మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 18:16:07

'పుజార కోసం ప్రత్యేక వ్యూహం'

'పుజార కోసం ప్రత్యేక వ్యూహం'

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది చివర్లో జరగాల్సిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా నయావాల్‌ చతేశ్వర్‌ పుజారను త్వరగా ఔట్‌ చేసేందుకు ప్రణాళికలు రచిస్తామని ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు. 2018-19 సిరీస్‌లో పుజార అద్భుతంగా ఆడాడని కమిన్స్‌ శనివారం ఓ ఇంటర్వూ్యలో అన్నాడు. ఆ సిరీస్‌లో పుజార 74కు పైగా బ్యాటింగ్‌ సగటుతో 521 పరుగులు చేసి.. తొలిసారి ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ను భారత్‌ గెలువడంతో కీలకపాత్ర పోషించాడు.

"భారత్‌ తరఫున ఆ సిరీస్‌లో(20181-19) పుజార గొప్పగా ఆడాడు. అతడు కాస్త సమయం తీసుకొని ఆడతాడు. ఏకాగ్రతను ఎక్కువగా కోల్పోడు. ఒకవేళ గత సిరీస్‌లాగా అతడు బాగా ఆడితే.. ఔట్‌ చేసేందుకు మేం ఓ కొత్త వ్యూహాన్ని రచించాలి. ఈసారి పరిస్థితులు మా జట్టుకు అనుకూలంగా ఉంటాయనుకుంటున్నా. పుజార లాంటి బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయాలంటే అతడు కురుకోకుండా ఇబ్బంది పడే బంతులను తరచూ సంధించాల్సిన అవసరం ఉంటుంది' అని కమిన్స్‌ అన్నాడు. అలాగే తాను ఆడే ప్రతి టెస్టు మ్యాచ్‌ నుంచి కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని అతడు చెప్పాడు. చివరిసారి కంటే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఎంతో పటిష్టంగా ఉందని ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు. ఈ ఏడాది చివర్లో భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది.  


logo