శుక్రవారం 03 జూలై 2020
Sports - Apr 06, 2020 , 16:59:30

చెన్నైకంటే ముంబై ఇండియన్స్ బెస్ట్: మంజ్రేకర్

చెన్నైకంటే ముంబై ఇండియన్స్ బెస్ట్: మంజ్రేకర్

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్​(ఐపీఎల్​)లో చెన్నై సూపర్ కింగ్స్ కన్నా ముంబై ఇండియన్స్ అత్యుత్తమ జట్టుగా మారిందని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్​ ఫైనల్స్​లో ధోనీ సారథ్యంలోని చెన్నై కంటే రోహిత్ కెప్టెన్సీలో ముంబై అద్భత ప్రదర్శన చేసిందని కితాబిచ్చాడు.

12సీజన్ల ఐపీఎల్ చరిత్రలో 8సార్లు ఫైనల్స్ చేరిన చెన్నై మూడుసార్లు టైటిల్ సాధించగా.. 5సార్లు తుదిపోరుకు అర్హత సాధించిన ముంబై 4సార్లు విజేతగా నిలిచింది. 2019 సీజన్ ఫైనల్లో చెన్నైపై ముంబై గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనే ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో మంజ్రేకర్ మాట్లాడాడు.

“ఐపీఎల్ 12ఏండ్లుగా జరుగుతున్నది. విజయాల శాతం చెన్నై సూపర్ కింగ్స్​కే ఎక్కువగా ఉంది. కానీ సీజన్ రెండో అర్ధభాగంలో ముంబైకే ఎక్కువ విజయాలు ఉన్నాయి. టైటిళ్ల విషయంలోనూ ఆ జట్టే ముందుంది. ముంబై నాలుగు టైటిళ్లు గెలిచింది. చెన్నై మూడుసార్లే విజేతగా నిలిచినా తక్కువ సీజన్లు ఆడింది. అయితే కొన్నేండ్లుగా చెన్నై కంటే ముంబై జట్టు బెస్ట్ జట్టుగా ఎదుగుతున్నది. సీఎస్కే ఆధిపత్యానికి ప్రమాదంగా మారింది. మొత్తంగా చెప్పాలంటే చెన్నై కంటే ముంబై ఇండియన్స్ అత్యుత్తమ జట్టు” అని మంజ్రేకర్ చెప్పాడు.

కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. మహమ్మారి తీవ్రత పెరుగుతుండడంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై తీవ్ర సందిగ్ధత ఏర్పడింది.


logo