e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home స్పోర్ట్స్ నాదల్‌ నిష్క్రమణ

నాదల్‌ నిష్క్రమణ

నాదల్‌ నిష్క్రమణ
  • సెమీస్‌లో ఓడిన డిఫెండింగ్‌ చాంప్‌
  • ఫైనల్‌ చేరిన జొకోవిచ్‌
  • ఫ్రెంచ్‌ ఓపెన్‌

మట్టికోట మహారాజు రఫెల్‌ నాదల్‌కు చుక్కెదురైంది. ఇన్నాళ్లు అపజయమన్నదే ఎరుగకుండా ప్రత్యర్థుల పనిపట్టిన నాదల్‌కు సెర్బియా వీరుడు జొకోవిచ్‌ చెక్‌ పెట్టాడు. పెట్టనికోట లాంటి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో కొమ్ములు తిరిగిన నాదల్‌ అనూహ్యంగా నిష్ర్కమించాడు. అచ్చొచ్చిన మైదానంలో అప్రతిహతంగా దూసుకెళుదామనుకున్న స్పెయిన్‌ బుల్‌కు బ్రేక్‌లు పడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి హోరాహోరీగా సాగిన పోరులో ప్రపంచ నంబర్‌వన్‌ జొకో చేతిలో నాదల్‌ ఓటమి ఎదుర్కొన్నాడు. నాలుగున్నర గంటల పాటు జరిగిన మ్యాచ్‌లో విజయం కోసం ఇద్దరు కొదమసింహాల్లా తలపడ్డారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఎవరెస్ట్‌ శిఖరమంతటి రఫాను ఓడించిన జొకో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో గ్రీకువీరుడు సిట్సిపాస్‌తో జొకో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అనస్తాసియాను ఓడించిన క్రెజికోవా తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన పేరిట రాసుకుంది.

పారిస్‌: అచ్చొచ్చిన మైదానంలో రఫెల్‌ నాదల్‌కు మింగుడుపడని ఓటమి ఎదురైంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ చేజిక్కించుకొని పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాలనుకున్న స్పెయిన్‌ బుల్‌ నాదల్‌.. సెమీఫైనల్లో సెర్బియా స్టార్‌, ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సెమీస్‌లో జొకోవిచ్‌ 3-6, 6-3, 7-6 (7/4), 6-2తో నాదల్‌పై విజయం సాధించాడు. రోలాండ్‌ గారోస్‌లో 108 మ్యాచ్‌లు ఆడిన నాదల్‌కు ఇది మూడో (2009లో సోదర్లింగ్‌ చేతిలో, 2015, 21లో జొకోవిచ్‌ చేతిలో) పరాజయం కాగా.. అందులో రెండు సార్లు జొకోవిచ్‌ చేతిలోనే ఓడటం గమనార్హం. ఓవరాల్‌గా వీరిద్దరి మధ్య 58 మ్యాచ్‌లు జరుగగా.. జొకో 30 విజయాలు సాధించాడు.

- Advertisement -

తొలి సెట్‌ నెగ్గి కూడా..
ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మొదటి సెట్‌ గెలిచాక మ్యాచ్‌ కోల్పోని నాదల్‌ తొలిసారి జొకో చేతిలో పరాజయం పాలయ్యాడు. నాలుగు గంటలా 11 నిమిషాల పాటు సాగిన సంగ్రామంలో వరుసగా మూడు సెట్‌లు కోల్పోయిన నాదల్‌ నిరాశగా ఇంటిదారి పట్టాడు. మ్యాచ్‌ అనంతరం ‘అత్యుత్తమ ఆటగాడు గెలిచాడు’ అన్న నాదల్‌ వ్యాఖ్యలు జొకో ఆటతీరును స్పష్టం చేస్తున్నాయి. ఫైనల్‌ కాని ఫైనల్‌లో చెరో ఆరు ఏస్‌లు బాదగా.. జొకో 3 డబుల్‌ ఫాల్ట్స్‌ చేయగా.. నాదల్‌ 8 చేశాడు. జొకో 50 విన్నర్లు సంధిస్తే.. నాదల్‌ 48తో అతడికి సమీపంలోనే ఉన్నా.. అనవసర తప్పిదాలు భారీగా చేసిన నాదల్‌ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నాడు. మూడో సెట్‌లో తుదికంటా పోరాడిన నాదల్‌.. నాలుగో సెట్‌లో అదే జోరు కనబర్చలేకపోగా.. ఇదే అవకాశమన్నట్లు రెచ్చిపోయిన జొకోవిచ్‌ చిరస్మరణీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

జొకోవిచ్‌ x సిట్సిపాస్‌
సెమీస్‌లో నాదల్‌ను ఓడించిన టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఆదివారం జరుగనున్న మెగా ఫైనల్‌లో గ్రీక్‌ ప్లేయర్‌, ఐదో సీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. దిగ్గజాలకే వణుకు పుట్టించే జొకో ముందు 22 ఏండ్ల సిట్సిపాస్‌ ఏమాత్రం నిలువగలడో ఆదివారం తేలనుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుతం 18 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గి జాబితాలో రెండో స్థానంలో ఉన్న జొకోవిచ్‌.. మరో టైటిల్‌తో ఫెదరర్‌, నాదల్‌ (20)కు మరింత చేరువవ్వాలని తహతహలాడుతున్నాడు.

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ను రెండు సార్లు ఓడించిన ఏకైక ప్లేయర్‌ జొకోవిచ్‌
  • రోలాండ్‌ గారోస్‌లో తొలి సెట్‌ గెలిచాక మ్యాచ్‌ ఓడటం నాదల్‌కు ఇదే తొలిసారి
  • ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ను ఓడించిన రెండో ప్లేయర్‌ జొకోవిచ్‌
  • ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌కు ఇది మూడో పరాజయం
  • ఇప్పటివరకు 14 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిన నాదల్‌ 13 సార్లు టైటిల్‌ నెగ్గాడు
  • జొకోవిచ్‌, నాదల్‌ మధ్య జరిగిన పోరాటాల్లో 30 విజయాలతో జొకో ముందు వరుసలో నిలిచాడు.

‘మట్టి కోర్టులో నాదల్‌పై నెగ్గడమంటే ఎవరెస్ట్‌ అధిరోహించినంత కష్టమైన పని. రోలాండ్‌ గారోస్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే రఫాపై గెలుపు సాధారణ విషయం కాదు. ఇక్కడ నాకు ఇదే అత్యుత్తమ విజయమని చెప్పగలను. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో గత పదిహేనేండ్లుగా హవా కొనసాగిస్తున్న నాదల్‌పై విజయాన్ని ఎప్పటికీ మరువలేను’ –జొకోవిచ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాదల్‌ నిష్క్రమణ
నాదల్‌ నిష్క్రమణ
నాదల్‌ నిష్క్రమణ

ట్రెండింగ్‌

Advertisement