బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Aug 25, 2020 , 12:55:54

ధోనీ, కోహ్లీ, రోహిత్‌ సహా 50 మంది క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్షలు

ధోనీ, కోహ్లీ, రోహిత్‌  సహా 50 మంది   క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్షలు

ఢిల్లీ: రాబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌లో పాల్గొనే క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు   జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) సిద్ధమైంది.  యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి  చెందిన జాతీయ డోపింగ్‌ నిరోధక కమిటీ (నాడో)తో కలిసి క్రికెటర్ల శాంపుల్స్‌ సేకరిస్తామని  నాడా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.   

 యూఏఈలో   సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మ్యాచ్‌ వేదికల్లో    ఆటగాళ్లకు పరీక్షలు  నిర్వహించనున్నట్లు నాడా డైరెక్టర్‌ జనరల్‌ నవీన్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.  యూఏఈలో నాడా ఐదు డోపింగ్‌ కంట్రోల్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. దుబాయ్‌, అబుదాబి, షార్జాలో ఒక్కో సెంటర్‌ను ఏర్పాటు చేయనుండగా శిక్షణా వేదికలు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ, అబుదాబిలోని  జాయేద్‌ క్రికెట్‌ స్టేడియంలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

ఆటగాళ్ల మూత్రం శాంపిల్స్‌తో పాటు రక్త నమూనాలను కూడా నాడా సేకరించవచ్చు.  ప్రముఖ భారత క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, మహేంద్రసింగ్‌ ధోనీ  సహా స్టార్ క్రికెటర్లు 50 మంది నుంచి  శాంపిళ్లను సేకరించనున్నారు. నాడాకు చెందిన మూడు బృందాలు వేర్వేరు బ్యాచ్‌ల్లో యూఏఈకి వెళ్లనున్నాయి.  ఫస్ట్‌ బ్యాచ్‌ సెప్టెంబర్‌ మొదటి వారంలో బయలుదేరుతుంది. ఆ తర్వాత మిగతా బృందాలు వెళ్తాయి. యూఏఈ వెళ్లడానికి ముందే అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. 


logo