ఆదివారం 05 జూలై 2020
Sports - May 06, 2020 , 17:03:24

ఆ ఫైన‌ల్‌ను గుర్తు చేసుకోను: నాసిర్ హుసేన్‌

ఆ ఫైన‌ల్‌ను గుర్తు చేసుకోను:  నాసిర్ హుసేన్‌

లండ‌న్‌:  నాట్‌వెస్ట్ సిరీస్ (2002) ఫైన‌ల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకోవ‌డం త‌న‌కిష్ట‌ముండ‌ద‌ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ పేర్కొన్నాడు. భార‌త ఆట‌గాళ్లు మైదానంలో కింద‌ప‌డి సంబురాలు జ‌రుపుకుంటున్న ఓ ఫొటోను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) బుధ‌వారం ట్విట్ట‌ర్లో పెట్టి.. ఇవి ఏ మ్యాచ్‌కు సంబంధించిన‌వో గుర్తున్నాయా అని వ్యాఖ్య జోడించింది. దీనికి నాసిర్ హుస్సేన్ బ‌దులిస్తూ.. గుర్తు లేదు. అస‌లు గుర్తు చేసుకోవాల‌నుకోవ‌డం లేదు. అని వ్యాఖ్యానించాడు. 

ఇక నాట్‌వెస్ట్ సిరీస్ ఫైన‌ల్ విష‌యానికి వ‌స్తే.. లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన ఆ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 325 ప‌రుగులు చేసింది. అందులో నాసిర్ హుసేన్ శ‌త‌కం కూడా ఉంది. అనంత‌రం ల‌క్ష్య‌ఛేద‌న‌లో 146 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి ఓట‌మి అంచుల్లో నిలిచింది. ఈ ద‌శ‌లో మ‌హ‌మ్మ‌ద్ కైఫ్‌, యువ‌రాజ్ సింగ్ అద్వితీయ పోరాటంతో కోలుకున్న టీమ్ఇండియా చివ‌ర‌కు మ‌ధుర‌మైన విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఈ ఆనంద స‌మ‌యంలోనే అప్ప‌టి భార‌త కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ.. లార్డ్స్ బాల్కానీలో చొక్కా విప్పి సంబురాలు చేసుకున్నాడు. 


logo