న్యూయార్క్: బ్రిటిష్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం రాత్రి ఇక్కడ జరిగిన యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లో ముర్రే 2-6, 6-7(7/9), 6-3, 3-6, 4-6తో ప్రపంచ మూడో ర్యాంకర్ స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఐదు గంటల పాటు సాగిన ఈ మారథాన్ మ్యాచ్‌లో ముర్రే, స్టెఫనోస్ నువ్వా నేనా అన్నట్లు తలబడ్డారు. కానీ స్టెఫనోస్ తీసుకున్న విరామం ముర్రే కొంపముంచింది. మూడో సెట్ తర్వాత టాయిలెట్‌కు వెళ్లిన స్టెఫనోస్.. నాలుగో సెట్‌కు ముందు మెడికల్ ఎమర్జెన్సీ కోసం మరోసారి బ్రేక్ తీసుకున్నాడు. ఇది ముర్రే ఆట మీద తీవ్ర ప్రభావం చూపించింది. దీనిపై అతడు అంపైర్, మ్యాచ్ సూపర్వైజర్లకు ఫిర్యాదు కూడా చేశాడు. తరుచూ బ్రేక్ తీసుకుంటున్న సిట్సిపాస్‌పై ‘టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి కదా.. అతడు అక్కడికెందుకు వెళ్తున్నాడు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇదే విషయమై మ్యాచ్ అనంతరం ముర్రే స్పందిస్తూ.. ‘నేను ఈ మ్యాచ్ గెలుస్తానని కచ్చితంగా చెప్పకపోవచ్చు. కానీ ఇది (సిట్సిపాస్ విరామాలు) నా ఆటపై తీవ్ర ప్రభావం చూపింది. అతన్ని నేను చాలా గౌరవిస్తాను. అతడు అద్భుత ఆటగాడు. కానీ దీని తర్వాత అతడి మీద గౌరవం పోయింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.