గురువారం 02 జూలై 2020
Sports - Apr 21, 2020 , 12:25:54

చిరాకుగా ఉంది: ఫెదరర్​తో నాదల్ ముచ్చట్లు

చిరాకుగా ఉంది: ఫెదరర్​తో నాదల్ ముచ్చట్లు

మాడ్రిడ్​: లాక్​డౌన్ కారణంగా టోర్నీలతో పాటు ప్రాక్టీస్ కూడా చేసే అవకాశం లేకపోవడం చిరాకుగా ఉందని 19 గ్రాండ్​స్లామ్ టైటిళ్ల విజేత, స్పెయిన్ స్టార్ రఫేల్ నాదల్ అన్నాడు. అయితే, ఈ విరామంలో తాను గాయం నుంచి కోలుకున్నానని స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ చెప్పాడు. ఇద్దరు టెన్నిస్ స్టార్లు ఇన్​స్టాగ్రామ్​ లైవ్​లో ముచ్చటించుకున్నారు.

“చాలా మంది వారివారి పనులు చేసుకుంటున్నా మనం మాత్రం ఎందుకు టెన్నిస్ ఆడలేకున్నామో నాకు అర్థం కావడం లేదు. టెన్నిస్​లో ఇద్దరు ప్లేయర్ల మధ్య ఎంతో దూరం ఉంటుంది. అయితే, మనం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని నాకు తెలుసు. అనూహ్య పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది నాకు అర్థమైంది. లాజిక్ లేని విషయాలు ఎన్ని జరుగుతున్నా మనం మాత్రం తప్పకుండా నిబంధలను పాటించాలి. నేను ప్రస్తుతం టెన్నిస్ ఆడడం లేదు. నా ఇంట్లో టెన్నిస్ కోర్ట్​ లేదు.. అందుకే ఆటను చాలా మిస్సవుతున్నట్టుంది’ ’ అని ఫెదరర్​తో నాదల్ అన్నాడు.

మరోవైపు.. ఫిబ్రవరిలో మోకాలికి శస్త్రచేయించుకున్న 20గ్రాండ్​స్లామ్ టైటిళ్ల వీరుడు ఫెదరర్.. గాయం నుంచి పూర్తిగా కోలుకుంటున్నానని చెప్పాడు. ‘నేను గోడకు బంతిని కొడుతూ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తున్నా. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నా. ప్రస్తుతం చాలా మెరుగ్గా ఉన్నా. కానీ ఆటకు ఇంకా సమయం ఉందనుకుంటున్నా’ అని ఫెదరర్ అన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ రద్దుకాగా ఫ్రెంచ్ ఓపెన్ సైతం సెప్టెంబర్​కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. 


logo