గతేడాది విరాట్‌ కోహ్లీ అండ్‌ కో లిఖించిన కొత్త చరిత్రను మరోసారి పరికించి చూస్తే..

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం 2018-19లో కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా ఆసీస్‌ గడ్డపై అడుగుపెట్టింది. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో కీలక ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, వార్నర్‌ అందుబాటులో లేకపోవడంతో.. ఈ సారి కోహ్లీ సేన చరిత్ర లిఖిస్తుందని విశ్లేషకులు ముందే ఊహించారు. అనుకున్న ఫలితమే (2-1)వచ్చినా.. అది అంత సులువుగా దక్కిందేం కాదు. తొలిటెస్టు.. తొలి సెషన్‌లోనే భారత ఆటగాళ్లకు విషమ పరీక్ష ఎదురైంది. కంగారూ పేసర్ల బౌన్స్‌, పేస్‌కు బిత్తరపోయిన మనవాళ్లు.. గంటలోపే 4 ప్రధాన వికెట్లు కోల్పోయారు. ఇంకేముంది మళ్లీ పాత కథే అనే అనుమానాలు.. గతంలో 11 సార్లు ఆసీస్‌ గడ్డపై పర్యటించినా ఒక్క సారి కూడా టెస్టు సిరీస్‌ నెగ్గింది లేదు. ఈ సారీ రిక్తహస్తాలే అనుకుంటున్న దశలో మనవాళ్లు సమిష్టిగా సత్తాచాటారు.

దంచికొట్టిన పుజారా..

కష్టకాలంలో నేనున్నానంటూ భరోసా ఇచ్చిన చతేశ్వర్‌ పుజారా.. సిరీస్‌ ఆసాంతం రాణించాడు. తన అద్వితీయమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు.  సెషన్లకు సెషన్లు క్రీజులో పాతుకుపోతూ.. మొత్తం 7 ఇన్నింగ్స్‌లో 1258 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్‌ ఆరంభానికి ముందు వరకు పుజారా స్ట్రయిక్‌రేట్‌పై అనేక విమర్శలు ఉన్నప్పటికీ.. ఆసీస్‌లో అడుగు పెట్టగానే.. ‘జట్టులో చివరి బ్యాట్స్‌మన్‌గానే నువ్వు వెనుదిరగాలి. పరుగుల గురించి పట్టించుకోకు. నువ్వు సమయంతో ఆడుకో’ అని కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లీ చెప్పిన మాటలను మన పుజ్జీ తూచా తప్పకుండా పాటించాడు.

బూమ్‌ బూమ్‌ బుమ్రా..

అప్పటివరకు విదేశీ బౌలర్లకు తలవంచే భారత బ్యాట్స్‌మెన్‌ను చూడటం అలవాటైన ప్రేక్షకులకు.. ఈ సిరీస్‌ కొత్త విషయాలు నేర్పింది. మన పేసర్లూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలరని.. వారికి మించిన బౌన్సర్లు విసరగలరని నిరూపించింది. మొత్తం 7 ఇన్నింగ్స్‌ల్లో మనవాళ్లు ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయడం గమనార్హం. ఇందులో అగ్రతాంబూలం బుమ్రాకే దక్కుతుంది. 4 టెస్టుల్లో అతడు 21 వికెట్లు పడగొట్టాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడుతూనే.. వైవిధ్యమైన బంతులతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించిన తీరు అద్భుతం.

పంత్‌ స్లెడ్జింగ్‌ 

ఆసీస్‌ ఆటగాళ్లకు దీటుగా స్లెడ్జింగ్‌కు దిగిన రిషబ్‌ పంత్‌ ఈ సిరీస్‌లో బ్యాట్‌తోనూ ఆకట్టుకున్నాడు. ‘వికెట్ల ముందు పంత్‌ పోరాటం గిల్‌క్రిస్ట్‌ను తలపించింది’ అని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ పాంటింగ్‌ అన్నాడంటే మన బుడ్డోడు ఏ రేంజ్‌లో ఇరగదీశాడో అర్థం చేసుకోవచ్చు. సిరీస్‌లో కోహ్లీ (282) కంటే ఎక్కువ (350) పరుగులు చేయడంతో పాటు స్లెడ్జింగ్‌ అంశంపై ఆ దేశ ప్రధానితో చర్చించి వార్తల్లో నిలిచాడు.


logo