బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 24, 2020 , 01:37:40

ముంబై మురిసె

ముంబై మురిసె

సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌.. రెండో మ్యాచ్‌లో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌లో రోహిత్‌ ముందుండి నడిపించడంతో భారీ స్కోరు చేసిన ముంబై.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న కమిన్స్‌ కోటా పూర్తి చేయలేకపోగా.. నమ్ముకున్న హార్డ్‌ హిట్టర్లు కోల్‌కతాను నట్టేట ముంచారు. 

అబుదాబి: తొలి మ్యాచ్‌ ఓటమితో కసిమీదున్న ముంబై రెండో మ్యాచ్‌లో పంజా విసిరింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన రోహిత్‌ సేన బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (54 బంతుల్లో 80; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (47; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఆకట్టుకున్నాడు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో శివమ్‌ మావి 2 వికెట్లు పడగొట్టాడు. పాట్‌ కమిన్స్‌ (0/49) నిరాశ పరిచాడు. లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది కమిన్స్‌ (12 బంతుల్లో 33; 1 ఫోర్‌, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌. ముంబై బౌలర్లలో బౌల్ట్‌, ప్యాటిన్‌సన్‌, బుమ్రా, రాహుల్‌ చాహర్‌ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

సారథి చూపిన బాటలో..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (1) రెండో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌.. క్రీజులో అడుగుపెట్టడంతోనే రెచ్చిపోయాడు. సందీప్‌ వారియర్‌ వేసిన మూడో ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. మరో ఎండ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ సిక్సర్లపై దృష్టి పెట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 59/1తో నిలిచింది. రెండో వికెట్‌కు 90 పరుగులు జోడించాక సూర్యకుమార్‌ రనౌట్‌ కాగా.. నైట్‌రైడర్స్‌ బౌలర్లు పుంజుకోవడంతో వరుసగా నాలుగు ఓవర్లపాటు ఒక్క బౌండ్రీ కూడా నమోదు కాలేదు. సౌరభ్‌ తివారి (21) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడటంతో తిరిగి స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. సెంచరీ చేసేలా కనిపించిన రోహిత్‌ను శివమ్‌ మావి బోల్తా కొట్టించాడు. హార్దిక్‌ పాండ్యా (18) కూడా ఎక్కువసేపు నిలువలేకపోగా.. పొలార్డ్‌ (13 నాటౌట్‌) విలువైన పరుగులతో జట్టును 200కు చేరువ చేశాడు. 

మూకుమ్మడిగా..

భీకర హిట్టర్లతో కూడిన నైట్‌రైడర్స్‌కు ఛేజింగ్‌ ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు గిల్‌ (7), నరైన్‌ (9) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కోల్‌కతా 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ కార్తీక్‌ (30), నితీశ్‌ రాణా (24) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత భుజానికెత్తుకున్నారు. అయితే ఈ జోడీ మరీ నెమ్మదిగా ఆడటంతో సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరిగిపోయింది. కీలక దశలో క్రీజులోకివచ్చిన మోర్గాన్‌ (16), రస్సెల్‌ (11) భారీ షాట్లకు వెళ్లి వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో కోల్‌కతా ఓటమి ఖాయం కాగా.. చివర్లో కమిన్స్‌ ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. 

స్కోరు బోర్డు

ముంబై: డికాక్‌ (సి) నిఖిల్‌ (బి) శివమ్‌ 1, రోహిత్‌ (సి) కమిన్స్‌ (బి) శివమ్‌ 80, సూర్యకుమార్‌ (రనౌట్‌) 47, తివారి (సి) కమిన్స్‌ (బి) నరైన్‌ 21, హార్దిక్‌ (హిట్‌వికెట్‌) రస్సెల్‌ 18, పొలార్డ్‌ (నాటౌట్‌) 13, కృనాల్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 20 ఓవర్లలో 195/5. వికెట్ల పతనం: 1-8, 2-98, 3-147, 4-177, 5-180, బౌలింగ్‌: సందీప్‌ 3-0-34-0, శివమ్‌ 4-1-32-2, కమిన్స్‌ 3-0-49-0, నరైన్‌ 4-0-22-1, రసెల్‌ 2-0-17-1, కుల్దీప్‌ 4-0-39-0.

కోల్‌కతా: గిల్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 7, నరైన్‌ (సి) డికాక్‌ (బి) ప్యాటిన్‌సన్‌ 9, కార్తీక్‌ (ఎల్బీ)చాహర్‌ 30, రాణా (సి) హార్దిక్‌ (బి) పొలార్డ్‌ 24, మోర్గాన్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 16, రస్సెల్‌ (బి) బుమ్రా 11, నిఖిల్‌ (సి) హార్దిక్‌ (బి) బౌల్ట్‌ 1, కమిన్స్‌ (సి) హార్దిక్‌ (బి) ప్యాటిన్‌సన్‌ 33, శివమ్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 9, కుల్దీప్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 146/9. వికెట్ల పతనం: 1-14, 2-25, 3-71, 4- 77, 5-100, 6-101, 7-103, 8-141, 9-146, బౌలింగ్‌: బౌల్ట్‌ 4-1-30-2, ప్యాటిన్‌సన్‌ 4-0-25-2, బుమ్రా 4-0-32-2, చాహర్‌ 4-0-26-2, పొలార్డ్‌ 3-0-21-1, కృనాల్‌ 1-0-10-0. 

ఐపీఎల్‌లో ఒక ప్రత్యర్థి(కోల్‌కతా)పై అత్యధిక పరుగులు(904) పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ నిలిచాడు. ఈ క్రమంలో వార్నర్‌(829), కోహ్లీ(825, ఢిల్లీపై)ని హిట్‌మ్యాన్‌ అధిగమించాడు. 

ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన నాలుగో క్రికెటర్‌ రోహిత్‌ నిలిచాడు. గేల్‌, డివిలియర్స్‌, ధోనీ ముందువరుసలో ఉన్నారు. 


logo