శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Feb 20, 2021 , 15:40:02

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ విజేత న‌వోమి ఒసాకా

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ విజేత న‌వోమి ఒసాకా

మెల్‌బోర్న్‌:  ఆస్ట్రేలియన్‌  ఓపెన్ వుమెన్స్ సింగిల్స్ ఈ యేటి టైటిల్‌ను జ‌పాన్ స్టార్ ప్లేయ‌ర్ న‌వోమి ఒసాకా ఎగురేసుకుపోయింది.  ఇవాళ మెల్‌బోర్న్‌లో జ‌రిగిన ఫైన‌ల్లో ఒసాకా త‌న ప‌వ‌ర్ ప్లేతో సంపూర్ణ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. అమెరికా ప్లేయ‌ర్ జెన్నిఫ‌ర్ బ్రాడీపై 6-4, 6-3 తేడాతో ఒసాకా విజ‌యం సాధించింది. దీంతో ఒసాకా ఖాతాలో నాలుగ‌వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది.  ఆస్ట్రేలియన్ ఓపెన్ గెల‌వ‌డం ఒసాకాకు ఇది రెండ‌వ సారి.  ఓపెన్ ఎరా టెన్నిస్‌లో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ను రెండ‌వ‌సారి గెలిచిన 12వ క్రీడాకారిణిగా ఒసాకా నిలిచింది. వ‌రుస‌గా 21 మ్యాచ్‌లు గెలిచిన ఒసాకా.. హార్డ్ కోర్టు క్వీన్‌గా రూపాంత‌రం చెందుతోంది.  

న‌వోమి ఒసాకా షాట్ ప్లే.. ఓ బాక్స‌ర్‌ను త‌ల‌పించింది. భారీ పంచ్‌లు విసిరిన‌ట్లే.. ఒసాకా త‌న రాకెట్‌తో ప్ర‌త్య‌ర్థిపై దాడి చేసింది.  బ‌ల‌మైన షాట్ల‌తో పాయింట్ల‌ను రాబ‌ట్టింది.  ఏమాత్రం క‌నిక‌రంలేన్న‌ట్లు ఒసాకా చెల‌రేగి ఆడింది. నిజానికి జెన్నిఫ‌ర్ బ్రాడీ కూడా అద్భుత‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించింది.  బ్యాక్‌హ్యాండ్ షాట్ల‌తో అల‌రించింది. ఒసాకా దూకుడును త‌న ప‌వ‌ర్ గేమ్‌తో అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింది.  భారీ స‌ర్వ్‌ల‌తోనూ బ్రాడీ కేక పుట్టించింది.  ఫైన‌ల్లో ఇద్ద‌రూ ప‌వ‌ర్‌ఫుల్ షాట్ల‌తో స్టేడియంలో హోరెత్తించారు.  బ్రేక్ పాయింట్‌ను సాధించిన ఒసాకా త‌న తొలి సెట్‌ను 6-4 తేడాతో కైవ‌సం చేసుకున్న‌ది. 

ఇక రెండ‌వ సెట్‌లోనూ ఒసాకా త‌న దూకుడు ఆప‌లేదు. రెండ‌వ సెట్‌లో తొలి నాలుగు పాయింట్ల‌ను అత్యంత సులువుగా సాధించింది ఒసాకా.  జ‌పాన్ ప్లేయ‌ర్‌ను ఇబ్బంది పెట్ట‌డంలో బ్రాడీ విఫ‌ల‌మైంది.  మ్యాచ్ మొత్తం ఒసాకా త‌న ఆధిపత్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. రెండ‌వ సెట్‌లో డ‌బుల్ బ్రేక్ సాధించిన ఒసాకా త‌న నాలుగ‌వ టైటిల్‌ను ఈజీగా ఖ‌రారు చేసుకున్న‌ది. ఒసాకా త‌న ప‌వ‌ర్ గేమ్‌తో బ్రాడీని టెన్ష‌న్‌లో ప‌డేసింది. ఆ వ‌త్తిడిలో అమెరిక‌న్ ప్లేయ‌ర్ అన‌వ‌స‌ర త‌ప్పిదాల‌ను చేసింది.  4-0 ద‌శ‌లో కోలుకున్న బ్రాడీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు పాయింట్లు చేజిక్కించుకుని 4-2తో మ్యాచ్‌పై ఆశ నిలుపుకున్న‌ది. కానీ చివ‌ర్లో మ‌ళ్లీ చెల‌రేగిన ఒసాకా ..  రెండ‌వ సెట్‌ను 6-3 తేడాతో గెలిచి త‌న ఖాతాలో మ‌రో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను వేసుకున్న‌ది. 

VIDEOS

logo