గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 07, 2020 , 01:33:44

రాజస్థాన్‌పై రోహిత్‌ సేన విజయం

రాజస్థాన్‌పై రోహిత్‌ సేన విజయం

బ్యాట్స్‌మెన్‌ సూపర్‌ ఫామ్‌కు.. బౌలర్ల నిలకడ తోడవడంతో ముంబై ఇండియన్స్‌ నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అజేయ ఇన్నింగ్స్‌కు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, హార్డ్‌ హిట్టర్‌ హార్దిక్‌ పాండ్యా మెరుపులు జత కలవడంతో భారీ స్కోరు చేసిన ముంబై.. ఆనక బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌ విజృంభించడంతో పాయింట్ల పట్టికలో  మళ్లీ అగ్రస్థానానికి చేరింది. 

అబుదాబి: ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఎదురైన వరుస పరాజయాలకు ముంబై ఇండియన్స్‌ చెక్‌ పెట్టింది. మంగళవారం ఇక్కడి షేక్‌ జాయెద్‌ స్టేడియంలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (47 బంతుల్లో 79 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో చెలరేగగా.. రోహిత్‌ శర్మ (23 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (19 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌) ధాటిగా ఆడారు. రాజస్థాన్‌ బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో స్మిత్‌ సేన 18.1 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్‌ విఫలం కాగా.. బట్లర్‌ (44 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా 4, బౌల్ట్‌, ప్యాటిన్‌సన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూర్యకుమా ర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

ఖాతా తెరిచిన కార్తీక్‌ త్యాగి

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబైకి చక్కటి ఆరంభం లభించింది. రాజ్‌పుత్‌ వేసిన మూడో ఓవర్‌లో హిట్‌మ్యాన్‌ 6,4 కొడితే.. ఆర్చర్‌కు డికాక్‌ (15 బంతుల్లో 23; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) అదే శిక్ష వేశాడు. ధాటిగా ఆడుతున్న డికాక్‌ను ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న కార్తీక్‌ త్యాగి ఔట్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో గోపాల్‌ వరుస బంతుల్లో రోహిత్‌, ఇషాన్‌ కిషన్‌ (0)ను ఔట్‌ చేయడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై 90/3తో నిలిచింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ పొందిన కృనాల్‌ పాండ్యా (12) ఆకట్టుకోలేకపోయినా.. సూర్యకుమార్‌ చివరి వరకు క్రీజులో నిలిచి ముంబైకి భారీ స్కోరు అందించాడు.

టాప్‌ విఫలం

ఛేజింగ్‌లో రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఓవర్‌కో వికెట్‌ చొప్పున తొలి మూడు ఓవర్లలో రాయల్స్‌ 3 వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్‌ (0), స్మిత్‌ (6), శాంసన్‌ (0) విఫలమయ్యారు. దీంతో 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌ను బట్లర్‌ ఆదుకున్నాడు. అతడికి కాసేపు లోమ్రర్‌ (11), టామ్‌ కరన్‌ (15) సహకారం అందించారు. ఎడాపెడా బౌండ్రీలతో విరుచుకుపడిన బట్లర్‌ను ప్యాటిన్‌సన్‌ ఔట్‌ చేయడంతో రాజస్థాన్‌ ఓటమి ఖాయమైంది. 

సూపర్‌ సూర్య 

త్యాగి వేసిన తొమ్మిదో ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన సూర్యకుమార్‌.. గోపాల్‌ ఓవర్‌లో రెండు బౌండ్రీలు కొట్టాడు. మరో ఎండ్‌ నుంచి హార్దిక్‌ కూడా ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. టామ్‌ కరన్‌ ఓవర్‌లో 6,4 అరుసుకున్న సూర్యకుమార్‌.. ఆర్చర్‌ వేసిన సూపర్‌ ఫాస్ట్‌ బంతిని వికెట్ల వెనుక సిక్సర్‌గా మలిచాడు. ఆర్చర్‌ గంటకు 152 కిలో మీటర్ల వేగంతో బౌన్సర్లు విసురుతున్నా ఏమా త్రం తడబడకుండా క్రీజులో ఏబీ డివిలియర్స్‌ను తలపించిన సూర్యకుమార్‌.. రాజస్థాన్‌కు భారీ టార్గెట్‌ నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.

స్కోరు బోర్డు

ముంబై: డికాక్‌ (సి) బట్లర్‌ (బి) త్యాగి 23, రోహిత్‌ (సి) తెవాటియా (బి) గోపాల్‌ 35, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 79, ఇషాన్‌ (సి) శాంసన్‌ (బి) గోపాల్‌ 0, కృనాల్‌ (సి) గోపాల్‌ (బి) ఆర్చర్‌ 12, హార్దిక్‌ (నాటౌట్‌) 30, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 20 ఓవర్లలో 193/4. వికెట్ల పతనం: 1-49, 2-88, 3-88, 4-117, బౌలింగ్‌: రాజ్‌పుత్‌ 3-0-42-0, గోపాల్‌ 4-0-28-2, ఆర్చర్‌ 4-0-34-1, త్యాగి 4-0-36-1, టామ్‌ కరన్‌ 3-0-33-0, తెవాటియా 2-0-13-0. 

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 0, బట్లర్‌ (సి) పొలార్డ్‌ (బి) ప్యాటిన్‌సన్‌ 70, స్మిత్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 6, శాంసన్‌ (సి) రోహిత్‌ (బి) బౌల్ట్‌ 0, లోమ్రర్‌ (సి) (సబ్‌) అనుకూల్‌ రాయ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 11, టామ్‌ కరన్‌ (సి) హార్దిక్‌ (బి) పొలార్డ్‌ 15, తెవాటియా (బి) బుమ్రా 5, ఆర్చర్‌ (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 24, గోపాల్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 1, రాజ్‌పుత్‌ (సి) రోహిత్‌ (బి) ప్యాటిన్‌సన్‌ 2, త్యాగి (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 18.1 ఓవర్లలో 136. వికెట్ల పతనం: 1-0, 2-7, 3-12, 4-42, 5-98, 6-108, 7-113, 8-115, 9-136, 10-136, బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-26-2, బుమ్రా 4-0-20-4, ప్యాటిన్‌సన్‌ 3.1-0-19-2, రాహుల్‌ చాహర్‌ 3-0-24-1, కృనాల్‌ 2-0-22-0, పొలార్డ్‌ 2-0-24-1.