శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Nov 05, 2020 , 19:28:03

దుమ్ములేపుతున్న ముంబై ఇండియన్స్‌.. నాలుగోసారి టాప్‌లో!

దుమ్ములేపుతున్న ముంబై ఇండియన్స్‌.. నాలుగోసారి టాప్‌లో!

ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ నిలకడకు మారుపేరుగా మారింది. ప్రతి సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో అదరగొడుతున్నది. రికార్డు స్థాయిలో ఇప్పటికే నాలుగు సార్లు కప్‌ను కైవసం చేసుకున్న ముంబై..ఐదో సారి టైటిల్‌ను ఒడిసిపట్టుకునేందుకు పట్టుదలతో ముందుకు సాగుతున్నది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ను ఓటమితో మొదలుపెట్టిన ముంబై ..ఆ తర్వాత వరుస విజయాలతో ప్రత్యర్థుల భరతం పట్టింది.

గాయంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాలుగు మ్యాచ్‌లకు దూరమైనా వెరవకుండా విజయాలు సాధించింది. ఈ క్రమంలో 13 ఏండ్ల ఐపీఎల్‌ చరిత్రలో ముంబై అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో నాలుగోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అధిష్టించింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు అందుకున్న ముంబై 18 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. 2010లో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్న రోహిత్‌సేన  2017, 2019, 2020 మళ్లీ అదే ప్రదర్శనను పునరావృతం చేసింది. ముంబై తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌(2), ఢిల్లీ క్యాపిటల్స్‌(2) కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌, గుజరాత్‌ లయన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఒక్కోసారి పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని దక్కించుకున్నాయి. రెండుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాత్రం ఇప్పటి వరకు ఏ సీజన్‌లోనూ అగ్రస్థానంలో నిలువకపోవడం విశేషం. 

ఢిల్లీ అరుదైన రికార్డు: 

ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన రికార్డు సొంతం చేసింది. ఆర్‌సీబీపై విజయంతో ఈ సీజన్‌లో రెండో స్థానంతో  ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కించుకున్న ఢిల్లీ..ఇప్పటి వరకు 13 సీజన్లలో వేర్వేరు స్థానాల్లో నిలిచిన ఏకైక రికార్డు అందుకుంది. 2008 నుంచి 2013 వరకు టాప్‌ నుంచి అన్ని స్థానాలను ఢిల్లీ దక్కించుకోవడం విశేషం. 

1) 2009, 12 

2) 2020 

3) 2019 

4) 2008 

5) 2010 

6) 2016, 17

7) 2015 

8) 2014, 18 

9) 2013

10) 2011