బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 18, 2020 , 03:19:12

మరింత కఠిన చర్యలు అవసరం: సాయ్‌

మరింత కఠిన చర్యలు అవసరం: సాయ్‌

న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ వస్తున్న ఆరోపణలను భారత క్రీడాప్రాధికార సంస్థ(సాయ్‌) కొట్టిపారేసింది. సాయ్‌కు చెందిన 24 కేంద్రాల్లో గత పదేండ్లలో 45 వేధింపుల కేసులు నమోదైనా పెద్దగా చర్యలు తీసుకోలేదంటూ వెలువడిన ఓ నివేదిక దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయ్‌ శుక్రవారం స్పందించింది. దశాబ్ద కాలంలో 35కేసులు నమోదయ్యాయని వాటిలో 14కేసుల్లో ఇప్పటికే చర్యలు తీసుకోగా.. 15 విచారణ చేస్తున్నామని వెల్లడించింది. మిగిలిన వాటిలో మూడు తప్పుడు ఫిర్యాదులు కాగా ఇద్దరు కోర్టుకు వెళ్లి విముక్తి పొందారని, ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడగా, మరో కేసు ఉపసంహరణకు గురైందని పేర్కొంది. మొత్తం 35వేధింపుల కేసుల్లో 27కోచ్‌లపై మరో ఎనిమిది సాయ్‌ అధికారులపై నమోదయ్యాయని వెల్లడించింది. అలాగే వేధింపులను నిరోధించేందుకు పటిష్ఠమైన వ్యవస్థ ఏర్పాటుతో పాటు దోషిగా తేలితే మరింత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ‘శిక్షలను కఠినతరం చేయాలన్న వాదనను సమర్థిస్తున్నా. కానీ అదో విధానపరమైన నిర్ణయం. మంత్రిత్వ శాఖ స్థాయిలోనే దానిని మార్చేందుకు వీలుంటుంది’ అని సాయ్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ప్రతి ఏడాది సాయ్‌లో 15వేల మంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారని, అలాగే పదేండ్లలో లక్షన్నర మందిని తీర్చిదిద్దినట్టు సాయ్‌ తెలిపింది.

విచారణ పూర్తి చేయండి : రిజిజు

పెండింగ్‌లో ఉన్న లైంగిక వేధింపుల కేసుల విచారణను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని కేంద్ర క్రీడా మంత్రి రిజిజు.. సాయ్‌ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అథ్లెట్లపై వేధింపులను నిరోధించగలుగుతుందో లేదో చూసి దాన్ని మరింత పటిష్ఠం చేస్తామన్నారు. 


logo
>>>>>>