శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 11, 2020 , 23:09:31

IPL 2020: ముంబై అదరహో

IPL 2020:  ముంబై అదరహో

అబుదాబి: ఐపీఎల్‌-13లో    డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌  మరో అద్భుత  విజయాన్ని నమోదు చేసింది.     బౌలింగ్‌, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ  అద్భుత విన్యాసాలు చేసిన  ముంబై ఇండియన్స్‌   5 వికెట్లతో   ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది.  సీజన్‌లో ఢిల్లీకి రెండో పరాజయం మాత్రమే.  క్వింటన్‌ డికాక్‌(53: 36 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌(53: 32 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో  163 పరుగుల లక్ష్యాన్ని  రెండు  బంతులు మిగిలుండానే  5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  చివరి ఓవర్‌ వరకూ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది.  మెరుగైన  రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో  ముంబై అగ్రస్థానానికి చేరింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన  ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో  4 వికెట్లకు  162 పరుగులు చేసింది.   ఓపెనర్ శిఖర్‌ ధావన్‌(69 నాటౌట్:‌ 52 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌ )  అర్ధశతకంతో రాణించగా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(42: 33 బంతుల్లో 5ఫోర్లు) కెప్టెన్‌  ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.   ఇన్నింగ్స్‌ ఆద్యంతం ధావన్‌ చూడచక్కని షాట్లతో అలరించాడు.  ముంబై  బౌలర్లు  సత్తా చూపడంతో   ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది.   కృనాల్‌ పాండ్య(2/26), ట్రెంట్‌ బౌల్ట్‌(1/36) ఢిల్లీని  దెబ్బ తీశారు. 

ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన ఐదో ఓవర్లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ డికాక్‌, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సూర్య కుమార్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు.   ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన డికాక్‌  33 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  డికాక్‌ మెరుపులతో ముంబై వేగంగా లక్ష్యం దిశగా  దూసుకెళ్లింది. తొలి మూడు ఓవర్లలో పరుగులు రాబట్టడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన ముంబై  డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపులతో  స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.  అశ్విన్‌ వేసిన 10వ ఓవర్లో డికాక్‌ ఔటైన తర్వాత ముంబై స్కోరు వేగం తగ్గింది. రబాడ వేసిన తర్వాతి ఓవర్లో కేవలం 3 పరుగులు వచ్చాయి.  మధ్య ఓవర్లలో  ఢిల్లీ  బౌలర్లు పరుగులను నియంత్రించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

అక్షర్‌ వేసిన 13వ ఓవర్లో  సూర్యకుమార్‌ రెండు ఫోర్లు బాది 12 రన్స్‌ రాబట్టాడు.   రబాడ వేసిన 15వ ఓవర్లో ఫోర్‌, సిక్సర్‌ కొట్టి అర్ధశతకం పూర్తి చేసుకొని అదే ఓవర్లో పెవిలియన్‌ చేరాడు.  సమీకరణం 30 బంతుల్లో 33 పరుగులుగా మారింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్య..స్టాయినీస్‌ వేసిన తర్వాతి ఓవర్లో కీపర్‌ క్యాచ్‌కు ఔటయ్యాడు.  ఆఖర్లో యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌(28: 15 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు)  చెప్పుకోదగ్గ  ప్రదర్శన చేశాడు.  ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు అవసరం కాగా కృనాల్‌ పాండ్య(12 నాటౌట్‌) రెండు ఫోర్లు కొట్టి విజయాన్నందించాడు.  పొలార్డ్‌(11 నాటౌట్‌)  అతనికి  సహకరించాడు.