సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Sep 14, 2020 , 02:02:12

క్వీన్‌ ఒసాక

క్వీన్‌ ఒసాక

  • ఫైనల్‌లో అజరెంకాపై విజయం..  యూఎస్‌ ఓపెన్‌ 
  • ప్రైజ్‌మనీ విజేత: రూ.22.14 కోట్లు ,రన్నరప్‌: రూ.11.02 కోట్లు 

యూఎస్‌ ఓపెన్‌లో నవోమీ ఒసాక మరోసారి సత్తాచాటింది. అంతులేని ఆత్మవిశ్వాసంతో పోరాడి టైటిల్‌ను కైవసం చేసుకుంది. విక్టోరియా అజరెంకాతో జరిగిన తుదిపోరులో తొలి సెట్‌ కోల్పోయి వెనుకబడినా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని మహిళల సింగిల్స్‌ విజేతగా నిలిచింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రేక్షకులు లేకుండా సాగిన తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ టైటిల్‌ను నవోమీ ముద్దాడింది. కాగా మొదటి గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ కోసం పట్టుదలగా ఉన్న డొమినిక్‌ థీమ్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌  పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. 

విజయం గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. అలసట లేకుండా పోరాడాలనే భావించా. మొత్తానికి టైటిల్‌తో ముగించా. అజరెంకా చాలా కఠినమైన పోటీనిచ్చింది. 

- ఒసాక  

న్యూయార్క్‌:  జపాన్‌ మహిళా స్టార్‌ ప్లేయర్‌ నవోమీ ఒసాక రెండోసారి యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన నవోమీ ఫైనల్‌లోనూ వీరోచిత పోరాటంతో విజేతగా నిలిచింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆర్థర్‌ అష్‌ స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్‌ తుదిపోరులో నాలుగో సీడ్‌ ఒసాక 1-6, 6-3, 6-3తేడాతో విక్టోరియా అజరెంకా(బెలారస్‌)పై విజయం సాధించింది. సెమీస్‌లో స్టార్‌ ప్లేయర్‌ సెరెనా విలియమ్స్‌ను ఓడించిన 31 ఏండ్ల అజరెంకా తొలిసెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించినా.. ఆ తర్వాత ఒసాక సత్తాచాటింది.  2018 యూఎస్‌ ఓపెన్‌, 2019 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లు సాధించిన 22ఏండ్ల ఒసాకకు ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ. అలాగే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌ చేరిన ప్రతీసారి టైటిల్‌ సాధించిన రికార్డును ఒసాక కొనసాగించింది. 

 ఒసాక అద్వితీయ పోరాటం  

తొలి సెట్‌లో తీవ్ర తడబాటు, రెండో సెట్‌ ప్రారంభంలోనూ వెనుకబడిన నవోమీ ఒసాక ఆ తర్వాత అద్భుత పోరాటంతో ముందంజ వేసింది. 1-6తో తొలి సెట్‌ను అజరెంకాకు చేజార్చుకున్న జపాన్‌ స్టార్‌.. రెండో సెట్‌లోనూ 0-2తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. బలమైన షాట్లు, ఆత్మవిశ్వాసంతో కూడిన ఆటతో ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్‌ చేసుకుంటూ చివరికి 6-3 తేడాతో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఓ దశలో ఒసాక 4-1తో దూసుకెళ్లింది. అయితే అజరెంకా కాస్త ప్రతిఘటించడంతో చివరికి 6-3తో సెట్‌ను కైవసం చేసుకొని ఒసాక విజయం సాధించింది. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో తొలి సెట్‌ కోల్పోయినా మ్యాచ్‌ గెలువడం 1994(సంచెజ్‌ విసారియో) తర్వాత ఇదే తొలిసారి. మ్యాచ్‌ మొత్తం మీద ఒసాక ఆరు ఏస్‌లు, 34 విన్నర్లు బాదితే.. అజరెంకా మూడు ఏస్‌లు, 30 విన్నర్లు సాధించింది. కాగా కరోనా వైరస్‌ ఆందోళనతో మహిళల టాప్‌-2 ర్యాంకు ప్లేయర్లు ఆష్లే బార్టీ, సిమోనా హలెప్‌ ఈసారి టోర్నీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 

వర్ణ వివక్షపై ఒసాక గర్జన 

వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన గళాన్ని నవోమీ ఒసాక ప్రపంచానికి బలంగా వినిపించింది. గతంలో వివక్షకు బాధితులైన వారి పేర్లు ఉన్న మాస్కులతో యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌ నుంచి బరిలోకి దిగిన ఆమె ఫైనల్‌లోనూ ఆ పద్ధతిని కొనసాగించింది. 2014లో ఒహియోలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన 12ఏండ్ల నల్లజాతి బాలుడు తమిర్‌ రైస్‌ను స్మరించుకుంటూ అతడి పేరు ఉన్న మాస్కును ధరించింది. అలాగే గతంలో వివిధ ఘటనల్లో బాధితులైన బ్రెయోనా టేలర్‌, ఎలీజా మెక్‌క్లెయిన్‌, ట్రేవోన్‌ మార్టిన్‌, అహ్మౌద్‌ అర్బెరీ, జార్జ్‌ ఫ్లాయిడ్‌, ఫిలాండో క్లాస్టిలీ పేర్లతో ఉన్న మాస్కులను గత మ్యాచ్‌ల్లో ఒసాక ధరించి.. వారిని ప్రపంచానికి మరోసారి గుర్తుచేసింది. 

అతడే స్ఫూర్తి:  బ్రయాంట్‌కు ఒసాక నివాళి 

అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్‌ బ్రయాంట్‌కు యూఎస్‌ ఓపెన్‌ వేదికగా ఒసాక నివాళి అర్పించింది. టైటిల్‌ అందుకున్నాక బ్రయాంట్‌ జెర్సీని ధరించి కోర్టులో అడుగుపెట్టింది. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని ‘నేను ప్రతి మ్యాచ్‌ తర్వాత ఈ జెర్సీని ధరిస్తా. ఇది నాకు మరింత శక్తిని ఇస్తుందని అనుకుంటా’ అని రాసుకొచ్చింది. అలాగే బ్రయాంట్‌ తనకు స్ఫూర్తి అని, అతడు గర్వించేలా మరిన్ని విజయాలు సాధిస్తానని ఒసాక చెప్పింది. తాను భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరతానని కోబ్‌ అప్పుడే చెప్పాడని ఒసాక గుర్తు చేసుకుంది. 


logo