శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 29, 2020 , 23:12:19

నీరజ్‌ చోప్రాకు టోక్యో టికెట్‌

నీరజ్‌ చోప్రాకు టోక్యో టికెట్‌
  • 87.86మీటర్ల ప్రదర్శనతో ఒలింపిక్స్‌కు అర్హత

పోట్చెఫ్‌స్ట్రూమ్‌(దక్షిణాఫ్రికా): భారత స్టార్‌ జావెలిన్‌ త్రోవర్‌ నీరజ్‌ చోప్రా.. ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మోచేతికి శస్త్రచికిత్స కారణంగా గతేడాది మొత్తం ఆటకు దూరమైన అతడు... పునరాగమనంలో  తొలి టోర్నీలోనే సత్తాచాటాడు. బుధవారమిక్కడ జరిగిన ఏసీఎన్‌ఈ లీగ్‌లో నీరజ్‌ 87.86మీటర్ల త్రోతో టోక్యో టికెట్‌ దక్కించుకున్నాడు. ఒలింపిక్స్‌ అర్హత మార్క్‌ 85మీటర్లు కాగా ఆ లక్ష్యాన్ని అతడు సునాయాసంగా బద్దలు కొట్టాడు. సుదీర్ఘ కాలం తర్వాత బరిలోకి దిగడంతో తొలి మూడు ప్రయత్నాలను ప్రాక్టీస్‌గా భావించిన నీరజ్‌ నెమ్మదిగా జోరు పెంచాడు. తొలి ప్రయత్నంలో 81.76మీటర్లే సాధించగా.. రెండు, మూడు ప్రయత్నాల్లో 82, 82.57 మీటర్లు విసిరి సన్నాహకాన్ని పూర్తి చేసుకున్నాడు. నాలుగో ప్రయత్నంలో ఆత్మవిశ్వాసంతో పరుగెత్తుకొచ్చి 87.86మీటర్ల మార్క్‌ను సాధించాడు. ఇది నీరజ్‌ చోప్రా కెరీర్‌లోనే రెండో అత్యుత్తమం కాగా.. 2018 ఆసియా గేమ్స్‌లో 88.06మీటర్లు ఈటెను విసిరి స్వర్ణాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఈ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. రానున్న నెలల్లో వీలైనన్ని ఎక్కువ టోర్నీల్లో పోటీ పడతా’ అని నీరజ్‌ చోప్రా చెప్పాడు. భారత్‌కు చెందిన మరో అథ్లెట్‌ రోహిత్‌ యాదవ్‌ 77.61మీటర్లకే పరిమితమయ్యాడు.



logo