బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 07, 2020 , 23:42:07

ఇంట్లోనే భద్రం

ఇంట్లోనే భద్రం

  • కరోనాను ఎదుర్కొవాలంటే లాక్‌డౌన్‌ మేలు 
  • సమిష్టి పోరాటంతో మహమ్మారిని తరిమికొడతాం 
  • నమస్తే తెలంగాణతో నిఖత్‌ జరీన్‌ 

లాక్‌డౌన్‌ సమయంలో ప్రాక్టీస్‌ పక్కన పెట్టి.. కుటుంబంతో గడుపుతున్నానని తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పేర్కొంది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా యావత్‌ క్రీడాలోకం స్తంభించిపోయిన నేపథ్యంలో.. తాను కూడా ఇంట్లోనే ఉంటూ స్వల్పంగా సాధన చేస్తున్నానని ఆమె చెప్పింది. మానవ జాతి మునుపెన్నడూ చూడని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని.. ఇలాంటి విపత్కర స్థితిలో ప్రభుత్వ సూచనలను పాటిస్తూ.. ఇండ్లకే పరిమితమవడం మంచిదని ఆమె అంది. బాక్సింగ్‌ కెరీర్‌ ఎంచుకున్నప్పటి నుంచి ఇన్ని రోజులు ఎప్పుడూ ఇంట్లోలేనని అంటున్న నిఖత్‌.. ప్రస్తుతం అక్క కూతురుతో కాలక్షేపం చేస్తున్నట్లు చెప్పింది. 

ఇన్నేండ్లలో ఇదే తొలిసారి

బాక్సింగ్‌ కెరీర్‌గా ఎంచుకున్నప్పటి నుంచి ఇన్ని రోజులు ఎప్పుడూ ఇంట్లో లేను. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గత నెల 16న ఢిల్లీ నుంచి ఇంటికొచ్చా. అప్పటి నుంచి బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉం టున్నా.. ఒక్కోసారి నేను జైళ్లో ఉన్నానా అ నే ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఏం చేయగలం. ప్రస్తుత పరిస్థితి అలాంటిది. కొవిడ్‌-19 బారిన పడకుండా ఉండాలంటే ఇండ్లకే పరిమితమవడం మంచింది.

పంచింగ్‌ బ్యాగ్‌ కూడా లేదు

ఢిల్లీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఎప్పుడైనా ఇంటికి వస్తే.. షేక్‌పేట్‌ బాక్సింగ్‌ హాల్లో కాసేపు ప్రాక్టీస్‌ చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం ఇంటి టెర్రస్‌పై చిన్న చిన్న వ్యాయామాలు చేస్తున్నా. పంచింగ్‌ బ్యాగ్‌ అందుబాటులో లేకపోవడంతో.. జంపింగ్‌, స్కిప్పింగ్‌, షాడో బాక్సింగ్‌తో సరిపెడుతున్నా. రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఎప్పుడూ ఇంట్లో లేను. అలాంటిది ఇన్నాళ్లు ఉండటం కొంచెం కొత్తగా అనిపిస్తున్నది.

ప్రభుత్వాలు చెప్పేది మన మంచికే..

విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను అంద రూ పాటించాలి.  కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే.. లాక్‌డౌన్‌ సరైన మార్గం. ప్రజలంతా ఇండ్లలో ఉండటమే శ్రేయస్కరం. మహమ్మారిని తరిమికొట్టాలంటే.. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, సామాజిక దూరాన్ని పాటించాలి. వీలైనంత త్వరగా పరిస్థితులు మునుపటిలా మారాలని కోరుకుంటున్నా.

జన్నత్‌తో టైమ్‌పాస్‌

మా అక్క కూతురు (జన్నత్‌)తో కాలక్షేపం చేస్తున్నా. చిన్న పిల్లలతో ఆడుతుంటే సమయమే తెలియదు. సాధారణంగా ఎక్కువ టీవీ చూడను. నెట్‌ఫ్లిక్స్‌లో అప్పుడప్పుడు సినిమాలు చూస్తా. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ నా ఫేవరెట్‌. బాక్సింగ్‌ దిగ్గజం మహ్మద్‌ అలీకి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నా. అప్పుడప్పుడు ఇంటి పనుల్లో అమ్మకు సహాయపడుతున్నా.


logo