మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 08, 2020 , 02:03:35

నాదల్‌ 13వ సారి

నాదల్‌ 13వ సారి

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌ చేరిన స్పెయిన్‌ స్టార్‌..  సిట్సిపాస్‌, క్విటోవా, కెనిన్‌ ముందడుగు

పారిస్‌: ఫెదరర్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల(20) రికార్డును సమం చేయడమే లక్ష్యంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అడుగుపెట్టిన స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌ సెమీస్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ నాదల్‌ 7-6(7/4), 6-4, 6-1తేడాతో 19 ఏండ్ల అన్‌సీడెడ్‌ జానిక్‌ సినెర్‌(ఇటలీ)పై వరుససెట్లలో గెలిచాడు. తొలి సెట్‌లో సినెర్‌ దీటైన పోటీనివ్వడంతో ఓ దశలో 5-6తో వెనుకబడిన 12సార్లు చాంపియన్‌ నాదల్‌ ఆ తర్వాతి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. 13వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో అడుగుపెట్టిన రఫా.. డిగో స్వార్జ్‌మన్‌తో గురువారం తలపడనున్నాడు. ఇటీవల ఇటాలియన్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో డిగో చేతిలో రఫా పరాజయం చెందాడు. అయితే ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌ చేరిన ప్రతీసారి టైటిల్‌ సాధించిన రికార్డు నాదల్‌ది. అలాగే డిగోపై అంతకు ముందు స్పెయిన్‌ స్టార్‌ తొమ్మిదిసార్లు గెలిచాడు. కాగా థీమ్‌, స్వార్జ్‌మన్‌ మధ్య మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ 5గంటలకు పైగా సాగడంతో నాదల్‌ మ్యాచ్‌ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. శీతల వాతావరణంలో ఒకేరోజులు ఎక్కు వ మ్యాచ్‌లపై రఫా కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరో క్వార్టర్స్‌లో ఐదో సీడ్‌ స్విస్‌ ప్లేయర్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ 7-5, 6-2, 6-3తేడాతో 13వ సీడ్‌ ఆండీ రుబ్లేవ్‌పై సునాయాసంగా గెలిచాడు. 

క్విటోవా X కెనిన్‌ 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ సెమీ పైనల్‌లో నాలుగో సీడ్‌ పెట్రా క్విటోవా(చెక్‌ రిపబ్లిక్‌), సోఫియా కెనిన్‌(అమెరికా), అన్‌సీడెడ్‌ టీనేజర్‌ ఇగా స్విటెక్‌(పొలాండ్‌) అడుగుపెట్టారు. క్వార్టర్స్‌లో క్విటోవా 6-3, 6-3 తేడాతో లారా సిగ్మెండ్‌(జర్మనీ)పై గెలిచి 2012 తర్వాత తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌ చేరుకుంది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ కెనిన్‌ 6-4, 4-6, 6-0 తేడాతో తన దేశానికే చెందిన రోస్‌ కాలిన్స్‌పై గెలిచి, సెమీస్‌లో క్విటోవాతో తలపడేందుకు సిద్ధమైంది. మరో మ్యాచ్‌లో 19 ఏండ్ల అన్‌సీడెడ్‌ స్విటెక్‌  6-3, 6-1 తేడాతో మార్టినా ట్రెవిసన్‌పై గెలిచి 1939 తర్వాత ఈ టోర్నీ సెమీస్‌ చేరిన తొలి పొలాండ్‌ క్రీడాకారిణిగా రికార్డుకెక్కింది. ప్రి క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ హలెప్‌ను ఓడించిన స్విటెక్‌.. క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ స్వితోలినాను మట్టికరిపించిన పొదొరొస్కా సెమీస్‌లో తలపడనున్నారు. అలాగే మ హిళల డబుల్స్‌లోనూ స్వి టెక్‌ సెమీస్‌కు చేరింది. 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌ 

మహిళల సింగిల్స్‌ 

క్విటోవా x కెనిన్‌ 

స్విటెక్‌ x పొదొరొస్కా 

పురుషుల సింగిల్స్‌ 

నాదల్‌ x స్వార్జ్‌మన్‌